క్షిప్రప్రసాదిని

దయాసముద్రయైన జగన్మాత కోరిన కోరికలు తీరుస్తుందట. అదీ వెనువెంటనే, తత్‌ క్షణమే. అమ్మ క్షిప్రప్రసాదిని. అడగటం పూర్తి కాకుండానే తీర్చేస్తుంది. ఎందుకంటే అవ్యాజ కరుణామూర్తి కదా! ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ‘భవాని త్వం దాసే మయివితర దృష్టి స్సకరుణా’ అన్నారు.

Published : 04 Oct 2022 00:59 IST

శరన్నవరాత్రులు

దయాసముద్రయైన జగన్మాత కోరిన కోరికలు తీరుస్తుందట. అదీ వెనువెంటనే, తత్‌ క్షణమే. అమ్మ క్షిప్రప్రసాదిని. అడగటం పూర్తి కాకుండానే తీర్చేస్తుంది. ఎందుకంటే అవ్యాజ కరుణామూర్తి కదా! ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ‘భవాని త్వం దాసే మయివితర దృష్టి స్సకరుణా’ అన్నారు. ‘అమ్మా! భవానీ! ఈ దాసుడిపై కరుణా దృష్టిని ప్రసరించు’ అని అడిగేందుకు.. ‘భవాని త్వం..’ అంటూ తొలి పదం ఉచ్చరించేసరికే కారుణ్యం కురిపిస్తుందట.

అమ్మ అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అంటే అమ్మను మనస్ఫూర్తిగా ఆరాధించాలి. పిల్లవాడు ఆడుకుంటూ అరిస్తే పెద్దగా పట్టించుకోని తల్లి బాధతో ‘అమ్మా!’ అనగానే అక్కున చేర్చుకుంటుంది. అలాగే ఆర్తితో పిలిస్తే అమ్మలగన్నయమ్మ పలుకుతుంది.

ఇంత దయగల తల్లి కొందరు రాక్షసాదులను సంహరించింది కదా! అదీ ఒకరకంగా అనుగ్రహమే.. వారికీ, లోకానికీ. అలా కాకుండా మనం కోరుకున్న చందంగా అనుగ్రహం కావాలంటే అమ్మవారికి నచ్చే విధంగా ఉండాలి. ఆమె నిర్మల, దుష్టదూర, దోష వర్జిత. అట్లా ఉండటానికి చేసే ప్రయత్నమే సంవత్సరంలో తొమ్మిది రోజులు కొన్ని నియమాలను దీక్షగా పాటించి అమ్మని ఉపాసించాలి. మహిషా సురుడు, శుంభనిశుంభులు లోక కంటకులే గాక స్త్రీలని చులకన చేశారు. అందుకే సంహరించింది. స్త్రీలకి ఉన్నత, గౌరవప్రద స్థానం ఇవ్వాలని సూచించటానికే నవ రాత్రుల్లో అన్ని వయసులూ, అవస్థల్లోని స్త్రీలని పూజిస్తారు పీఠాధిపతులతో సహా.

ఎవరి శక్తికి తగ్గట్టు వారు పరాశక్తిని ఆరాధించ వచ్చు. త్రికరణ శుద్ధి ప్రధానం. రాక్షస సంహారం చేసింది కనుక ఆ ఉగ్రత తగ్గించటానికి కుంకుమతో అర్చించి, పానకం, వడపప్పు, చలిమిడి నివేదించాలి. ఇక పిండివంటలు, ఆర్భాటాలు ఏవైనా తమ విభవం కొద్దీ చేయొచ్చు. కేవలం నమస్కరించినా సంతోషిస్తుంది. నామ పారాయణ ప్రీత కనుక స్తోత్రాలు చదివితే ఉప్పొంగిపోతుంది. షోడశోపచారాలతో పూజిస్తే మురిసిపోతుంది. వీటన్నింటినీ మించి తమ పరిమితిలోనైనా చెడుని నివారించగలిగితే, సాటివారిలో దైవాన్ని చూడగలిగితే, ఆర్తులను ఆదుకుంటే అమ్మ కళ్లల్లో ఆనందం చిప్పిల్లుతుంది. మనల్ని అనుగ్రహిస్తుంది.


మహిషాసురమర్దిని: దేవతలందరూ వారి శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలను ధరించి సింహవాహినిగా దర్శనమిస్తుంది.


- డాక్టర్‌ అనంతలక్ష్మి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్