కొమ్మకొమ్మకీ..గులాబీల గుత్తులు

గులాబీ మొక్కకు నర్సరీలో పూలు విరగబూసి ఉంటాయి. ఇంటికి తెచ్చిన నెలకే మొగ్గ తొడగకుండా, మొక్కంతా వాడి పోయి, ఆకులకు బూజు మొదలవుతుంది. మరి అప్పుడు ఏం చేయాలంటే...

Published : 10 Nov 2022 00:09 IST

గులాబీ మొక్కకు నర్సరీలో పూలు విరగబూసి ఉంటాయి. ఇంటికి తెచ్చిన నెలకే మొగ్గ తొడగకుండా, మొక్కంతా వాడి పోయి, ఆకులకు బూజు మొదలవుతుంది. మరి అప్పుడు ఏం చేయాలంటే..

అరటి, నారింజ, కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసి మొక్కకు పోషకాలను అందించాలి. ఉడికించని కోడిగుడ్ల పెంకుల పొడి ఎరువుగా ఉపయోగపడుతుంది. కూరగాయల వ్యర్థాలను మట్టిలో ఉంచి రెండు వారాల తర్వాత ఆ మట్టిని మొక్క మొదలులో వేయాలి. వీటి నుంచి కాల్షియం, పొటాషియం వంటి పోషకాలంది పూలు విరగ బూస్తాయి. వాడిన టీ పొడిని నీళ్లతో శుభ్రం చేస్తే అందులోని చక్కెర కరిగిపోతుంది. దీన్ని ఎండలో ఆరబెట్టి గాజు సీసాలో భద్రపరచాలి. చెంచా టీపొడిని మొదట్లో వేసి మట్టిలో కలిపి, పైన నీటిని చిలకరించాలి. ఇందులోని నైట్రోజన్‌ మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది. బూజును సోకనివ్వదు. ఇలా నెలకొకసారి ఇస్తే చాలు. ఎక్కువగా పెరిగే కొమ్మలను కట్‌ చేయాలి. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

అంటుకట్టి: పూలు పూసిన తర్వాత ఆ కొమ్మను అక్కడితో కట్‌ చేస్తుంటే పక్క నుంచి కొత్త కొమ్మలు రావడంతోపాటు మొగ్గలు తొడగడం మొదలవుతుంది. అంటుకట్టడం ద్వారా కొత్త మొక్కలొచ్చేలా చేయొచ్చు. బాగా ముదిరిన మొక్క నుంచి చిన్న కొమ్మను కట్‌ చేసి వేరే తొట్టెలో నాటొచ్చు. కలబంద ఆకు నుంచి చిన్నముక్క కట్‌ చేసి దానికి రంధ్రం చేసి, అందులో గులాబీ కొమ్మనుంచి మరొక తొట్టెలో పాతాలి. కలబంద ఆకు కుళ్లి, మొక్కకు ఎరువుగా మారి చిగురొచ్చేలా చేస్తుంది.

వ్యాధులకు దూరంగా: మొక్కకు ఫంగస్‌ పట్టినప్పుడు... లీటరు నీటిలో రెండు చెంచాల వంటసోడా, చెంచా నిమ్మనూనె లేదా వెజిటెబుల్‌ ఆయిల్‌, రెండు చెంచాల లిక్విడ్‌ సోప్‌ కలపాలి. బాగా షేక్‌ చేసిన ఈ నీటిని స్ప్రే సీసాలో నింపి మొక్కపై చల్లాలి. వంటసోడా క్రిములను రానివ్వదు. తొట్టిలోని మట్టి, మొక్కపై ఫంగస్‌ను చేరనివ్వదు. ఆకులకు బూజు, నల్ల మచ్చలు వంటివి రాకుండా కాపాడుతుంది.  రెండు రోజులకొకసారి మాత్రమే గులాబీ మొక్కకు నీటిని అందిస్తే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్