ఇల్లు మారుతుంటే..

సుకన్య కొత్తింటికి మారిన తర్వాత ఏ వస్తువులెక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి గంటలు పడుతోంది. అంతా అయోమయంగా ఉంది. ఇల్లు మారేటప్పుడు ప్రణాళికగా ప్యాక్‌ చేసుకోకపోతే ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతాయంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు.

Published : 21 Nov 2022 00:21 IST

సుకన్య కొత్తింటికి మారిన తర్వాత ఏ వస్తువులెక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి గంటలు పడుతోంది. అంతా అయోమయంగా ఉంది. ఇల్లు మారేటప్పుడు ప్రణాళికగా ప్యాక్‌ చేసుకోకపోతే ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతాయంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు.

కొత్త ఇంటికి, అలమరలకు తాళాలు సరిగ్గా ఉన్నాయా ముందుగానే సరి చూసుకోవాలి. కుళాయిల సమస్యలున్నాయేమో చూడాలి. వంటగదిలో అలమరలు సరిపోతాయా.. లేదా అదనంగా ఏర్పాటు చేయాలా పరిశీలించుకోవాలి. సామాన్లు సర్దాక ఇవన్నీ వీలు కావు. మిక్సీ, గ్రైండర్‌, ఫ్రిజ్‌ వంటి ప్లగ్‌ పాయింట్స్‌ చూడాలి. ఫ్యాన్లు, ఏసీ, గీజర్‌ పాయింట్స్‌ పని చేస్తున్నాయా లేదా చెక్‌ చేయాలి. గాలి, వెలుతురు వచ్చే చోట ఏయే సామాన్లను సర్దాలో ఆలోచించుకుంటే మంచిది.

ప్యాకింగ్‌లో.. ముందుగా ఇంటి సామాన్ల చెెక్‌లిస్ట్‌ తయారుచేసి నెంబర్లు వేయాలి. ఆ సంఖ్యలను అదే సామాన్లను ఉంచిన అట్టపెట్టెలపై రాస్తే తర్వాత తేలికగా గుర్తుపట్టొచ్చు. ఇల్లంతా ఒకేసారి ప్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తే అయోమయం అవుతుంది. ఒక్కో గదివి ఒక్కో సారి ప్యాక్‌ చేస్తే, వాటిని కొత్తింటిలో తేలికగా సర్దుకోవచ్చు. ముందుగా అట్టపెట్టెలు, తాళ్లు, కత్తెర, స్కెచ్‌పెన్‌ సిద్ధం చేసుకోవాలి. వంట సామాన్లను చివర్లో ప్యాక్‌ చేయాలి. డ్రాయింగ్‌రూం, పడక గది సామాన్లను ముందు సర్దాలి. దుస్తులకు 2,3 రోజులు కేటాయించుకోవాలి. పిల్లల సామాన్ల అట్ట పెట్టెలపై వారి పేర్లు, దుస్తుల వివరాలు స్కెచ్‌తో రాయాలి. అలాగే పెద్ద వాళ్లవి కూడా. పుస్తకాలు, ఫ్యాన్సీ సామాన్లు, బొమ్మలు, అలంకరణ వస్తువులు సహా కంప్యూటర్‌, ల్యాప్‌ టాప్‌ వంటివన్నీ ఛార్జర్స్‌తో కలిపి ప్యాక్‌ చేస్తేనే వెతుక్కోనక్కర్లేదు. గాజు, పింగాణి సామాన్లను పాత దుస్తుల మధ్య సర్దితే పగలకుండా ఉంటాయి.

విడివిడిగా... పప్పులు, ఉప్పులు, కారం, పచ్చళ్లు వంటివన్నీ విడిగా ఒక పెట్టెలో ఉంచి వివరాలను పైన రాయాలి. పాత్రలన్నీ పెద్ద అట్టపెట్టెలో సర్దాలి. స్నానాల గదివి విడిగా ఉంచాలి. మొక్కలను తరలించేటప్పుడు జాగ్రత్తపడాలి. వాడని దుస్తులు, సామాన్లనూ తీసుకెళ్లి కొత్తింటిని కూడా నింపేయకుండా ఏ అనాథాశ్రమాలకో ఇచ్చెయ్యండి. దుస్తుల బీరువా, వంటింటి సామాన్ల అలమర్లలో వాటర్‌ప్రూఫ్‌ షీట్స్‌ వేసి, తర్వాత సర్దితే ఎక్కువకాలం దుమ్ము పట్టకుండా ఉంటాయి. ఇల్లు మారాక ఒకేరోజు అన్నింటినీ సర్దేయాలని అనుకోకుండా అవసరార్థం ఒక్కొక్క అట్టపెట్టెను తెరిస్తే చాలు. ఆందోళన, ఒత్తిడి ఉండవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్