మీ కోసమే ఈ ‘ఎవ్రీథింగ్‌’!

ముస్తాబు పూర్తయ్యాక అద్దంలో చూసుకుంటే ‘అరె భలే అందంగా ఉన్నానే’ అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ క్షణం తెలియకుండానే ముఖంలో చిరునవ్వు విరియడమే కాదు, ఒత్తిడి స్థాయీ తగ్గుతుందట.

Published : 20 Apr 2024 02:07 IST

ముస్తాబు పూర్తయ్యాక అద్దంలో చూసుకుంటే ‘అరె భలే అందంగా ఉన్నానే’ అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ క్షణం తెలియకుండానే ముఖంలో చిరునవ్వు విరియడమే కాదు, ఒత్తిడి స్థాయీ తగ్గుతుందట. మనపై మనం చూపించే ప్రేమ మహత్తే అది. కొనసాగాలా... ‘ఎవ్రీథింగ్‌ షవర్‌’ని ప్రయత్నించండి. ఇప్పుడిదో ట్రెండ్‌ కూడా!

అసలేమిటిదీ అంటే... సాధారణంగా వేడుకలు, పండగలు ఉన్నప్పుడు ఆడవాళ్లు స్వీయశ్రద్ధ పెట్టడం మామూలే. మిగతారోజుల్లో సమయం లేదని తమని తాము పట్టించుకోరు. దాంతో శారీరకంగానే కాదు, మానసికంగానూ సమస్యలు కొనితెచ్చుకుంటారు. వారికి ‘సెల్ఫ్‌కేర్‌’ని అలవాటు చేసే క్రమంలో రూపుదిద్దుకుందే... ఈ ఎవ్రీథింగ్‌ షవర్‌! దీనికిగానూ... వారంలో ఒకరోజు కేటాయించాలి. ఆరోజు...

  • గబగబా స్నానం ముగించేద్దామన్న తొందరొద్దు. స్నానాల గదిలో సెంటెడ్‌ క్యాండిల్స్‌ లేదా నచ్చిన పరిమళాన్ని చల్లుకోవాలి. ఈ సువాసనలు మనసును తేలికపరుస్తాయి. ఆపై మరీ చల్లగా, వేడిగా కాకుండా గోరువెచ్చని నీటిని సిద్ధం చేసుకోండి. దానిలో ఎసెన్షియల్‌ ఆయిల్‌ లేదా బాతింగ్‌ సాల్ట్‌ వేసుకోండి.
  • ఇప్పుడు నచ్చిన బాడీవాష్‌ లేదా సబ్బుతో నింపాదిగా స్నానం చేయండి. శరీరానికి తాజాదనం అందడమే కాదు, మనసులోని ప్రతికూల భావనలూ తొలగిపోతాయి అంటున్నారు నిపుణులు. ఇప్పుడు బాడీస్క్రబ్‌ కాదంటే... సున్నిపిండి లేదా బియ్యప్పిండితో శరీరమంతా మృదువుగా రుద్దేయండి. మృతకణాలుంటే తొలగి, మృదువైన చర్మం సొంతమవుతుంది. మందమైన చర్మముండే మోకాళ్లు, మోచేతులు, పాదాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మరి. అవాంఛిత రోమాలను తొలగించుకోవాల్సింది కూడా ఇప్పుడే.
  • ఇక కురులు... ఎప్పటిలా ఆదరాబాదరాగా కాకుండా మృదువుగా మసాజ్‌ చేస్తూ షాంపూను పట్టించాలి. వలయాకారంలో తలంతా రుద్దడం అయ్యాక నీటితో కడిగేయాలి. ఎంత విశ్రాంతిగా అనిపిస్తుందో! అయితే కండిషనర్‌ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చివర్లో ఓ మగ్గు చల్లటి నీళ్లు తలమీదుగా పోసుకోండి. హాయితోపాటు కుదుళ్లకీ మేలు చేకూరుతుంది.
  • ఇక చివరగా... తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్‌ లేదా బాడీ ఆయిల్‌ రాయాలి. తేమ అందడమే కాదు, మేనికి మెరుపూ వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు మహా అయితే 20-30 నిమిషాలు పడుతుంది. కానీ... శరీరమూ, మనసూ తేలికపడతాయి. అందుకే ఇది ట్రెండ్‌గా మారి యువతను ఆకర్షిస్తోంది. మీరూ ప్రయత్నించి చూడండి మరి!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్