ఎలక్ట్రోలైట్స్‌... తాగుతున్నారా?

‘వేసవిలో శరీరానికి ఎలక్ట్రోలైట్స్‌ తప్పక అందేలా చూసుకుంటా’... ప్రియాంక చోప్రా, దీపిక పదుకోణ్‌ వంటి గ్లోబల్‌ తారలే కాదు... చాలామంది సెలెబ్రిటీలు ఈ మాట చెబుతుంటారు. వైద్యులూ ఎండ ప్రభావాన్ని తట్టుకోవాలంటే వీటిని తీసుకోవాల్సిందే అని సలహానిస్తుంటారు.

Updated : 24 Apr 2024 14:09 IST

‘వేసవిలో శరీరానికి ఎలక్ట్రోలైట్స్‌ తప్పక అందేలా చూసుకుంటా’... ప్రియాంక చోప్రా, దీపిక పదుకోణ్‌ వంటి గ్లోబల్‌ తారలే కాదు... చాలామంది సెలెబ్రిటీలు ఈ మాట చెబుతుంటారు. వైద్యులూ ఎండ ప్రభావాన్ని తట్టుకోవాలంటే వీటిని తీసుకోవాల్సిందే అని సలహానిస్తుంటారు. ఇంతకీ ఏమిటివి?

ఎండవేళ...

కాసేపు అలా ఎండలో బయటికి వెళ్లామంటే చాలు... అలసట, విపరీతమైన దప్పిక, తల, ఒళ్లునొప్పులు వంటివెన్నో పలకరించేస్తాయి కదూ! కొన్నిసార్లు ఎన్ని మంచినీళ్లు తాగినా దప్పికే తీరదు. వీటన్నింటికీ డీహైడ్రేషన్‌తోపాటు చెమట రూపంలో మినరల్స్‌ కోల్పోవడాన్నీ కారణంగా చెబుతారు. సోడియం, ఫాస్ఫేట్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్‌, బైకార్బోనేట్‌ వంటి మినరల్స్‌ని ఎలక్ట్రోలైట్స్‌గా చెప్పొచ్చు. శరీరం లోపలి ఉష్ణోగ్రతలను అదుపు చేయాలన్నా, కణాలపై ఏర్పడే ఒత్తిడిని తగ్గించి, తిరిగి శక్తి పుంజుకోవాలన్నా ఈ ఎలక్ట్రోలైట్స్‌దే ప్రధాన పాత్ర. కాబట్టి, రోజుకి 8-10 గ్లాసుల నీటిని తాగుతున్నామో లేదో గమనించుకోవడంతోపాటు ఇవీ సమృద్ధిగా అందుతున్నాయా అన్నదీ సరి చూసుకోవాలి.

  • కొబ్బరినీళ్లలో చక్కెరలు తక్కువ. సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్‌లు సమృద్ధిగా ఉండే సహజ పానీయం. ఈ నీటిని తరచూ తీసుకోవాలి.
  • ఆవుపాలను ఉదయం లేదా రాత్రి ఒక గ్లాసు తీసుకుంటే సరి. కాల్షియం, సోడియం, పొటాషియం భర్తీ జరుగుతుంది. అదనంగా శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్లు కూడా అందుతాయి.
  • పుచ్చకాయలకు ఈ కాలంలో కొదవే లేదు. ఓ గ్లాసు దీని జ్యూసును తాగండి. రోజులో మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్‌ అందుతాయి. ఇదే కాదు కర్భూజ, సపోటా, బొప్పాయి, నారింజ... ఇలా నచ్చిన పండ్ల రసాన్ని డైట్‌లో భాగం చేసుకోండి. విటమిన్లు, మినరల్స్‌ అందడమే కాదు, వీటిలోని సహజ చక్కెరలు నిస్సత్తువనూ దూరం చేస్తాయి.
  • స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ కూడా తక్షణ శక్తినిచ్చేవే. కానీ వీటిలోని చక్కెరలు, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరీ నీరసంగా అనిపిస్తే ఓఆర్‌ఎస్‌ని తీసుకోవచ్చు. లేదంటారా ఇంట్లోనే నీటిలో కాస్త నిమ్మరసం, చక్కెర, ఉప్పు చేర్చుకొని తాగినా ఎలక్ట్రోలైట్‌ల భర్తీ జరుగుతుంది.

ఎండలు పెరుగుతున్న ఈ సమయంలో కచ్చితమైన ఆహార వేళలను పాటించండి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూనే శరీరానికి తగిన నీరు, ఎలక్ట్రోలైట్లు అందుతున్నాయా అని గమనించుకోండి. అప్పుడే వాంతులు, కడుపులో తిప్పడం, అజీర్తి, అలసటతోపాటు వడదెబ్బకీ దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్