మిద్దె తోట ప్రయత్నిస్తున్నారా?

ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం.. కారణమేదైతేనేం టెర్రస్‌ గార్డెనింగ్‌కి ఆదరణ పెరుగుతోంది. మీకూ ప్రయత్నించాలనుందా? ముందు వీటి గురించి తెలుసుకోండి.

Updated : 02 Nov 2022 03:20 IST

ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం.. కారణమేదైతేనేం టెర్రస్‌ గార్డెనింగ్‌కి ఆదరణ పెరుగుతోంది. మీకూ ప్రయత్నించాలనుందా? ముందు వీటి గురించి తెలుసుకోండి.

* ఏం పెంచాలనుకుంటున్నారు? ముందు ఆలోచించాల్సిన విషయమిది. చిన్న వేర్లున్న మొక్కలు, పొదలు, కూరగాయల మొక్కలు వంటివి ఎంచుకోవడం మేలు. అప్పుడే టెర్రస్‌ బీటలు వారడం లాంటి సమస్యలుండవు.

* మట్టి నాణ్యమైనదైతేనే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ తోటలకు ఎర్రమట్టి మంచి ఎంపిక. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. నాణ్యమైన కంపోస్ట్‌ను ఎంచుకుంటే మంచి ఫలితం పొందొచ్చు. అయితే మొక్కలు ఈ పోషకాలను త్వరగా తీసేసుకుంటుంటాయి. కాబట్టి, తరచూ కంపోస్ట్‌ను జోడించాలి. అది మీ దగ్గర్లో ఎక్కడ లభిస్తుందో వాకబు చేసుకోవాలి. లేదూ ఇంట్లోనే  చేసుకునే వీలుందేమో చూసుకోండి. ఇంటికి మూలన చిన్న గుంట తీసో, ఓ డబ్బాలోనో దీన్ని తయారు చేసుకోవచ్చు. కింది భాగాన్ని చెత్తతో నింపి దానిపై వంటగది వ్యర్థాలను వేయాలి. పైన మట్టితో కప్పేయాలి. డబ్బా నిండేంత వరకూ ఇలా చేస్తూ వెళ్లాలి. మధ్యమధ్య కలియ బెడుతూ ఉంటే సరి. వారం పదిరోజులయ్యాక కుండీల్లో మట్టికి కంపోస్టులా చేరిస్తే సరిపోతుంది.

* పొలంలోలా మడుల్లా చేసి మొక్కల్ని పెంచుకుంటూ పోతే ఏం బాగుంటుంది? అక్కడక్కడా కుండీలను చేరిస్తేనే అందం. మిద్దె ఎంత పెద్దదైనా కుండీలకూ చోటివ్వండి. చిన్నదనుకోండి.. స్టాండ్లనూ ఏర్పాటు చేసుకుంటే చూడ్డానికీ బాగుంటాయి. అయితే తేలికగా శుభ్రం చేసుకునేలా, ఎక్కువైన నీరు కారిపోయేలా ఉండేవాటిని ఎంచుకోవడం మర్చిపోవద్దు.

* మొక్కలన్నాక నీరు సరిపోకపోవడం లేదా ఎక్కువవడంతో చనిపోతుంటాయి. కీటకాల బెడద సరేసరి. వీటి గురించీ తెలుసుకోవాలి. తక్కువ నిర్వహణ అవసరమైనవి ఎంచుకుంటే ఇంకా మంచిది. వాడాల్సిన పురుగు మందులు, పరిమాణాలూ తెలుసుకుంటే మిద్దె తోటతో మీరు కోరుకున్న ఫలితాల్ని పొందొచ్చు. పురుగుల మందుల విషయంలోనూ సేంద్రియమైనవి ఎంచుకుంటే అదనపు ఆరోగ్యం. ఈ విషయంలో సలహాలిచ్చే యూట్యూబ్‌ ఛానెళ్లూ బోలెడు.. అనుసరించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్