వస్తువులు దొరకడం లేదా?

ఉదయాన్నే పని హడావుడిలో ఉంటాం. సాధారణంగానే ఏదెక్కడ పెట్టామో త్వరగా గుర్తుకురాదు.

Updated : 15 Dec 2022 02:53 IST

ఉదయాన్నే పని హడావుడిలో ఉంటాం. సాధారణంగానే ఏదెక్కడ పెట్టామో త్వరగా గుర్తుకురాదు. దీనికితోడు ఆయనా, పిల్లలూ... తాళాలు, పుస్తకాలు ఎక్కడో పెట్టుకొని కనిపించడం లేదంటూ గోల! ఈ తిప్పలు తప్పాలా.. ఈ చిట్కాలు పాటించేయండి.

* ఎక్కువగా ఎక్కడో పెట్టి వెతికేది ఏది? దీన్ని ఆలోచించండి. వాటిని ఎక్కడ పెడుతున్నా ఒకచోట నోట్‌ చేయడం తప్పని సరి చేసుకోండి. కొద్దిరోజులకు ఒకేచోట పెట్టడం అలవాటుగా మారుతుంది. ఇక మరచిపోలేరు. తాళాలు, చెవిదిద్దులు, కళ్లజోడు దేనికైనా ఇదే సూత్రం.

* ఆఫీసు నుంచి రాగానే పర్సు అలా పడేస్తారు. పిల్లలూ బ్యాగులు విసిరేయడం, హోంవర్క్‌ చేశాక పుస్తకాలు వగైరా సరిగా సర్దుకోకపోవడమే ప్రధాన సమస్య. తీరా ఉదయాన్నే మనల్ని హడావుడి పెట్టేస్తారు. వస్తువులకు ఫలానా చోటని కేటాయించండి. వాటిని అక్కడే ఉంచాలని చెప్పేయండి. పుస్తకాలూ సర్దుకున్నాకే లేవాలన్న నిబంధన పెడితే సరి. కొన్నాళ్లు పర్యవేక్షిస్తే క్రమంగా వాళ్లే అనుసరిస్తారు.

* ఇల్లు గజిబిజిగా ఉన్నా ఇదే సమస్య! ఇల్లంతా చిందరవందరగా ఉందనుకోండి. మనసూ చిరాగ్గా ఉంటుంది. దీంతో కళ్లముందే ఉన్నా కొన్నిసార్లు కనపడవు. పని పేరుకు పోనివ్వకండి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే పనీ సులువవుతుంది. మనసుకీ ప్రశాంతంగా ఉంటుంది. తీసిన వస్తువుని అవసరం తీరాక అదే స్థానంలో ఉంచుతుంటే పోగుపడే సమస్యా ఉండదు.

* గుర్తుకు రాకపోవడానికి మతిమరపే కారణమనిపిస్తే.. వస్తువును ఒకచోట పెట్టాక కళ్లు మూసుకొని అక్కడ పెడుతున్నట్లుగా ఊహించుకోండి. రోజులో రెండు మూడుసార్లు అలాచేస్తే గుర్తుండిపోతుందట. దీన్ని విజువలైజేషన్‌ థెరపీ అంటారట. ముఖ్యమైనవి, తరచూ అవసరమైన వాటి విషయంలో ఇలా ప్రయత్నిస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్