చామంతి నిరంతరం..

నర్సరీలో చామంతి మొక్కను చూసినవెంటనే మనసు పారేసుకోవడం సహజం. అక్కడి నుంచి ఇంటికి తెచ్చుకునే తొట్టెలో కొమ్మలు కనపడనంతగా మొగ్గలుంటాయి. అవన్నీ పూలైన తర్వాత మొక్క మరోసారి మొగ్గ తొడగదు. అలాకాకుండా నిరంతరం చామంతి పూయాలంటే నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

Updated : 18 Oct 2022 05:46 IST

నర్సరీలో చామంతి మొక్కను చూసినవెంటనే మనసు పారేసుకోవడం సహజం. అక్కడి నుంచి ఇంటికి తెచ్చుకునే తొట్టెలో కొమ్మలు కనపడనంతగా మొగ్గలుంటాయి. అవన్నీ పూలైన తర్వాత మొక్క మరోసారి మొగ్గ తొడగదు. అలాకాకుండా నిరంతరం చామంతి పూయాలంటే నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

మొక్కను తెచ్చిన వెంటనే పెద్ద తొట్టెలోకి ముందుగా మార్చుకోవాలి. ఒక పెద్ద తొట్టెలో 50 శాతం ఎర్రమట్టి,  25 శాతం చొప్పున కోకోపీట్‌, పేడ, కప్పు ఇసుకను బాగా కలిపి దానికి కొంచెం వేప పిండి కలపాలి. ఇందులో నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను నాటితే చాలు. ఆరోగ్యంగా పెరుగుతుంది. మరిన్ని కొమ్మలు వస్తాయి. లేదంటే తెచ్చినప్పుడు మొక్కకు ఉన్న మొగ్గలు మాత్రమే పూలవుతాయి. ఆ తర్వాత మొక్క వడలిపోయినట్లు అవుతుంది. మార్చుకునే తొట్టెకు అదనపు నీరు బయటకు వెళ్లడానికి రంధ్రాలు ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే నీరెక్కువై మొక్క త్వరగా చనిపోతుంది. తొట్టెను రోజంతా ఎండలో ఉంచితేనే చామంతి మొక్క ఎదుగుదల బాగుంటుంది. ఉదయం లేదా సాయంత్రం తొట్టెలోని మట్టి తడిగా ఉందా లేదా గుర్తించి,
నీటిని అందించాలి.

ఎరువులు.. మొక్కలు మొగ్గ తొడగక ముందు మాత్రమే ఎరువులు వేయాలి. మొగ్గలు వచ్చిన తర్వాత ఎరువులను ఆపేయడం మంచిది. లేదంటే మొక్క ఎదుగుతూనే ఉంటుంది తప్ప, మొగ్గ తొడగడం ఆలస్యమవుతుంది. ఎండిన అరటి తొక్కలు, కోడిగుడ్డు పెంకులను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేయాలి. దీన్ని వారానికొకసారి మొక్క మొదట్లో వేస్తే సేంద్రియ ఎరువుగా పని చేసి పూలెక్కువగా పూస్తాయి. మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఉల్లి పాయ తొక్కలను మిక్సీలో వేసి కొంచెం నీటిని కలిపి రసంలా చేయాలి. మెత్తగా వచ్చే ఈ రసాన్ని కూడా చామంతి మొక్కకు ఎరువుగా వాడొచ్చు. వంటింటి వ్యర్థాలను ఎరువుగా చేసి వేస్తే మొక్క నిత్యం మొగ్గ తొడుగుతూనే ఉంటుంది.

ఎక్కువగా.. ప్రతిసారీ పూలు విరిసిన తర్వాత ఆ కొమ్మ చివర కట్‌ చేస్తుండాలి. రెండు మూడు నెలలకొకసారి ముదిరిన కొమ్మల చివరలు కత్తిరిస్తుంటే పక్క నుంచి మరిన్ని కొమ్మలొచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. ప్రతి కొమ్మ చివరా ఎక్కువగా మొగ్గలు తొడుగుతుంటాయి. ఆరోగ్యంగా ఉండటమే కాదు, ప్రతి కొమ్మకూ పూలు విరబూస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్