వంటింటి ఖర్చు తగ్గిద్దామిలా!

పెరిగిన వంటనూనె ధరల్ని చూశాక... ప్రత్యేక వంటకాల మాట అటుంచి రోజువారీ వంటలు చేయడానికే భయపడుతున్నారు గృహిణులు. నిమ్మ, టమాటా ధరలు విన్నాక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనిపిస్తోంది! ఇక గ్యాస్‌ ధర గురించి చెప్పేదేముంది? ధరలు కాస్త అదుపులోకి వచ్చేంతవరకూ ఈ పొదుపు చిట్కాలతో కాసింత ఉపశమనం పొందడానికి ప్రయత్నిద్దాం...

Published : 11 May 2022 01:29 IST

పెరిగిన వంటనూనె ధరల్ని చూశాక... ప్రత్యేక వంటకాల మాట అటుంచి రోజువారీ వంటలు చేయడానికే భయపడుతున్నారు గృహిణులు. నిమ్మ, టమాటా ధరలు విన్నాక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనిపిస్తోంది! ఇక గ్యాస్‌ ధర గురించి చెప్పేదేముంది? ధరలు కాస్త అదుపులోకి వచ్చేంతవరకూ ఈ పొదుపు చిట్కాలతో కాసింత ఉపశమనం పొందడానికి ప్రయత్నిద్దాం...

వంట నూనె ఆదాకి...
నాణ్యమైన, నాన్‌స్టిక్‌ పాత్రల ఎంపిక నూనె వాడకాన్ని బాగా తగ్గిస్తుంది. నాన్‌స్టిక్‌ ఆరోగ్యానికి మంచిది కాదు అనుకొనేవారు సెరామిక్‌ పాత్రల్లో వండొచ్చు. వీటిల్లోనూ తక్కువ నూనెతో వంటకాలు పూర్తిచేయొచ్చు.

సమోసాలు, కబాబ్స్‌ వంటివి చేస్తున్నప్పుడు అవెన్‌ని ఉపయోగిస్తే మంచిది. కెలొరీల సమస్య ఉండదు. ఫ్రెంచ్‌ఫ్రైస్‌ లాంటివాటికోసం ఎయిర్‌ ఫ్రైయర్స్‌ ఉంటాయి. చెంచా నూనె వేస్తే చాలు.

కాయగూరల్ని ఉడికించేటప్పుడు పాత్రలపై చక్కగా అమిరే మూతపెడితే.. ఆ ముక్కల్లోని తేమతోనే అవి ఉడికిపోతాయి. అదే మూత సరిగ్గా పెట్టకపోతే... ఎంత నూనె వేసినా సరిగా వేగవు. కూరల్ని కుక్కర్‌లో ముందుగానే ఉడికించి తర్వాత తాలింపు వేస్తే సరిపోతుంది. వేసవిలో ఉడికించిన తేలికపాటి ఆహారం శరీరానికి హాయిగా ఉంటుంది. ఆకుకూరలు వంటివి ఉడికిస్తున్నప్పుడు నూనె తక్కువ వేసి, కొద్దిగా పెరుగు వేసి చూడండి. రుచిగా కూడా ఉంటుంది.

మఫిన్స్‌, కేక్స్‌, వేఫెల్స్‌ వంటివి బేక్‌ చేసేటప్పుడు అవెన్‌లో నూనెకు బదులుగా తాజా పెరుగు వాడొచ్చు.

బజారులో ఆయిల్‌ స్ప్రేబాటిళ్లు దొరుకుతాయి. సలాడ్లపైనా, బేకింగ్‌ చేయడానికి ముందు ఈ బాటిల్‌తో పదార్థాలపై స్ప్రే చేయొచ్చు. తక్కువ నూనెతో పదార్థాలు రుచిగా ఉంటాయి.

నిమ్మకు బదులుగా: పొద్దునే తాగే గ్రీన్‌టీ మొదలుకుని సలాడ్లు, జ్యూస్‌లకూ నిమ్మ రుచి, పరిమళం తోడవ్వాల్సిందే. కానీ ఒక్క నిమ్మకాయ ధర పదిరూపాయలపైమాటే. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటా అని ఆలోచిస్తున్నారా? లెమన్‌ ఎక్‌స్ట్రాట్‌ మార్కెట్లో దొరుకుతుంది. దీనిని వాడుకోవచ్చు. కేకులు, కుకీలు వంటివి బేక్‌ చేసేటప్పుడు నిమ్మ అవసరం అయిన చోట వైట్‌వెనిగర్‌, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వంటివి వాడొచ్చు. లేదంటే సిట్రిక్‌ యాసిడ్‌ దొరుకుతుంది. చెంచా నిమ్మరసం వేసే చోట ఒక చుక్క సిట్రిక్‌ యాసిడ్‌ వేస్తే సరిపోతుంది. ఇది వంటకాల్లో విటమిన్లు, ఖనిజాలు కోల్పోకుండా కాపాడుతుంది.

టమాటా లేకపోతే: టమాటాకి బదులుగా కెచప్‌, వెనిగర్‌, పెరుగు వంటివాటిని కూరల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు టమాట పొడి కూడా దొరుకుతోంది. ఉడికించడం, మిక్సీ పట్టడం వంటి బాధల్లేకుండా చెంచా పొడి వేస్తే, తేలిగ్గా వంటపని పూర్తవుతుంది. చికెన్‌, చేపలు వంటివి కడిగేటప్పుడు నీచు వాసన పోవడానికి నిమ్మరసం వాడతాం. బదులుగా వెనిగర్‌ వాడినా చాలు.

గ్యాస్‌ ఆదాచేద్దామిలా: పప్పులని కుక్కర్‌లో పెట్టి ఉడికించడం వల్ల 46శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది. అదే అన్నానికయితే 20శాతం ఆదా అవుతుంది. కుక్కర్‌లో ఒకేసారి రెండుమూడు పదార్థాలు ఉడికించుకునేందుకు వీలుగా ‘పార్టిషన్‌ వాల్స్‌’ అని దొరుకుతున్నాయి. వీటితో సమయం, గ్యాస్‌ రెండూ ఆదా అవుతాయి. అలాగే ఏవైనా పదార్థాలని ఉడికించేందుకు పదార్థాలు మునిగేంతవరకూ నీరు వేస్తే చాలు.

పాత, గార పట్టిన పాత్రలని వాడుతున్నారా? వీటిపై ఉన్న ఉప్పుపొర పాత్ర త్వరగా వేడెక్కకుండా అడ్డుకుంటూ 10శాతం గ్యాస్‌ని వృథా చేస్తుంది. అలాగే చిన్నబర్నర్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల 6- 10 పదిశాతం గ్యాస్‌ ఆదా చేసుకోవచ్చు. వెడల్పాటి పాత్రలపై వండితే మంట వృథాకాదు. మార్కెట్లో విండ్‌ప్రూఫ్‌ జాలీలు దొరుకుతున్నాయి. వీటిని పొయ్యికి అమర్చుకుంటే మంటని ఒక చోట ఉండేట్టు చేసి వంట త్వరగా అయ్యేందుకు సహకరిస్తాయి. తరచూ బర్నర్‌లని శుభ్రం చేయకపోయినా గ్యాస్‌ వృథా అవుతుంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్