అత్తమ్మకి షుగర్‌ ఉన్నా పండ్లు తినేస్తోంది... ఎలా?

మా అత్తమ్మకి షుగర్‌. ఈ కాలంలో వచ్చే మామిడి, పనస పండ్లను ఇష్టంగా తింటున్నారు. ఇలా తియ్యగా ఉన్న పండ్లను తింటే చక్కెర స్థాయులు పెరిగిపోతాయని మా భయం. కాదంటే, నొచ్చుకుంటారనిపిస్తోంది.

Published : 25 May 2023 14:16 IST

మా అత్తమ్మకి షుగర్‌. ఈ కాలంలో వచ్చే మామిడి, పనస పండ్లను ఇష్టంగా తింటున్నారు. ఇలా తియ్యగా ఉన్న పండ్లను తింటే చక్కెర స్థాయులు పెరిగిపోతాయని మా భయం. కాదంటే, నొచ్చుకుంటారనిపిస్తోంది. ఆవిడేమో ట్యాబ్లెట్‌ వేసుకున్నా కదా, తిన్నా ఏం కాదని ధీమాగా చెబుతున్నారు. అసలు మధుమేహులు పండ్లను తినొచ్చా? తింటే ఏవి మంచిది?

- నీరజ, విజయవాడ

పండ్లను ఉడకబెట్టకుండా తింటాం కాబట్టి పోషకాల మోతాదు ఎక్కువ. ముఖ్యంగా మైక్రో న్యూట్రియంట్లు, పొటాషియం, పీచు, విటమిన్‌ సి, మెగ్నీషియం, క్యాల్షియంతో పాటు కార్బోహైడ్రేట్స్‌, త్వరగా జీర్ణమయ్యే చక్కెరలు కూడా లభిస్తాయి. అయితే, మన ఆహార విధానంలో బియ్యం, గోధుమల వంటి గింజ ధాన్యాలదే ప్రధాన పాత్ర. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్‌ వీటి నుంచే అందుతాయి. ఇలాంటప్పుడు పరిమితికి మించి పండ్లను తింటే... రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగుంటుంది కాబట్టి పిండిపదార్థాలు కొంచెం ఎక్కువ తీసుకున్నా... రక్తంలో చక్కెర నిల్వల్ని సమన్వయం చేసుకోగలరు. మధుమేహుల్లో మాత్రం ఈ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల మితిమీరి తింటే రక్తంలోని చక్కెర నిల్వల హెచ్చుతగ్గుల్ని చూడాల్సి వస్తుంది. అన్నం, చపాతీ వంటి ఏ ఆహారం ఎంచుకున్నా సరే... వీటితో పాటు పండ్లూ లేదా పండ్ల ముక్కల్ని రోజుకి 150 గ్రాములు మించకుండా తీసుకోవాలి. అయితే వాటిని ఆహారంతో పాటు కాకుండా అల్పాహారంలా తినాలి. ఇక, అరటి, పనస, మామిడి వంటి పండ్ల విషయానికి వచ్చే సరికి... పెద్దగా నమలాల్సిన అవసరం ఉండదు కాబట్టి తెలియకుండానే ఎక్కువ తినేస్తుంటాం, దీనివల్లే సమస్య. కాయ పండే కొద్దీ కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌, గ్లూకోజ్‌లా రూపాంతరం చెందుతాయి. దాంతో పండ్లకు తియ్యదనం వస్తుంది. అలాగని అన్ని పండ్లలోనూ జీర్ణమయ్యే చక్కెరల మోతాదు ఒకేలా ఉండదు. ఉదాహరణకు పుచ్చకాయ ఎంత తియ్యగా ఉన్నా... ఇందులో నీటి శాతం ఎక్కువ. పిండిపదార్థాలు తక్కువ. ఈ జాబితాలో తర్బూజ, నారింజ, బత్తాయి, అల్ల నేరేడు, స్ట్రాబెర్రీ వంటివీ చాలానే ఉన్నాయి. ముందే చెప్పుకొన్నట్లు 150 గ్రాములకు మించకుండా ఆపిల్‌, జామ, మామిడి, పనస, బొప్పాయి... ఇలా నచ్చిన ఏ పండైనా మధుమేహులు తినొచ్చు. కానీ, తాజావైనా, నిల్వవైనా జ్యూసులకు దూరంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్