వారెవ్వా... వాల్‌నట్స్‌

అధికబరువును నియంత్రిస్తూ, రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేసి, వృద్ధాప్యఛాయలను త్వరగా దరికి రానివ్వకుండా చేయగలిగే శక్తి వాల్‌నట్స్‌కుంది.

Published : 27 Nov 2022 00:06 IST

అధికబరువును నియంత్రిస్తూ, రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేసి, వృద్ధాప్యఛాయలను త్వరగా దరికి రానివ్వకుండా చేయగలిగే శక్తి వాల్‌నట్స్‌కుంది. మహిళల అందాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఇ, బి6 విటమిన్లు, మెలటోనిన్‌, పాలీఫినాల్స్‌, థయామిన్‌, పాస్ఫరస్‌వంటివి వీటిలో పుష్కలంగా ఉండటంతో వారెవ్వా వాల్‌నట్స్‌ అంటున్నారు పోషకాహార నిపుణులు.

చర్మ ఆరోగ్యంలో ఇవి ప్రధానపాత్ర వహిస్తాయి. ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఇ విటమిన్‌ పోరాడతాయి. దీంతో త్వరగా వృద్ధాప్యఛాయలు దరికి చేరవు. చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లోని బయోటిన్‌ శిరోజాలను ఆరోగ్యంగా ఉంచి రాలే సమస్యను దూరం చేయడంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇ విటమిన్‌ శిరోజాలను నల్లగా నిగనిగలాడేలా ఉంచి బాలమెరుపు సమస్యను రానివ్వదు.   

రొమ్ము క్యాన్సర్‌కు దూరంగా.. ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు, ఫైటోస్టెరాల్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే వాల్‌నట్స్‌ను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ బయో యాక్టివ్‌ కాంపొనెంట్స్‌ క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కణితులను అభివృద్ధి చెందనివ్వవు. దీంతో రొమ్ముక్యాన్సర్‌వంటి అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. హృద్రోగాలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌పై వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ పోరాడతాయి.

కీళ్లనొప్పుల నుంచి.. వాల్‌నట్స్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు, ఇ, బి6 విటమిన్లు, కాపర్‌ ఎటువంటి వ్యాధులు కలగకుండా పరిరక్షిస్తాయి. ఆస్త్మా, కీళ్లనొప్పులు, టైప్‌2 మధుమేహం వంటి పలురకాల అనారోగ్యాలకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌పై వాల్‌నట్స్‌లోని పాలీఫినాల్స్‌ పోరాడతాయి. ఒమేగా-3 కొవ్వు, మెగ్నీషియం, అమినోయాసిడ్‌ కూడా దీన్ని తగ్గించడంతో మోకాళ్ల నొప్పులు దరికి చేరవు.

అధికబరువును.. వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ప్రీబయోటిక్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. వాల్‌నట్స్‌ను తీసుకున్నప్పుడు ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు, విటమిన్లు కడుపునిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తాయి. దీంతో అధికబరువు సమస్యకు దూరంగా ఉండొచ్చు. పరగడుపున గుప్పెడు వాల్‌నట్స్‌ తీసుకొంటే ప్రయోజనాలెక్కువ. చిరుధాన్యాలతో లేదా సలాడ్లలో కలిపి తీసుకుంటే మంచిది. 

ముఖారవిందానికి.. నాలుగు వాల్‌నట్స్‌, రెండు చెంచాల ఓట్స్‌, చెంచా చొప్పున తేనె, క్రీం, నాలుగుచుక్కల ఆలివ్‌నూనె కలిపి మిక్సీలో మెత్తని మిశ్రమంగా చేయాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ముఖచర్మం మెరుపులీనుతుంది. నల్లని మచ్చలు మాయమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్