అనుకోకుండా అతిథులొస్తున్నారా..

ఎవరైనా బంధువులు, అతిథులొస్తున్నారంటే ఇల్లంతా శుభ్రంగా ఉండాలనుకుంటాం. కానీ ఉతకాల్సిన దుస్తులు బయట పోగుపడి ఉంటాయి. సింకేమో కడగాల్సిన వంటపాత్రలతో నిండిపోయి ఉంటుంది. ఇలాంటి గజిబిజి ఇంటిని నిమిషాల్లో సిద్ధం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించేయండి..

Published : 23 Jun 2022 02:11 IST

ఎవరైనా బంధువులు, అతిథులొస్తున్నారంటే ఇల్లంతా శుభ్రంగా ఉండాలనుకుంటాం. కానీ ఉతకాల్సిన దుస్తులు బయట పోగుపడి ఉంటాయి. సింకేమో కడగాల్సిన వంటపాత్రలతో నిండిపోయి ఉంటుంది. ఇలాంటి గజిబిజి ఇంటిని నిమిషాల్లో సిద్ధం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించేయండి..

* వచ్చేవారు ముందు అడుగుపెట్టేది.. ఎక్కువ సమయం గడిపేదీ హాలులోనే! ముందు దీన్ని సర్దండి. హాలులో సోఫాపై ఉండే క్లాత్‌లు, దిండ్ల స్థానాలను సరిచేయండి. వార్తా పత్రికలు వగైరా ఉంటే టీపాయ్‌ మీద చక్కగా సర్ది పక్కనే రిమోట్‌లను పెడితే కొద్దిసేపు వచ్చినవాళ్లకి కాలక్షేపం అవుతుంది. కిటికీలు, కుర్చీలపై దుమ్ముంటే గబగబా దులిపేయండి. మిలమిలలాడించాలన్న ప్రయత్నమొద్దు. సమయమంతా ఇక్కడే సరిపోతుంది.

* తర్వాత వంటగదిలోని పాత్రల పని చెప్పేయండి. చెత్త ఏదైనా ఉంటే బయట పడేయండి. సింకు కడిగితే చాలావరకూ కిచెన్‌ శుభ్రంగా కనిపిస్తుంది. తర్వాత స్టవ్‌ గట్టు మీది పాత్రలను క్రమపద్ధతిలో సర్దేస్తే సరి.

* సమయం లేదు అనిపిస్తే.. కర్టెన్లు, కప్‌బోర్డ్‌, స్నానాలగది, బెడ్‌రూమ్‌ తలుపులు అన్నీ మూసేయండి. దీంతో అవెంత గజిబిజిగా ఉన్నాయో కనిపించడం కష్టం. ఏమాత్రం సమయం ఉన్నా.. బాత్రూమ్‌లోని సామగ్రి అంతా సర్దేయండి. మంచం మీద పక్క సరిచేయండి. దుప్పట్లు సర్దే సమయం లేకపోతే వాటిని కప్‌బోర్డ్‌లో ఉంచితే సరి.

* నేల మీద చిందరవందరగా కనిపించే వేటినైనా ఓ కవర్‌ లేదా బాక్సులో వేసి పక్కన పెట్టేయండి. సమయం ఉన్నప్పుడు సర్దేసుకోవచ్చు. తర్వాత చెరిగిన మీ తల దువ్వుకోవడం, ముఖం కడుక్కోవడం వంటివి చేస్తే.. వచ్చే వాళ్లని పలకరించడానికి మీరూ సిద్ధమైనట్లే. ఎంత దాయాలని చూసినా.. అసంతృప్తిగా ఉందా? టీవీ పెట్టి ఉంచండి. త్వరగా వేరే గదులవైపు వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపించరు. అయితే సంభాషణలకు మాత్రం అంతరాయం కలిగిస్తుందిది. పరిస్థితిని బట్టి దీని విషయంలో నిర్ణయం తీసుకుంటే సరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్