బుజ్జాయి చర్మం జాగ్రత్త

చలి గాలులు పెరుగు తున్నాయి. వీటితో పాపాయి చర్మం పొడారే ప్రమాదం ఉంది. దీంతో దురద, పగుళ్లు వంటి పలు చర్మ సమస్యలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

Published : 18 Nov 2022 00:16 IST

చలి గాలులు పెరుగు తున్నాయి. వీటితో పాపాయి చర్మం పొడారే ప్రమాదం ఉంది. దీంతో దురద, పగుళ్లు వంటి పలు చర్మ సమస్యలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ చలి కాలంలో పాపాయి సున్నితమైన చర్మాన్ని సంరక్షించాలంటే ఏం చేయాలో చెబుతున్నారు నిపుణులు...

ఏడాదిలోపు పాపాయి చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయించాలి. అరగంట ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను ఒళ్లంతా రాసి మృదువుగా మర్దనా చేయాలి. దీంతో రక్తప్రసరణ మెరుగ్గా జరిగి, చర్మాన్ని తేమగా మారుస్తుంది. లేదంటే చలిగాలులకు పాపాయి చర్మం త్వరగా పొడిబారి దురద మొదలవుతుంది.

తేమగా.. చలికాలంలో సబ్బుతో బుజ్జాయిని స్నానం చేయించకూడదు. సహజపదార్థాలైన పెసరపిండిలో కొన్ని చుక్కల నీటిని కలిపి పేస్టులా చేసి ఒంటికి రాయాలి. చేతులను తడిచేసుకొని మృదువుగా ఒంటినంతా మర్దనా చేసి స్నానం చేయిస్తే చాలు. చర్మకణాల్లోని మురికి దూరమై, శుభ్రపడి తేమగానూ ఉంటుంది. మెత్తని కాటన్‌ వస్త్రంతో తుడిచి, అరచేతిలోకి నాలుగుచుక్కల బాదంనూనె తీసుకొని పాపాయి ఒంటికంతా మృదువుగా రాయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేసి పొడారడాన్ని తగ్గిస్తుంది.

ఓట్‌మీల్‌తో.. కప్పు ఓట్స్‌ను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసి జల్లించి నీటిని కలిపి పేస్టులా చేయాలి. చిన్న టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపి అందులో ముందుగా చేసి ఉంచిన ఓట్స్‌ ముద్దను నీటిలో కలపాలి. ఆ తర్వాత ఈ నీటిలో బుజ్జాయిని కూర్చోబెట్టి మృదువుగా రుద్దాలి. మరోసారి గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తే, చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.

మాయిశ్చరైజర్‌తో.. స్నానం తర్వాత రాసే మాయిశ్చరైజర్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల రసాయనాల బాధ తప్పుతుంది.కప్పు చొప్పున ద్రాక్ష గింజల నూనె, బాదం, ఆలివ్‌ ఆయిల్‌ను గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి రెండు లేదా మూడు విటమిన్‌ ఈ గుళికలు కట్‌ చేసి వేసి మరోసారి కలిపి పొడి గాజుసీసాలో నింపాలి. ఇది రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. యాంటీ ఆక్సిండెట్స్‌ పుష్కలంగా ఉండే ఈ మాయిశ్చరైజర్‌తో పాపాయి చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. స్నానం తర్వాత మృదువుగా ఈ నూనెతో మర్దనా చేస్తే చాలు. చర్మం పొడిబారదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్