జగన్మాత శక్తిరూపిణి

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమఃసృష్టికర్త బ్రహ్మదేవుడికి శక్తి సరస్వతీదేవి. స్థితికారుడు విష్ణుమూర్తికి శక్తి లక్ష్మీదేవి. లయకారుడు పరమశివునికి శక్తి పార్వతీదేవి.

Published : 03 Oct 2022 00:57 IST

శరన్నవరాత్రులు

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

సృష్టికర్త బ్రహ్మదేవుడికి శక్తి సరస్వతీదేవి. స్థితికారుడు విష్ణుమూర్తికి శక్తి లక్ష్మీదేవి. లయకారుడు పరమశివునికి శక్తి పార్వతీదేవి. ఈ త్రిమూర్తులను, త్రిమాతలను కూడా సృష్టించింది లలితాదేవి. ఆ తల్లే శక్తి స్వరూపిణి. పరాశక్తిని గోమాత, భూమాత, జగన్మాత అంటూ మూడు రూపాలుగా కొలుస్తున్నాం. జగన్మాతే త్రిమాతలుగా, పోలేరమ్మ, నూకాలమ్మ, తలుపులమ్మ, గడియలమ్మ, గాజులమ్మ తదితర పేర్లతో గ్రామదేవతగా పూజలందుకుంటోంది. వీరంతా శక్తి స్వరూపాలే. ఆ ఏకైక శక్తిరూపిణే పరబ్రహ్మ శ్రీమల్లలితాదేవి.

శక్తి అనునిత్యమైంది, అపరిమితమైంది. మానసికం, ఆధ్యాత్మికం, పవిత్రం, శూన్యం- ఇలా అన్నిటికీ శక్తే కీలకం. అదే మూలాధారం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తుల స్వరూపిణి పరాశక్తి. ఆ ఆదిపరాశక్తి ఒక్కో యుగంలో ఒక్కో శక్తిగా విరాజిల్లింది. ప్రణవం, మంత్రం, బీజం, నాదం- సర్వం శక్తిమయం. ‘శక్యతే శక్తిః’ అన్నారు కనుక జయించడానికి సాధకమైనది, సాధ్యమైనది శక్తి.

శివుని ఆరాధించేవారు శైవులు. విష్ణువును ఆరాధించేవారు వైష్ణవులు. కానీ, ఏ పేరూ లేకుండా విశ్వ ప్రకృతి శక్తిని- అంటే పార్వతి అనో, లక్ష్మి అనో, సరస్వతి అనో కాకుండా ఆదిపరాశక్తిగా ఆరాధిస్తారు శాక్తేయులు. సిక్కులు అమ్మవారిని శక్తిఖండగా పూజిస్తారు. వారి మతగ్రంథంలో శక్తిమాత ఖడ్గంగా అవతరించి, రాక్షసులను సంహరించి దేవతలను రక్షించింది. ఈ శక్తి సకల దేవతల, సమస్త చరాచరాల సమైక్య శక్తి.

అంతటా శక్తి ఉంది. శక్తిలోనే అంతా ఉంది. అదీ శక్తిలోని శక్తి. శక్తిలోనే స్త్రీ, పురుష రూపాలు మిళితమై ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాల పేరుతో అమ్మవారి క్షేత్రాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. ప్రతి మాతా శక్తి సంయుతే. అయితే లోక కంటకులకు ఉగ్రశక్తి. సాధుమూర్తులకు సౌమ్య శక్తి. తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని, శాంత రూపంతో మనకిప్పుడు దర్శనమిస్తోంది జగన్మాత.


* దారిద్య్రం, దుఃఖం, భయం.. ఎలాంటి ఆపదలోనైనా ‘దుర్గా’ అని హృదయపూర్వకంగా స్మరిస్తే భక్తుల్ని సదా రక్షించే దేవి దుర్గామాత. త్రిశూలాన్ని ధరించి దుర్గతుల నుంచి కాపాడే శ్రీ దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపైన అమ్మ ఈరోజు దర్శనమిస్తుంది.

- డాక్టర్‌ లలితవాణి


సద్దుల బతుకమ్మ.. పోయిరావమ్మా!

చిక్కుడు ఆకుల్లా ఊయ్యలో..

సద్దులు గట్టుకుని ఉయ్యాలో..

సిరిపురం నేనువోతి ఉయ్యాలో.. చుట్టాలా జూడ ఉయ్యాలో..

అంటూ ఆనందంగా పాడుకుంటోన్న పూల పండగ చివరి రోజు వచ్చేసింది. ఈరోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, పెరుగన్నం, నువ్వులన్నం, కొబ్బరన్నం, మలీద ముద్దలు.. ఇలా రకరకాల సద్దులుచేసి సమర్పిస్తారు. కొందరు సత్తు పిండి రకాలనీ నైవేద్యంగా పెడతారు. చివర రోజున గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించి, బతుకమ్మను నీళ్లలో వదులుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్