మట్టిపాత్రలకు రంగులద్దండి...

ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? అయితే ఇంటీరియర్‌ డిజైనర్లు సూచిస్తోన్న అంశాలేంటో చూడండి... మీకు తప్పకుండా పనికొస్తాయి...

Published : 13 Jun 2022 01:02 IST

ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? అయితే ఇంటీరియర్‌ డిజైనర్లు సూచిస్తోన్న అంశాలేంటో చూడండి... మీకు తప్పకుండా పనికొస్తాయి...

* ఇంటిని ముస్తాబు చేసే ముందు అనేక ఇళ్ల డిజైన్లు చూడండి. ఎక్కడ ఏవి నచ్చాయో, ఏవి కంటికి ఇంపుగా ఉన్నాయో ఫొటోలు తీసుకోండి. వేటిని అమలు చేయగలరో రాసుకోండి. కుటుంబసభ్యులతోనూ చర్చించి ఒక ప్రణాళిక తయారుచేసి, ఆ ప్రకారం సర్దడానికి సిద్ధమవ్వండి. అందులో మీ సొంత స్టైల్‌ ప్రతిఫలించాలి.

* ఇంటీరియర్‌ పుస్తకాల్లో చూసిన వాటికి ముగ్ధులై అవీ ఇవీ కొనాలనుకోవద్దు. నిజంగా అవసరం అనుకుంటేనే కొనండి. లేదంటే ఉన్న ఫర్నిచర్‌తోనే అందంగా అమర్చండి. సోఫాలు చూసీచూసీ బోర్‌ కొట్టిందని మళ్లీ కొనేకంటే కవర్లు మార్చేయండి. అప్పుడప్పుడూ కుషన్ల కవర్లు మార్చినా కొత్త లుక్‌ వస్తుంది.

* కొన్ని వస్తువులు ఆకర్షణీయంగా ఉన్నా పెద్దగా ఉపకరించవు. కొందరు అలంకరించిన విధానాలు కూడా భేషుగ్గా అనిపించినా, నడుస్తున్నప్పుడు అడ్డు తగులుతాయి. కనుక అందమే కాదు, సౌకర్యమూ ముఖ్యమని గుర్తుంచుకోండి.

* గోడలకు లేత రంగులైతే గదులు కాంతి వంతంగా ఉంటాయి, ఉల్లాసాన్నీ ఇస్తాయి.

* ఇండోర్‌ మొక్కలతో బోల్డంత అందం. మీ ఓపికను బట్టి వీలైనన్ని ఏర్పాటు చేసుకోండి. పెంచడం కష్టం అనుకుంటే సహజంగా అనిపించే కృత్రిమ మొక్కలూ తెచ్చుకోవచ్చు. అలాంటి తీగలూ లతల్ని అక్కడక్కడా వేలాడదీస్తే అతిథులు ప్రశంసల్తో ముంచేస్తారు. రెండు పక్షుల బొమ్మల్నీ అమర్చారంటే మీ ఇంటి శోభకి ప్రకృతి సోయగం తోడై మురిపిస్తుంది.

* పెయింటింగులతో ఇంటికి రాజసం వస్తుందంటే అతిశయం కాదు. నైరూప్య చిత్రాలను ఎంచుకున్నారంటే ఎప్పుడు చూసినా కొత్త అర్థాలను వెతుక్కోవచ్చు.

* మార్కెట్లో దొరికే చిన్ని మట్టి పాత్రలు తెచ్చి, రంగులద్ది టీపాయ్‌ మీద అలంకరిస్తే మనోహరంగా ఉంటుంది! మీ చిన్నారులతో కాగితాలూ అట్టలతో బొమ్మలు చేయించి వాళ్ల గదిలో తగిలించారంటే అదనపు ఆకర్షణే కాదు, వాళ్ల కళ్లల్లో మెరుపులు చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్