పండగ.. పర్యావరణ హితంగా!

ఇల్లంతా వెలుగులతో ఈ పండగ ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందో.. టపాసుల మోత అంత భయపెడుతుంది. పర్యావరణ కాలుష్యం కూడా. జంతువులకూ ఇబ్బందే. అందరూ ఆనందంగా ఉండటమేగా పండగ పరమార్థం. అందుకే దాన్ని పర్యావరణహితంగా చేసుకుందాం.

Published : 24 Oct 2022 00:36 IST

ఇల్లంతా వెలుగులతో ఈ పండగ ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందో.. టపాసుల మోత అంత భయపెడుతుంది. పర్యావరణ కాలుష్యం కూడా. జంతువులకూ ఇబ్బందే. అందరూ ఆనందంగా ఉండటమేగా పండగ పరమార్థం. అందుకే దాన్ని పర్యావరణహితంగా చేసుకుందాం.

ప్లాస్టిక్‌, అవసరం తీరగానే పడేసే కొన్నిరకాల క్యాండిళ్లు భూమిలో త్వరగా కలిసిపోవు. కాబట్టి మట్టి ప్రమిదలకు ప్రాధాన్యమివ్వండి. పర్యావరణానికి హాని ఉండదు. చిరువ్యాపారులకూ చేయూత ఇచ్చిన వారవుతారు.

దీపావళికి ఇల్లంతా అలంకరించడం ఆనవాయితీ. తిరిగి వచ్చే ఏడాదీ లేదా ఇతర పండగలకీ ఉపయోగించగలిగేవే కొనండి. మరీ అవసరమైతే తప్ప లైట్లతో ఇళ్లంతా నింపేయకండీ. ఇదీ ఒకరకమైన వృథానే. కావాలనుకుంటే సోలార్‌ దీపాలను ఎంచుకోవచ్చు. రంగురంగుల ముగ్గుల మధ్య దీపాలను పెట్టి ఆనందిస్తాం. ఇవీ రసాయనాలతో నిండినవే. పర్యావరణ హిత రంగులను ఎంచుకుంటే కాలుష్యాన్ని తగ్గించిన వాళ్లమవుతాం.

ఆత్మీయులకు బంగారం, మేకప్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను బహుమతులుగా ఎంచుకుంటున్నారా? వాటిని ప్లాస్టిక్‌ రేపర్‌లో పెట్టివ్వకండి. చూడ్డానికి అందంగా ఉన్నా అదీ భూమిలో కలవడానికి ఏళ్లు పడుతుంది. బదులుగా హ్యాండ్‌మేడ్‌, ఖాదీ బ్యాగుల్లోనో, వెదురు బుట్టల్లోనో పెట్టిస్తే వాటినీ వాళ్లు ఉపయోగించుకోగలుగుతారు. స్నేహితులకు మొక్కలు, సేంద్రియ చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందివ్వండి. మంచి పనికితోడు ఆరోగ్యం.

టపాసుల్లేని దీపావళేంటి.. చాలామంది అనే మాటే కదూ! ఈ ఒక్కరోజే కొన్నేళ్లకు సరిపడా కాలుష్యాన్ని తెచ్చిపెడుతోందని నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్‌ తరాల గురించీ ఆలోచించాలిగా! వీలైనంత వరకూ టపాసులకు దూరంగా ఉండండి. లేదూ పర్యావరణ హితమైనవి దొరుకుతున్నాయి, వాటినైనా ఎంచుకోండి.

పండగంటే అతిథులు మామూలే. భోజనాలకు పేపర్‌, ప్లాస్టిక్‌ గ్లాసులు, పళ్లేలను కాక అరటి, వెదురు, ఆకులతో చేసినవి ఉపయోగించండి. సంప్రదాయం ఉట్టి పడుతుంది, భూమిలో త్వరగా కలిసిపోతాయి కాబట్టి, పర్యావరణానికీ మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్