ఇంట్లోనే మాయిశ్చరైజర్‌!

మిగతా కాలాలతో పోలిస్తే శీతకాలం చర్మానికి అదనపు తేమ అవసరం. అలాగని అందరికీ ఒకే రకమైన మాయిశ్చరైజర్‌ సరిపోదు. చర్మతీరును బట్టి ఎంచుకోవాలి.

Updated : 02 Nov 2022 05:37 IST

మిగతా కాలాలతో పోలిస్తే శీతకాలం చర్మానికి అదనపు తేమ అవసరం. అలాగని అందరికీ ఒకే రకమైన మాయిశ్చరైజర్‌ సరిపోదు. చర్మతీరును బట్టి ఎంచుకోవాలి. ఇదో తలనొప్పి అనుకునేవారు.. ఇంట్లోనే ప్రయత్నిస్తే పోలా!

* జిడ్డు చర్మానికి.. వీరికి మాయిశ్చరైజర్‌ అవసరమే ఉండదు. లేదని రాసినా మొటిమలు వచ్చేస్తాయనేది చాలామంది అభిప్రాయం. ఇది అపోహే అంటున్నారు నిపుణులు. 50 మి.లీ. ఆలివ్‌ నూనెకు 2 చెంచాల పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి దూదితో ముఖం, కాళ్లు, చేతులకు రాయండి. ఆలివ్‌ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. చర్మానికి పోషణను అందిస్తుంది. నిమ్మ అతిగా నూనెలను విడుదలవ్వకుండా చూడటమే కాదు యాక్నేకీ విరుగుడుగా పనిచేస్తుంది. పాలలోని లాక్టిక్‌ ఆసిడ్‌ చర్మకణాలకు విశ్రాంతినిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెడితే మూడు రోజులు వాడుకోవచ్చు.

* పొడి చర్మానికి.. మామూలుగానే ఎండకు చర్మం దెబ్బతినడం, త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడం వంటివి వీరికి సాధారణం. శీతకాలం ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది. సబ్బుకు బదులుగా మైల్డ్‌ క్లెన్సర్‌ ఉపయోగిస్తూ ఈ సహజ మాయిశ్చరైజర్‌నీ ప్రయత్నించేయండి. అరకప్పు కొబ్బరినూనెకు రెండు క్యాప్సూల్స్‌ విటమిన్‌ ఇ నూనె, లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కొన్ని చుక్కలు కలిపి, శుభ్రమైన డబ్బాలో పోసి ఉంచుకోండి. కొబ్బరి నూనె చల్లగాలులకు దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేస్తుంది. చర్మంలో స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. విటమిన్‌ ఇలోని యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మికి చర్మకణాలు దెబ్బతినకుండా కాపాడటమే కాదు.. తేమనీ అందిస్తుంది.

* యాక్నే ఉన్న వారు.. ఆర్గాన్‌ ఆయిల్‌ వీరికి ఉత్తమ ఎంపిక. రోజూ రాత్రి దీన్ని ముఖానికి పట్టించి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఉదయం స్పూను కలబంద గుజ్జుకు స్పూను గులాబీనీరు, 4 చుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి రాసుకుంటే సరి. దీన్ని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఇవి యాక్నేనే కాదు.. వాటివల్ల వచ్చే ఎరుపుదనం, బ్లాక్‌హెడ్స్‌నీ తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్