అందుకే... వేప!

ఉగాది... సంతోషంగా, తీపి చేసుకుంటూ కదా ప్రారంభించాలి. అయినా ఆరు రుచులతో స్వాగతిస్తాం. మిగతావంటే సరే! అసలు ఈ చేదును కలపాల్సిన పనేంటి? అంటే... దాని వెనక జీవిత పరమార్థమే కాదు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.

Published : 09 Apr 2024 01:31 IST

ఉగాది... సంతోషంగా, తీపి చేసుకుంటూ కదా ప్రారంభించాలి. అయినా ఆరు రుచులతో స్వాగతిస్తాం. మిగతావంటే సరే! అసలు ఈ చేదును కలపాల్సిన పనేంటి? అంటే... దాని వెనక జీవిత పరమార్థమే కాదు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.

తీపి, ఉప్పు, పులుపు, వగరు, కారం...ఆనందం, ఉత్సాహం, నేర్పుగా వ్యవహరించడం, కొత్త సవాళ్లు, సహనానికి చిహ్నాలు. చేదు... బాధకు సూచిక. వేటికవే గొప్పవే అయినా... ఆనందం, బాధ ఈ రెండింటి చుట్టే ఎక్కువగా జీవితం తిరుగుతుంది. జీవితం పూలపాన్పు కాదు. సంతోషం మాటునే దుఃఖం ఉంటుంది. మంచి వెనకే చెడూ దాగుంటుంది వాటినీ సమానంగా స్వీకరించాలని చెప్పడమే చేదు ఉద్దేశం.

వంటల్లో భాగం...

ఒక్కరోజు తింటే లాభాలన్నీ వచ్చేస్తాయా... చాలామంది సందేహమే ఇది. ‘పల్లెల ఔషధాలయం’గా వేపకి పేరు. ఆకు, వేరు వగైరాలను పూతలుగా ఉపయోగించుకున్నా... పువ్వుల్ని మాత్రం పోపుల పెట్టెలో భాగం చేసుకున్నారు దక్షిణ భారతీయులు. ఏడాది పొడవునా ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు.

ఎండ వేడికి డీహైడ్రేషన్‌, జీర్ణసంబంధ సమస్యలు, అలర్జీలు... ఎన్నెన్ని సమస్యలో! వేపపూలు, అల్లం, బెల్లం, పచ్చి మామిడి ముక్కలు, కాస్త ఉప్పు, మిరియాల పొడి చేర్చి చేసే షర్బత్‌ ఎంతోమందికి సుపరిచితమే! ఇది శరీరానికి చలవ చేస్తూనే... కడుపుబ్బరం, అజీర్తికీ చెక్‌ పెట్టేస్తుంది. మరెన్నో పోషకాలనూ అందిస్తుంది. మినపప్పు లేదా కందిపప్పు, ఎండిన వేప పువ్వుకు ఎండు మిరపకాయలు, కాస్త చింతపండు చేర్చి దోశతోనో, వేడి నెయ్యి అన్నంతోనో తింటే అమృతమే అంటారు. బామ్మల వంటలో ఏదో మ్యాజిక్‌ ఉందని ఎన్నిసార్లు అనుకుంటాం? వాళ్ల పోపుల పెట్టెలో వేప పొడి ఓ రహస్య పదార్థం. చారు, పులుసులు, వేపుళ్లు, చిత్రాన్నాల్లో చిటికెడు పొడి చల్లి మరీ అందించేవారు. చెట్టినాడ్‌, కన్నడ రుచులంటూ మనం ఆస్వాదించే వంటకాల్లోనూ దీని ఆనవాళ్లు ఉంటాయి. అంతెందుకు పచ్చి మామిడితో కలిపి పచ్చడి, కరివేపాకు కారంలా వేపపువ్వు కారం కూడా ప్రసిద్ధే. ఇందుకోసం వేసవిలో పూలను ఎండబెట్టి పొడి చేసి భద్రపరుచుకుంటారు. ఉదయాన్నే గోరువెచ్చనినీటిలో చిటికెడు పొడి కలుపుకొని తాగుతారు.

ఎందుకంటే...

ఆయుర్వేదంలో పిత్త దోషాలకు విరుగుడుగా వేప పూలను ఉపయోగిస్తారు. అజీర్తి, మలబద్ధకాలకే కాదు, కఫంతో కూడిన దగ్గు, వాంతులు, తలనొప్పికీ దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారు.

  • బరువు తగ్గడానికి ఎన్నెన్ని పాట్లు పడుతున్నారు? వేప పూలలో ఫైబర్‌, ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్‌, కార్బోహైడ్రేట్లు... వంటివెన్నో పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆకలిని నియంత్రించడంతోపాటు కెలోరీలు వేగంగా కరిగేలా చేస్తుంది. తద్వారా వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది. టాక్సిన్లనూ బయటికి పంపి, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లల్లో కనిపించే నులిపురుగుల సమస్యకీ చక్కని పరిష్కారం. వేప పూల పొడిని రసంలోనో, కూరల్లోనో చేర్చి నెలలో కొన్నిసార్లు అందించినా చాలట. పోషకాలు అందడమే కాదు కడుపూ శుద్ధి అవుతుంది.
  • వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి చర్మకణాలను ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌కి దూరంగా ఉంచుతాయి. యాక్నే, అలర్జీలను తగ్గించడమే కాదు ఆరోగ్యమైన చర్మాన్నీ అందిస్తాయి. కురుల ఎదుగుదలనూ ప్రోత్సహిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతాయి. అందుకే దీన్ని మధుమేహులకు ఉత్తమమైనదిగా చెబుతారు. కాలం మారినప్పుడల్లా వైరస్‌ల వ్యాప్తి ఉంటుంది. వాటి నుంచి కాపాడే టీకాలా ‘వేప పూల’ను భావిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్