నెలసరిలో శుచిగా, సౌఖ్యంగా...

నెలసరి అత్యంత సహజమని తెలిసినా ఆ ప్రస్తావన వస్తే చాలు అమ్మాయిలు సిగ్గుపడతారు.

Published : 27 Nov 2022 00:05 IST

నెలసరి అత్యంత సహజమని తెలిసినా ఆ ప్రస్తావన వస్తే చాలు అమ్మాయిలు సిగ్గుపడతారు. ఇంకొందరయితే తామేదో తప్పుచేసినట్లు భయపడతారు. ఆ సమయంలో తమ సమస్యలు చెప్పుకోలేక అవస్థ పడుతుంటారు. దీన్ని నివారించేందుకు పుట్టిందే ఎకోఫెమే...

ఎక్కువశాతం మహిళలు డిస్‌పోజబుల్‌ శానిటరీ నాప్‌కిన్లు వాడుతున్నా పేద సాదలకు వాటిని కొనే శక్తి లేదు. ఇంకా బాధాకరమేమంటే చాలామందికి ఆ సమయంలో పరిశుభ్రత పాటించేంత అవకాశం కూడా లేదు. దాంతో అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికీ మన దేశంలో నెలసరి గురించి బాహాటంగా మాట్లాడాలంటే హడలి పోతారు. ఇక దిగువ తరగతి స్త్రీలు నెలనెలా ఈ సమస్యతో అనేక తంటాలు పడుతున్నారు. తమిళనాడులో సుగంధ, కల్వి, వల్లి, నిమ్మి తదితరులతో ‘ఎకోఫెమే’ ఎన్‌జీవో ఏర్పడింది. శానిటరీ ప్యాడ్స్‌ ఉచితంగా అందివ్వడం, నెలసరి మీద అవగాహన కల్పించడం దీని లక్ష్యం.

ప్రకృతిసిద్ధమైన రుతుచక్రం ఆడపిల్లల్ని పలు ఇబ్బందుల్లో పడేస్తూ ఆందోళనకు గురిచేస్తోందని, నెలసరిని ఎదుర్కోలేక చాలామంది ఆడపిల్లలు స్కూలు దశలోనే చదువు ఆపేస్తున్నారని ఎకోఫెమే అధ్యయనంలో తేలింది. యుక్తవయసు పిల్లల్లో అవగాహన పెంచి శుభ్రత నేర్పేందుకు ఒక క్వశ్చనీర్‌ తయారు చేశారు. వాటికి జవాబులు రాబట్టినప్పుడు వాళ్లకి గ్రామీణ పేద మహిళలు రుతు సమయంలో అనుభవిస్తోన్న కష్టాలు తెలిసొచ్చాయి. వాళ్లు ప్యాడ్స్‌ కొనలేరు. కొందరు చవక ప్యాడ్స్‌ కొని అనారోగ్యం పాలవుతున్నారు. ప్రత్యామ్నాయంగా రీయూజబుల్‌ క్లాత్‌ ప్యాడ్స్‌ అందిస్తోంది ఎకోఫెమే. ఇవి ఆరోగ్యానికీ పర్యావరణానికీ కూడా హితమే. ఈ ప్యాడ్స్‌ అనేక కఠిన పరీక్షల అనంతరం దూదితో మెత్తగా, సౌఖ్యంగా, లీక్‌ప్రూఫ్గా రూపొందాయి. భిన్న రంగులు, పరిమళాలతో నాణ్యంగా తయారుచేసి 850 మంది గ్రామీణ మహిళల ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు.

ఎకోఫెమేలో క్లాత్‌ప్యాడ్స్‌ ఎటూ ఉచితమే. ఇక ‘ప్యాడ్‌ ఫర్‌ ప్యాడ్‌’, ‘ప్యాడ్‌ ఫర్‌ సిస్టర్‌’ అంటూ రెండు పద్ధతులున్నాయి. మొదటిది ఎకోఫెమే శానిటరీ న్యాప్‌కిన్‌ కొన్నవాళ్లకి క్లాత్‌ ప్యాడ్‌ ఉచితం. రెండో పద్ధతిలో పేదలకు వాటిని తయారుచేసే సరంజామా ఇచ్చి, పద్ధతి నేర్పి వారినే చేసుకోమంటారు. సామాజిక, పర్యావరణ మార్పు తేవడమే వారి లక్ష్యం. ప్రతి మహిళా నెలసరి సమయంలో శుచిగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా ఉండాలనేదే ‘ఎకోఫెమే’ ఆకాంక్ష. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఇల్లు ఆరోగ్యంగా ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్