బతుకునిచ్చే అమ్మ

ఉరుముల మెరుపుల మేఘమాలికలు పుడమితల్లికి తలారా స్నానం చేయిస్తే, ఆమె తలలో తీరొక్క పువ్వులు తురిమి మురిసిపోతుంది తెలంగాణా తల్లి. పప్పుధాన్యాలతో, జొన్నలతో, మక్కలతో తమ ఇల్లు నింపిన భూదేవికి రోజొక్క పిండివంటలతో అలా కృతజ్ఞతలు తెలుపుతుంది. బతుకమ్మగా,

Published : 28 Sep 2022 01:04 IST

శరన్నవరాత్రులు

రుముల మెరుపుల మేఘమాలికలు పుడమితల్లికి తలారా స్నానం చేయిస్తే, ఆమె తలలో తీరొక్క పువ్వులు తురిమి మురిసిపోతుంది తెలంగాణా తల్లి. పప్పుధాన్యాలతో, జొన్నలతో, మక్కలతో తమ ఇల్లు నింపిన భూదేవికి రోజొక్క పిండివంటలతో అలా కృతజ్ఞతలు తెలుపుతుంది. బతుకమ్మగా, బతుకునిచ్చే అమ్మగా ఇంటింటి ఆడబిడ్డగా నవరాత్రుల వేళ నడిచివస్తుంది. ఊరూవాడా ఏకమై తన చుట్టూచేరి కథలు చెప్పుకొనే చనువునిస్తుంది. తమ బతుకులు చల్లంగుండాలంటూ ఏరేరి తెచ్చిన పూల సంబరమే బతుకమ్మ పండుగ. పూలతో దేవుణ్ణి కొలవటం కాదు పూలనే దేవతగా కొలిచే గొప్ప భావన బతుకమ్మ.

శ్రీచక్రాన్ని పోలి ఉండే బతుకమ్మ తయారీకి వాడకూడని పువ్వుండదు. పచ్చని తంగేడు శ్రీగౌరికి పీతాంబరమై మురిసిపోతే, పట్టుకుచ్చులు ఆమె కొంగుకొనకి ఒదిగిపోగలవు. ఆ సింగిడి పూల సోయగాలు కంటికి మనసుకు హాయినిస్తే, చెరువులో కలిసిన ఆ పూల ఔషధ గుణాలు ఒంటికి చలువనివ్వగలవు. చేతుల నిండా గాజులతో, గుండెల నిండా ప్రేమలతో, మహిళలంతా ఒక్కటై ఒకే శ్రుతితో ఒకే గతితో పాడే ఉయ్యాల పాటలు నిర్విరామలోకపాలనతో అలసిన ఆ తల్లిని సైతం సేదతీర్చగలవు.

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ పండుగ పుట్టుకకు ఎన్నో సామాజిక కారణాలున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీ సన్నిధానంలోని శివలింగాన్ని పెకిలించి బృహదీశ్వరాలయంలో పునః ప్రతిష్ఠ చేశాడు రాజేంద్ర చోళుడు. భర్త ఎడబాటును తాళలేని ఆ బృహదమ్మ కథనే నేటి బతుకమ్మకు నాంది. కాగా జానపదుల అమ్మదేవతలు, బౌద్ధులు నమ్మే హారీతి దేవత (రాక్షస దేవత)ల కోవకు చెందిన అమ్మ బుద్ధుని ప్రభావంతో పిల్లలను కాచే తల్లిగా బతుకమ్మగా మారిందనేది కొందరి నమ్మకం. ఊరికోసమో, తన వాళ్లకోసమో తృణప్రాయంగా చెరువుల వద్ద తమ జీవితాలను త్యాగం చేసిన వీర నారీమణుల ప్రతిరూపమే బతుకమ్మ. వారి త్యాగాల గురుతులో లేక రామాయణ భారత కథలో, తోటి పడచుల సుఖదుఃఖాల్లో, సుద్దులో వేటినైనా మహా రమణీయంగా, పాటలో ఒదిగించే నేర్పు తెలంగాణా మహిళలకే సొంతం. ఈ సంబరాలు వారసత్వ ఔన్నత్యాన్నీ కాపాడతాయి. మనదైన ఘనమైన బతుకమ్మను అదేస్థాయిలో రేపటి తరాలకు అందించడమే ఈ పండుగ ఆంతర్యం.


* శరన్నవరాత్రుల మూడోరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారు సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి. గాయత్రి దేవిని విద్యాధినేత అనీ, బుద్ధి, శక్తిని ప్రచోదనం చేస్తుందనీ చెబుతారు.


* నాలుగోరోజు బతుకమ్మను ‘నానబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. ఈరోజున నానబెట్టిన బియ్యాన్ని నైవేద్యంగా పెడతారు. కొన్నిప్రాంతాల్లో బియ్యంతోపాటు పెసరపప్పునూ నానబెట్టి సమర్పిస్తారు.


- పార్నంది అపర్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్