ఆహారం.. ఇలా తీసుకోండి!

ఆరోగ్యమే మహాభాగ్యం అని వినే ఉంటారుగా. ఆఫీస్‌కి ఆలస్యమవుతుందనో.. వేరే ఏదైనా కారణాలతోనో సులువుగా అవుతుందనో వేపుళ్లు, ప్యాకేజ్డ్‌్‌ ఫుడ్‌ తీసుకుంటుంటారు. అదీ కాకపోతే భోజనం బయట చేయడానికే మొగ్గు చూపుతుంటారు.

Published : 28 May 2024 01:55 IST

రోగ్యమే మహాభాగ్యం అని వినే ఉంటారుగా. ఆఫీస్‌కి ఆలస్యమవుతుందనో.. వేరే ఏదైనా కారణాలతోనో సులువుగా అవుతుందనో వేపుళ్లు, ప్యాకేజ్డ్‌్‌ ఫుడ్‌ తీసుకుంటుంటారు. అదీ కాకపోతే భోజనం బయట చేయడానికే మొగ్గు చూపుతుంటారు. ఊబకాయం, మధుమేహం లాంటివి అధికమవడానికి ముఖ్య కారణం మనం తీసుకుంటున్న ఆహారమే. ప్రస్తుతం తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటున్నాం.. దాన్ని తగ్గించి ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించింది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్‌). ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి భోజనం చేయాలనే దానిపై కొత్త గైడ్‌లైన్స్‌నూ తీసుకువచ్చింది.

ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ వద్దు!

చిప్స్, ఐస్‌క్రీమ్, నూడుల్స్, సూప్‌ మిశ్రమాలు, కేకులు.. ఈ కాలంలో ఇవన్నీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరి ఫేవరెట్స్‌లో ఫస్ట్‌ ఉంటాయి కదూ! ఇలా అల్ట్రా ప్రాసెస్‌ చేసిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం లాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. అంతేకాదు ఇటీవల ఇన్‌స్టంట్‌ ఫుడ్‌కీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి చూడగానే నోరూరుంచేలా ఉండొచ్చు కానీ ఆరోగ్యానికి ముప్పు తెచ్చి పెడతాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.

తప్పక తినాలి..

ఫోన్‌ చూసుకుంటూ దాంట్లోనే మునిగిపోయి ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కూడా తెలియదు. కానీ దీని వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిరోజు మన భోజనంలో 190-370గ్రా. తృణధాన్యాలు, 200గ్రా. కూరగాయలు, 100గ్రా. ఆకుకూరలు, 100గ్రా. దుంపలు, 300గ్రా. పాలు లేదా పెరుగు, దాంతోపాటు 100గ్రా. పండ్లు, 60-120గ్రా. చిరుధాన్యాలు 90గ్రా. చొప్పున గుడ్లు, మాంసం లేదా పప్పులు లాంటివి తీసుకుంటూ ఉండాలి. చక్కెర, ఉప్పు, కొవ్వులను పరిమితిలో తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండటానికి మంచినీళ్లు తాగుతూ ఉండాలి.

వంటనూనె కొంచమే..

పిల్లలు ఇష్టపడుతున్నారనో, సులువవుతుందనో వేపుళ్లు చేయడానికే ప్రయత్నిస్తుంటారు చాలామంది. దీనివల్ల పిల్లల్లో కొవ్వు పెరిగిపోతుంటుంది. ఇది అదుపులో ఉండాలంటే వంటల్లో పరిమితిని మించి నూనె వాడకూడదు. నట్స్, గుమ్మడి, చియా, అవిసె గింజల నుంచి తీసిన నూనెని వాడటం మంచిది. ఆలివ్, నువ్వుల నుంచి తీసిన నూనెలు లేదా కొబ్బరి నూనె కూడా వంటల్లో వాడితే మేలు. ఇది ప్రతిరోజూ నాలుగైదు టీస్పూన్స్‌ మించకుండా చూసుకోవాలి. నూనెకు బదులు ఇంట్లో చేసిన నెయ్యి, వెన్నని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్