వెనిగర్‌.. మొక్కలకీ!

వంటల్లో, ఇంటి శుభ్రతలో వెనిగర్‌ వాడకం మనకు అలవాటే. ఆరోగ్యానికీ ఇది చేసే మేలెంతో! మరి తోటపనిలోనూ సాయపడుతుందని తెలుసా?

Published : 13 Oct 2022 00:23 IST

వంటల్లో, ఇంటి శుభ్రతలో వెనిగర్‌ వాడకం మనకు అలవాటే. ఆరోగ్యానికీ ఇది చేసే మేలెంతో! మరి తోటపనిలోనూ సాయపడుతుందని తెలుసా?

* ఎంతో ఖర్చుపెట్టి మొక్కలు తెస్తాం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు చనిపోతుంటాయి. పిచ్చి మొక్కలు, గడ్డి మాత్రం ఎంత వద్దన్నా వచ్చేస్తుంటాయి. వాటిని తీసేయడం పెద్ద పని. రసాయనాలు పిచికారీ చేస్తే పక్కన మొక్కలకే కాదు మనకీ ప్రమాదం. అందుకే వాటి మీద వైట్‌ డిస్టిల్డ్‌ వెనిగర్‌ చల్లండి.. చనిపోతాయి.

* మొక్కలూ అలంకరణలో భాగమయ్యాయి. అందుకే ముచ్చటైన కుండీలను వెతుక్కొని మరీ తెచ్చేస్తుంటాం. కానీ వాటిపై కొద్దిరోజులకే మరకలు, బ్యాక్టీరియా చేరుతుంటాయి. వస్త్రంతో వెనిగర్‌ వేసి తుడవండి. తేలిగ్గా శుభ్రమవడమే కాదు.. సూక్ష్మక్రిములు చేరకుండానూ చూసుకుంటుంది.

* మొక్కల శత్రువుల్లో చీమలూ ఒకటి. ఆకులు, వేర్లనీ కొరికేస్తుంటాయి. అవి కనిపించిన చోట సమపాళ్లలో కలిపిన వెనిగర్‌, నీటి మిశ్రమాన్ని పిచికారీ చేయండి. గాఢమైన వాసన కదా! చీమలు మళ్లీ రావు.

* మార్కెట్‌కి వెళితే గులాబీలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. వేడుకలప్పుడు బహుమతిగానూ వస్తుంటాయి. అందంగా ఉండటంతోపాటు మనసుకి ఆనందాన్నిచ్చే ఇవి ఒక్కరోజుకే వాడిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. పొడవైన కాడలున్న పూలను నీటికి పంచదార, వెనిగర్‌ కలిపిన మిశ్రమంలో ఉంచండి. చాలా రోజులు తాజాగా ఉంటాయి.

* చీడల బెడదా? లీటరు నీటికి పావు కప్పు వెనిగర్‌ కలిపి పిచికారీ చేయండి. పండ్ల ఈగలూ మొక్కలకు సమస్యే. పండ్లు, కూరగాయల మొక్కల దగ్గర ఒక చిన్న గిన్నెలో ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌, లిక్విడ్‌ డిష్‌వాష్‌ కలిపిన మిశ్రమాన్ని ఉంచండి.

* కొన్ని విత్తనాలు త్వరగా మొలకెత్తవు. ఒక పాత్రలో వెనిగర్‌ వేసి వాటిని దాన్లో రాత్రంతా ఉంచండి. తర్వాత విత్తితే.. త్వరగా మొలకెత్తుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్