ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!

ఆరోగ్యానికీ, అందానికీ, చక్కటి జీవనశైలికీ వ్యాయామం అవసరం. అయితే కొందరు మహిళలు... ‘ఇంటి పనులూ, బాధ్యతలతోనే సమయం అంతా అయిపోతుంది. వర్కవుట్లు చేసే తీరిక మాకెక్కడిది’ అంటారు.

Updated : 07 May 2024 15:10 IST

ఆరోగ్యానికీ, అందానికీ, చక్కటి జీవనశైలికీ వ్యాయామం అవసరం. అయితే కొందరు మహిళలు... ‘ఇంటి పనులూ, బాధ్యతలతోనే సమయం అంతా అయిపోతుంది. వర్కవుట్లు చేసే తీరిక మాకెక్కడిది’ అంటారు. వ్యాయామం అనగానే జిమ్‌కో, యోగా తరగతులకో వెళ్లనక్కర్లేదు. సులువుగా ఇంట్లోనే చేయగలిగే కొన్ని కసరత్తులు ఉన్నాయి. వాటిని మీ రోజువారీ పనులతోనే పూర్తి చేయొచ్చు. అదెలాగంటారా?

  • ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా... ఎక్కడో ఒక చోట సర్దాల్సినవి కనిపిస్తూనే ఉంటాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలూ తరచూ వస్తూనే ఉంటాయి. వీటికోసం ఓ రోజు ప్రత్యేకంగా పెట్టుకునే బదులు... రోజూ కాసేపు ఇందుకోసం సమయం కేటాయించండి. పైనున్న అరల్లోని వస్తువుల్ని తుడిచి పెట్టడానికి కుర్చీలెక్కొద్దు. కాలి మునివేళ్లపై నిలబడి చేతులు పైకెత్తి అల్మరాలను శుభ్రపరచండి. ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు సమయాన్ని దీనికోసం కేటాయించుకోండి. ఇలా చేస్తే శరీరానికి ఫ్లెక్సిబిలిటీ అలవడటంతోపాటు మీ షెల్ఫ్‌లు ఒద్దికగా కనిపిస్తాయి. ఒకేసారి రెండింటికీ పరిష్కారం లభిస్తుంది.
  •  నీళ్లను రెండు లీటర్ల సీసాలో పోసి రోజూ ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి వాటిని అరచేతిలో పెట్టుకుని మిద్దెమీదకు తీసుకెళ్లండి. అక్కడ మొక్కలకు పోయండి. ఇలా రెండు మూడుసార్లు పైకీ, కిందకీ ఎక్కి దిగడం వల్ల కాలి కండరాలు దృఢంగా మారడమే కాదు... నీళ్ల బరువుకి చేతులూ టోన్‌ అవుతాయి.
  • గంటలు గంటలు ఫోన్‌లు, ఛాటింగ్‌లు, నెట్‌ బ్రౌజింగ్‌ మనలో చాలామందే చేస్తుంటారు. మరి ఇలాంటప్పుడు పడుకుని, కూర్చుని మాట్లాడొద్దు. వీలైనంతవరకూ అటూ ఇటూ నాలుగు అడుగులు వేస్తే మంచిది. అతిగా టీవీ చూస్తే ఊబకాయం పెరుగుతుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే  వెల్లడించాయి. దీనికి కారణం కదలకుండా కూర్చోవడం, అందులో లీనమై అధికంగా తినడం వంటివే. మరి అలా కాకూడదనుకుంటే ఓ పనిచేయండి. ఈ సారి టీవీ చూసేటప్పుడు చేతిలో రిమోట్‌ లేకుండా చూసుకోండి. దాంతో ఛానెల్‌ మార్చాలనుకున్నప్పుడల్లా లేచి నాలుగడుగులు వేస్తారు. అలానే మీకు దగ్గర్లో నీళ్ల సీసాను పెట్టుకుంటే తినడానికి బదులు నీళ్లు తాగడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
  •  రోజూ ఉదయాన్నే పళ్లు తోమిన తరవాత అద్దంలో చూస్తూ పెద్దగా నవ్వండి. నిటారుగా నిలబడి వెనక్కి తలను వంచి ఇంటి పైకప్పును చూస్తూ  ఓ పది సార్లు పెద్దగా నోరు తెరవడం, మూయడం చేస్తుండాలి. దీని వల్ల డబుల్‌చిన్‌ సమస్య దూరమవుతుంది. మెడనొప్పులు, స్పాండిలైటిస్‌ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిదే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్