మందారం విరబూయాలంటే..

నర్సరీలో విరబూసిన మందార మొక్కలను చూస్తే చాలు.. వెంటనే ఇంటికి తెచ్చి మురిసిపోతుంది రమాదేవి. తీరా నెలరోజులకే దానికున్న మొగ్గలన్నీ రాలిపోతుంటాయి.

Published : 12 Oct 2022 00:33 IST

నర్సరీలో విరబూసిన మందార మొక్కలను చూస్తే చాలు.. వెంటనే ఇంటికి తెచ్చి మురిసిపోతుంది రమాదేవి. తీరా నెలరోజులకే దానికున్న మొగ్గలన్నీ రాలిపోతుంటాయి. ఇలాకాకుండా ఏడాదంతా మందారం విరబూస్తూ తోటకు కళ తేవాలంటే నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఇంట్లో తయారుచేసే సహజ సిద్ధమైన ఎరువులతోనే పెంచడమెలాగో వివరిస్తున్నారు.

మందారలో మొగ్గ లేదా చిగుర్ల వద్ద పురుగుపట్టే ఆస్కారం ఎక్కువ. చీడపట్టే ముందు ఆ ప్రాంతమంతా చీమలెక్కువగా కనిపిస్తాయి. వెంటనే ఆ కాండం, చిగుర్లు లేదా మొగ్గల వద్ద కత్తెర¢తో కట్‌ చేసి దాన్నంతా ఒక కాగితం లేదా కవరులో ఉంచి తోటకు దూరంగా తీసుకెళ్లి పడేయాలి. ఈ చీడను వెంటనే నియంత్రించకపోతే మిగతా మొక్కలకూ సోకే ప్రమాదం ఉంది. రెండు చెంచాల పసుపు, కప్పు వెల్లుల్లి రెబ్బలకు రెండు కప్పుల నీటిని కలిపి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి మొక్కలపై చల్లితే చీడ తగ్గుతుంది. పాత్రలు కడగడానికి వినియోగించే డిష్‌వాష్‌ లిక్విడ్‌ సోపులో చెంచా వెజిటబుల్‌ ఆయిల్‌ కలిపి స్ప్రే చేసినా చీడ దూరమవుతుంది.

ఎరువులు..

తోటలో ఓ పక్కగా రెండు గోతులు తీసి, ఒకదాంట్లో వంటింటి వ్యర్థాలు, మధ్యలో పుల్లని మజ్జిగ, పేడ, బెల్లం నీళ్లు వంటివి పోస్తూ ఉండాలి. మొదటిది నిండిన వెంటనే మట్టితో మూసేయాలి. తర్వాత రెండోదాన్ని నింపడం మొదలుపెట్టాలి. ఇది నిండేలోపు మొదటి దాంట్లో సేంద్రియ ఎరువు తయారవుతుంది. దీన్ని మందార మొక్కల మొదళ్లలో వేస్తే, పోషకాలు అంది, ఆరోగ్యంగా ఎదుగుతాయి. ఉడికించినవి కాకుండా తాజా కోడిగుడ్ల పెంకులను ఎండబెట్టి మెత్తని పొడిగా చేయాలి. దీనికి ఎండిన అరటి పండు తొక్కల పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని మొక్కల మొదళ్లలో వేస్తే మొక్కలకు బలం చేకూరి, మొగ్గలు రాలే సమస్య ఉండదు. 

మరిన్ని..

మందారం మొక్క ప్రతి కొమ్మకు చివర చిగురుతోపాటు మొగ్గ రావాలి. రాకపోతే.. కొమ్మ చివర్లను కత్తిరిస్తే, తిరిగి వచ్చే కొత్త చిగురులో మొగ్గ తప్పనిసరిగా ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న ఒకటీరెండు మొక్కలను అంటుకట్టే విధానంతోనూ.. మొక్కల సంఖ్యను పెంచొచ్చు. ప్రతి మొక్కకు పువ్వులు పూయడానికి మధ్య కొంత వ్యవధి ఉంటుంది. అలాంటప్పుడు కాండాన్ని చివర్లో కట్‌ చేస్తే, అక్కడ రెండు కొమ్మలుగా చిగుర్లు వచ్చి మొక్క గుబురుగా పెరిగి మరిన్ని పూలు పూస్తాయి. అలాగే రెండుమూడు రోజులకొకసారి బియ్యం కడిగిన నీళ్లను మొక్కల మొదళ్లలో పోస్తుంటే ఈ నీటిలోని ఔషధ గుణాలు మొక్కలకు అంది ఆరోగ్యంగా ఉంచుతాయి. మొగ్గలను రాలనివ్వవు. అప్పుడప్పుడు మొక్కల అడుగున లేదా పురుగు పట్టినప్పుడు దానిపై బూడిద చల్లినా.. ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్