బాల్కనీకి వేలాడే అందాలు..

మొక్కలు పెంచాలనుంటుంది.. స్థలమేమో తక్కువ! చిన్న బాల్కనీలున్న వారి పరిస్థితే ఇది. అలాంటివారికి వేలాడే మొక్కలు సరైన ఎంపిక. అందంగా, ఆకర్షణీయంగా ఉంటూ... మన పరిసరాలకు తగ్గ ఈ మొక్కల్ని చూడండి. దీనికే స్వార్డ్‌ ఫెర్న్‌, లాడర్‌ ఫెర్న్‌ అనే పేర్లున్నాయి. నెమ్మదిగా పెరిగే మొక్క ఇది. ఎక్కువ సంరక్షణా అవసరం ఉండదు. వెలుతురులో...

Updated : 08 Aug 2022 00:35 IST

మొక్కలు పెంచాలనుంటుంది.. స్థలమేమో తక్కువ! చిన్న బాల్కనీలున్న వారి పరిస్థితే ఇది. అలాంటివారికి వేలాడే మొక్కలు సరైన ఎంపిక. అందంగా, ఆకర్షణీయంగా ఉంటూ... మన పరిసరాలకు తగ్గ ఈ మొక్కల్ని చూడండి.

బోస్టన్‌ ఫెర్న్‌: దీనికే స్వార్డ్‌ ఫెర్న్‌, లాడర్‌ ఫెర్న్‌ అనే పేర్లున్నాయి. నెమ్మదిగా పెరిగే మొక్క ఇది. ఎక్కువ సంరక్షణా అవసరం ఉండదు. వెలుతురులో చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎండ నేరుగా పడకుండా ఉంటే మంచిది. ఎక్కువ నీరూ అవసరం ఉండదు. కానీ కుండీలో తేమ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే త్వరగా చనిపోతుంది. ఏడాదికి ఓసారి కంపోస్ట్‌ వేయడం, సాలీళ్ల నుంచి కాపాడుకోవడం చేస్తే చాలు.


స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌: పేరుకు తగ్గట్టుగానే వేలాడుతున్న ముత్యాల్లా ఉంటుందీ మొక్క. అందుకే దీన్ని పెరల్‌ ప్లాంట్‌ అనీ పిలుస్తారు. ఆకులు ఆకుపచ్చని బఠాణీల్లా ఉంటాయి. దాల్చిన చెక్క వాసనుండే ఈ మొక్కకి తెల్లని పూలూ పూస్తాయి. వేగంగా పెరిగే ఈ మొక్క అయిదేళ్ల వరకూ జీవిస్తుంది. పెద్ద సంరక్షణ అవసరం ఉండదు కానీ.. వెలుతురు ఎక్కువగా కావాలి. రోజూ మట్టి తేమగా మారేలా కొద్దిగా నీరు అందిస్తే సరిపోతుంది.


బేబీ టియర్స్‌: సన్నటి తీగకి చిన్నగా, గుండ్రంగా ఉండే ఆకులుంటాయి. వేగంగా పెరిగే ఈ మొక్క జలపాతాల్ని తలపిస్తుంది. కొద్దిపాటి ఎండ, నీడ రెండు పరిస్థితుల్లోనూ పెరగగలదు. అయితే మరీ ఎండ, చలిని తట్టుకోలేదు. టెర్రారియంల్లో దీన్ని ఎక్కువగా పెంచుతుంటారు. కీటకాల బెడదా తక్కువ. నీరు ఎక్కువగా కావాలి. కుండీలో తేమ తగ్గిందో.. వేగంగా చనిపోతుంది కూడా. ఎప్పుడూ మట్టి తేమగా ఉందో లేదో చెక్‌ చేసుకుంటూ ఉండాలి.


పోతోస్‌: దీనికే డెవిల్స్‌ ఐవీ అనే పేరు. ఆకులు మెరుస్తూ హృదయాకారంలో ఉంటాయి. రకాన్ని బట్టి తెలుపు, పసుపు, బంగారు వర్ణాల్లో ఆకులపై గీతల్లా ఏర్పడుతుంటాయి. చాలా వెలుతురు కావాలి కానీ.. మరీ ఎక్కువ ఎండను తట్టుకోలేవు. ఉదయపు వేళల్లో కాసేపు ఉంచి, తర్వాత నేరుగా ఎండ పడని చోటికి మార్చాలి. కుండీలో మట్టి మరీ ఎండిపోతోంది అన్నప్పుడు నీరు అందిస్తే సరిపోతుంది. రెండు నెలలకోసారి గాఢత తక్కువ ఉన్న లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ను అందిస్తే సరిపోతుంది. ఎండిన, కుళ్లిన ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్