అదనం జోడిద్దామా

మనది రాజభవనం లాంటి ఇల్లు కాకపోవచ్చు. దర్పం ఒలకబోసే ఖరీదైన సోఫాలూ, డైనింగ్‌ టేబులూ గట్రా లేకపోవచ్చు. కానీ ఉన్నంతలో ఇంటిని ఆకర్షణీయంగా అమర్చుకోవచ్చు. అందుకు భారీగా ఖర్చుపెట్టనవసరం లేదు. కాస్తంత ఓపిక, ఇంకాస్త నైపుణ్యం ఉంటే చాలు.

Published : 29 Jun 2022 00:54 IST

మనది రాజభవనం లాంటి ఇల్లు కాకపోవచ్చు. దర్పం ఒలకబోసే ఖరీదైన సోఫాలూ, డైనింగ్‌ టేబులూ గట్రా లేకపోవచ్చు. కానీ ఉన్నంతలో ఇంటిని ఆకర్షణీయంగా అమర్చుకోవచ్చు. అందుకు భారీగా ఖర్చుపెట్టనవసరం లేదు. కాస్తంత ఓపిక, ఇంకాస్త నైపుణ్యం ఉంటే చాలు. ఇంటీరియర్‌ డిజైనర్లు సూచిస్తోన్న ఈ సూత్రాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయి...

* కుషన్లంటే మళ్లీ మళ్లీ కొనుక్కోవచ్చు. సోఫా అలా కాదు, చాన్నాళ్లు దాంతోనే సహజీవనం చెయ్యాలి. కనుక కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అందమైంది కొనండి. దానివల్ల ఇంటికి ఎంత శోభ వస్తుందో మీకే అర్థమౌతుంది.

* సాధారణంగా కిటికీలూ తలుపులకు మాత్రమే కర్టెన్లు వేళ్లాడదీస్తాం. కానీ డబుల్‌ కాట్‌కు తెరలు ఏర్పాటు చేసి చూడండి. నూలు లేదా సిల్కు ఏదైనా పరవాలేదు. వీలైనంతవరకూ తెలుపు ఎంచుకోండి. లేదా పరుపు మీది దుప్పటికి నప్పే రంగును వాడండి. అంతే, రాజసం ఉట్టిపడుతుంది.

* టైం చూడటానికే అయితే గోడ గడియారమే అక్కర్లేదు. చేతిలో ఉండే సెల్‌ఫోన్‌ చాలు. కానీ వాల్‌క్లాక్‌తో హాలుకు బోల్డంత అందం వస్తుందనేది ఎవరూ కాదనలేని నిజం. అందువల్ల కళాత్మకమైన గడియారాన్ని ఎంచుకోండి. అది ఇంటికి అదనపు ఆకర్షణ తెస్తుంది. మీ అభిరుచికి సంకేతంగా నిలుస్తుంది.

* మనం ఇతర గదుల్లో కంటే వంటింట్లో గడిపే సమయమే ఎక్కువ. దాన్ని చక్కగా, చూడ ముచ్చటగా పెట్టుకుంటే కష్టపడుతున్న భావన కలగదు. అంతకంటే ముందు పొయ్యి గట్టు చుట్టూ ఉండే టైల్స్‌ ముదురు నీలం లాంటి రంగులు ఎంచుకోండి. లేత రంగులైతే త్వరగా మాసిపోతాయి. పని కాగానే ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేయండి.

* చాలామంది పుల్లలతో పూసలతో, సీసా మూతలతో, ఆఖరికి ఐస్‌క్రీం చెంచాలతో.. అలంకరణ వస్తువులు తయారుచేస్తుంటారు. మీకూ అలాంటి అలవాటుంటే ఏదైనా రూపొందించి గదిలో తగిలించండి. అందంగానూ ఉంటుంది, అంతకుమించి సొంతంగా చేశాననే సంతృప్తి కలుగుతుంది.

* పెయింటింగులూ లేదా మ్యూరల్‌ పెయింట్లు తెచ్చే అందం సామాన్యమైంది కాదు. కానీ వాటికి లక్షలు ఖర్చుపెట్టాలి. పైగా మాటిమాటికీ మార్చలేం. అందుకు బదులుగా వాల్‌పేపర్‌ ఉపయోగిస్తే సరి. కొద్ది డబ్బుతో ఇంటిని విలక్షణంగా తీర్చిదిద్దొచ్చు. కాస్త శ్రద్ధగా ఎంచుకోవాలే కానీ సౌందర్యాన్ని ఇంట్లో కట్టేసుకున్నట్టే. ఎంత అబ్బురంగా ఉందంటూ బంధుమిత్రులు ప్రశంసలు కురిపిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్