వ్యాయామం తర్వాత..

సరళకు ఉదయం నిద్రలేచి అరగంట వ్యాయామం చేసేసరికి ఇంటిపనికి సమయం సరిపోదు.

Published : 30 Nov 2022 00:43 IST

సరళకు ఉదయం నిద్రలేచి అరగంట వ్యాయామం చేసేసరికి ఇంటిపనికి సమయం సరిపోదు. దాంతో వర్కవుట్లు పూర్తయిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వంట పని ప్రారంభిస్తుంది. అంతలోనే తీవ్రంగా నీరసపడుతుంది. ఇది సరైన విధానం కాదంటున్నారు నిపుణులు.

వర్కవుట్లు చేసిన తర్వాత బద్ధకించకుండా కొన్ని నియమాలను పాటించాలి. ముందు చేసిన వ్యాయామ సమయంలో కనీసం సగం సమయాన్నైనా పోస్ట్‌ వర్కవుట్‌ కోసం కేటాయించుకోవాలి. అలసిన కండరాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. చెమట రూపంలో నీరు బయటకు వెళ్లడంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వీటన్నింటినీ పూర్వపుస్థితికి తెచ్చుకొన్న తర్వాత మాత్రమే వేరే పనిలోకి అడుగుపెట్టాలి. కండరాల్లో ఒత్తిడిని తగ్గించడానికి శరీరాన్నంతా విశ్రాంతిదశలో ఉండేలా మ్యాట్‌పై శవాసనం వేయాలి. ప్రశాంతంగా కళ్లు మూసి ఉంటే మనసు, శరీరం సమన్వయమవుతాయి. కండరాలన్నీ ఒత్తిడికి దూరమవుతాయి. అలాగే నీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను తగ్గించుకోవచ్చు. నిమ్మరసం, కొబ్బరినీళ్లు, గ్రీన్‌టీ వంటివి తీసుకున్నా మంచిదే. అయితే చక్కెర, కెఫైన్‌వంటివాటికి దూరంగా ఉండాలి.

పరిశుభ్రత.. పోషకాలు...

వ్యాయామం చేసిన దుస్తులతో ఎక్కువసేపు ఉండకూడదు. వాటిపై ఉండే బ్యాక్టీరియాలు అనారోగ్యాలను కలిగిగస్తాయి. అరగంటలోపు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించడం మంచిది. లేదంటే చర్మరంధ్రాల నుంచి చెమటతో కలిసి బయటకొచ్చిన మురికివల్ల బ్యాక్టీరియా పెరిగి పలురకాల చర్మసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్నానం తర్వాత శరీరాన్ని శక్తివంతం చేసేలా ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు అందేలా ఆహారాన్ని ఎంచుకోవాలి. గుడ్డు, ఆమ్లెట్‌, ఉడికించిన కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, శనగలు, పండ్లు, గింజధాన్యాలతో చేసిన సలాడ్‌ వంటివి ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే చాలు. కావాల్సిన పోషకాలు శరీరానికి అందించినట్లే.

బ్యాక్టీరియాకు దూరంగా..  

వ్యాయామం చేసే మ్యాట్‌ను కనీసం వారానికొకసారైనా శుభ్రం చేయడం మరవకూడదు. లేదంటే దానిద్వారానూ బ్యాక్టీరియాలు అనారోగ్యాలకు కారణమవుతాయి. రెండు కప్పుల నీటిలో కొన్ని చుక్కల డిష్‌ సోప్‌ లిక్విడ్‌ను కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన స్పాంజితో మ్యాట్‌ను బాగా రుద్దాలి. ఆ తర్వాత మ్యాట్‌ను వేడినీటిలో ముంచి ఎండలో ఆరనిస్తే చాలు. అలాగే మ్యాట్‌పై ముందుగా శానిటైజింగ్‌ స్ప్రే చేసి. ఆ తర్వాత మృదువైన వస్త్రంతో తుడిచినా శుభ్రపడుతుంది. ఈ జాగ్రత్తలతో చేసే వ్యాయామాలు ఫిట్‌నెస్‌తోపాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్