అమ్మాడీ... కొందామా పుత్తడి!

రవ్వల గాజులూ, రాళ్ల హారాలూ, ముత్యాల గొలుసులూ... మువ్వల కంఠెలూ... అరవంకీలూ, వడ్డాణాలూ... పచ్చల పతకం... పేరేదైనా పసిడి నగలు తరతరాల వారసత్వం కొందరికి. ఇంకొందరికి భవిష్యత్తుకు పెట్టుబడి. అందుకేనేమో... ధర పెరుగుతున్నా పసిడి కొనడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు మహిళలు.

Updated : 23 Oct 2022 06:44 IST

ధన త్రయోదశి సందర్భంగా

రవ్వల గాజులూ, రాళ్ల హారాలూ, ముత్యాల గొలుసులూ... మువ్వల కంఠెలూ... అరవంకీలూ, వడ్డాణాలూ... పచ్చల పతకం... పేరేదైనా పసిడి నగలు తరతరాల వారసత్వం కొందరికి. ఇంకొందరికి భవిష్యత్తుకు పెట్టుబడి. అందుకేనేమో... ధర పెరుగుతున్నా పసిడి కొనడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు మహిళలు. యువత కూడా చిన్న మొత్తంలో అయినా పుత్తడి కొనడానికి ఇష్టపడుతోందని చెబుతోంది వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక. మరి ఇంతటి ప్రాధాన్యమున్న బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎంతకాలం ఉంచినా వన్నె తరగని లోహం బంగారం. అందుకే దీనికంత విలువ కూడా. నిజానికి పుత్తడి కొనడానికి మహిళలకు సందర్భమే అక్కర్లేదు. కానీ... ధనత్రయోదశి లాంటి పర్వ దినాలు సెంటిమెంట్‌నీ గుర్తు చేస్తాయి. అందుకే పండగవేళ పిసరంత బంగారమైనా కొనాలనుకుంటారు.

ఆఫర్లున్నా ఆలోచించండి...

బంగారాన్ని కొనుగోలు చేసేముందు దాని ధర తెలుసుకోవాలి. ఎందుకంటే పసిడి ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అన్ని చోట్లా కూడా ఒకేలా ఉండదు. దాన్ని గమనించుకోవాలి. పండగల వేళ దుకాణాలూ మజూరీపై తగ్గింపు, లక్కీ డ్రాలూ, రాయితీలూ, జీరోమేకింగ్‌ ఛార్జీలూ వంటి ఆఫర్లెన్నో ప్రకటిస్తుంటాయి. అయినా సరే... ప్రతి రూపాయినీ లెక్కేసుకుని మరీ కొనుగోలు చేయాల్సిందే.


స్వచ్ఛతను గుర్తించాలి...

బంగారం కొనుగోలులో మరో ముఖ్య అంశం ‘స్వచ్ఛత’. 24 వన్నెల (క్యారెట్ల) పుత్తడిని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. కానీ, అది  మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీకి వెండి, రాగి వంటి ఇతర లోహాలను కలుపుతారు. ప్రస్తుతం మనం కొనే నగలు 22 క్యారెట్లవి. వాటి స్వచ్ఛతను తెలియజేసే ముద్ర ఆభరణంపై క్యారెట్‌ (22కె916) ఉందో లేదో చూసుకోవాలి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనాలంటే కాయిన్లూ, బార్ల రూపంలో తీసుకోవచ్చు.


హాల్‌మార్కింగ్‌ ఉందా...

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) పసిడి నాణ్యతను తెలియజేయడానికి త్రిభుజాకారంలో ఓ గుర్తుని ముద్రిస్తుంది. దీన్నే హాల్‌మార్క్‌ అంటారు. అయితే ఈ సంస్థ నుంచి అనుమతి పొందిన దుకాణాల నుంచి కాకుండా కొన్ని దుకాణాలు సొంతంగా ముద్రించుకుంటున్నాయి. ఏ మాత్రం సందేహం ఉన్నా... బీఐఎస్‌ వెబ్‌సైట్లో పొందుపరిచిన ఏహెచ్‌సీ (ఎస్సేయింగ్‌ హాల్‌మార్కింగ్‌ కేంద్రం) వద్ద మనమే సొంతంగా తనిఖీ చేయించుకోవచ్చు.


స్పష్టత కావాలి...

ఏ తరహా నగలు కొంటే ఎంతెంత తరుగూ, మజూరీ, రీసేల్‌ వాల్యూ ఉంటాయో గమనించుకోండి. నగ పనితనాన్ని బట్టి 8 నుంచి 20 శాతం వరకూ మజూరీని లెక్కగడతారు. ముఖ్యంగా రాళ్ల నగలు కొన్నప్పుడు... బంగారాన్నీ, రాళ్లనీ విడివిడిగా లెక్కవేశారో లేదో గమనించుకోండి. వీటి తయారీకి వేస్టేజ్‌ కూడా ఎక్కువే. అలానే రాళ్లకు అసలు విలువ ఉండదు కానీ, నవరత్నాలూ, అన్‌కట్‌ డైమండ్స్‌కి మాత్రం రీసేల్‌ వాల్యూ ఉంటుంది. ఈ వివరాలన్నీ తెలుసుకోవడమే కాదు వారిచ్చే బిల్లు మీద కూడా రాయించండి. అయితే బిల్లు తెల్లకాగితం మీద ఉండకుండా చూసుకోండి.


పెట్టుబడి కోసం...

నగల్ని స్వర్ణకారుడి దగ్గరా, బ్రాండెడ్‌ షోరూమ్‌ల్లోనూ కొనొచ్చు. నాణేల్ని కొనాలనుకుంటే బ్యాంకుల్లోనూ దొరుకుతాయి. పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటే... డిజిటల్‌ గోల్డ్‌ అంటే...గోల్డ్‌ ఈటీఎఫ్‌, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే పండగల సీజన్‌లో 10 శాతం మాత్రమే బంగారం కొనుగోళ్లపై పెట్టుబడి పెట్టాలని బులియన్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్