వర్ణమైన అలంకరణ

చీరలు, బ్లవుజులు పాతవైతే వృథా చేయద్దు. వాటి అంచులను గది గోడలకు వర్ణమయంగా అలంకరించుకోవచ్చు. బ్లవుజులకు వేసే జరీ బోర్డర్లు మిగిలితే, వాటిని అందమైన ఫ్రేముల్లో బిగించి గదికి ప్రత్యేకతను తేవొచ్చు.

Published : 07 Oct 2022 00:15 IST

చీరలు, బ్లవుజులు పాతవైతే వృథా చేయద్దు. వాటి అంచులను గది గోడలకు వర్ణమయంగా అలంకరించుకోవచ్చు. బ్లవుజులకు వేసే జరీ బోర్డర్లు మిగిలితే, వాటిని అందమైన ఫ్రేముల్లో బిగించి గదికి ప్రత్యేకతను తేవొచ్చు.

పాత లేదా కొత్త ఫొటో ఫ్రేములుంటే వాటి అంచులకు గది గోడ వర్ణాన్నిబట్టి మ్యాచింగ్‌ పెయింటింగ్‌ వేసి ఆరనివ్వాలి.  ఫ్రేము పరిమాణానికి సరిపోయేలా బేస్‌గా సాదా కాటన్‌ వస్త్రాన్ని ఎంచుకొని ముడతల్లేకుండా ఇస్త్రీ చేయాలి. దానికి అటాచ్‌ చేయాలనుకుంటున్న జరీ బోర్డరున్న వస్త్రాన్ని ముందుగానే ఫ్రేములో చివర సరిపోయేలా చూసి కట్‌ చేసి సిద్ధంగా ఉంచాలి. ఈ జరీ అంచును ఇస్త్రీ చేసి ఉంచిన కాటన్‌ వస్త్రానికి చివర వచ్చేలా ఒకవైపు గ్లూతో అతికించాలి. అవసరమైతే ఈ అంచుకు ఫ్యాన్సీ ముత్యాలు, బిళ్లలు, అద్దాలు, సన్నని జరీ రిబ్బన్లు వంటివి కూడా గ్లూతో అటాచ్‌ చేస్తే చూడటానికి మరింత కళగా కనిపిస్తుంది. దీన్ని ఆరనిచ్చి ఫొటో ఫ్రేములో బిగిస్తే చాలు. ఇలా గది గోడకు తగినట్లుగా నాలుగు లేదా ఆరు ఫ్రేములను సిద్ధం చేసుకోవాలి. వీటన్నింటిని గుండ్రంగా లేదా దీర్ఘచతురస్రాకారంగా వచ్చేలా పడక గది లేదా భోజనాల గది గోడలపై సర్దితే ఆ చోటుకే ఓ ప్రత్యేకత వస్తుంది.

ఎంబ్రాయిడరీ రింగ్స్‌లో..
పాత ఎంబ్రయిడరీ రింగ్స్‌, చీర పైట అంచులు, దుప్పట్ల చివర్ల బోర్డర్లు ఇంట్లో ఉంటే, వీటిని వృథా చేయకుండా ఇంటి అలంకరణలో వినియోగించొచ్చు. ముందుగా రింగ్స్‌ అంచులు కొట్టొచ్చినట్లు కనిపించాలంటే వాటికి ముదురువర్ణం పెయింటింగ్‌ వేసి ఆరబెట్టాలి. చిన్నాపెద్దా.. ఉండేలా మూడు లేదా నాలుగు సైజుల్లో రింగ్స్‌ను ఎంపిక చేసుకొని వాటి పరిమాణానికి తగినట్లుగా వర్ణమయంగా ఉండే చీరంచులు లేదా దుప్పట్ల బోర్డర్లను కట్‌ చేసుకోవాలి. వీటిని ఎంబ్రాయిడరీ రింగ్‌లో ఉంచి బిగుతుగా బిగిస్తే చాలు. ఫ్రేము సిద్ధమైనట్లే. వీటిని ముందుగదిలో ఇండోర్‌ మొక్క పక్కగా గోడకు అలంకరిస్తే చాలు. కొత్తగా కనిపిస్తూ గదిగోడను అందంగా మార్చేస్తాయి. అలాగే ఇప్పుడు రకరకాల గోల్డ్‌, యాంటిక్‌ డిజైన్లతో కోడి గుడ్డు ఆకారంలో ఖాళీ ఫ్రేములు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వాటిలోనూ ఇంట్లో వృథాగా ఉన్న జరీ, చేనేత పనితనం ఉన్న వస్త్రముక్కలను బిగించి గోడకు అలంకరించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్