ఇంట్లో మొక్కలు నేవళంగా...

ఇంటి ముంగిట లేదా బాల్కనీలో మొక్కల్ని పెంచుతున్నారా?! కనువిందు చేసే నాజూకైన చెట్లకు తెగులు సోకితే ఏం చేయాలో పాలుపోక చిరాకేస్తోందా?

Updated : 21 Dec 2022 04:45 IST

ఇంటి ముంగిట లేదా బాల్కనీలో మొక్కల్ని పెంచుతున్నారా?! కనువిందు చేసే నాజూకైన చెట్లకు తెగులు సోకితే ఏం చేయాలో పాలుపోక చిరాకేస్తోందా? బంధుమిత్రులు ఇచ్చిన గమేక్సన్‌ జల్లడం లాంటి సలహాలను పాటించి అసహనానికి గురయ్యారా? నిజమే.. అలాంటివి ఆ క్షణానికి సమస్యను పరిష్కరించినట్లు అనిపించినా అంతకంటే ఎక్కువ చేటు చేస్తాయి. మరేం చేయాలంటే... వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు పాటించండి. చీడ పీడలు మాయమవడమే కాదు మరింత నేవళంగా పెరుగుతాయి.

* ఆకులూ లేదా పూలకు చీడ పడితే గోరువెచ్చటి నీళ్లలో కాస్త వేపనూనె, కొద్దిగా లిక్విడ్‌ సోప్‌ వేసి బాగా గిలకొట్టి మొక్కల మీద సున్నితంగా పిచికారీ చేయండి. రెండు మూడు రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

* వేపగింజలను సేకరించి నీడపట్టున ఎండ బెట్టండి. వాటిని పొడిచేసి రాత్రిపూట నానబెట్టి, మర్నాడు ఆ నీటిని వడకట్టండి. అందులో సబ్బుపొడి లేదా లిక్విడ్‌ సోప్‌ వేసి సాయంత్రం పూట పిచికారీ చేస్తే చీడ నశిస్తుంది.

* మొక్కల మొదళ్లలో అప్పుడప్పుడూ ఉప్పునీళ్లను స్ప్రే చేస్తుంటే తెగులు సోకవు. అంతే కాదు, వాటికి అవసరమైన మెగ్నీషియం, భాస్వరం, సల్ఫర్‌ లాంటి పోషకాలూ అందుతాయి.

* ఉల్లి, వెల్లుల్లి ముద్ద, మిరియాలపొడి, కాస్త లిక్విడ్‌ సోపు నీళ్లలో కలిపి చెట్ల మీద జల్లితే పురుగు పట్టదు.

* చేమంతుల్లో వందల రకాలుంటాయి కదూ! వాటిలో ఉండే పైరెత్రమ్‌ అనే రసాయనానికి కీటకాల నరాల వ్యవస్థను దెబ్బతీసే గుణం ఉంది. కనుక ఎండిన చేమంతులను 20 నిమిషాలు నీళ్లలో మరిగించి, చల్లార్చి స్ప్రే చేస్తే సరి.. పురుగూపుట్రా ఇట్టే హరిస్తాయి. దీనికి కాస్తంత వేపనూనె జతచేస్తే మరింత వేగంగా సమస్య పరిష్కారం అవుతుంది.

* వంటనూనెలో లిక్విడ్‌ సోపు కలిపి మొక్కల మీద పిచికారీ చేసినా ఫలితం ఉంటుంది. మిరప కారం నీళ్లలో కలిపి మొక్కల మీద స్ప్రే చేసి పురుగు సమస్యను నివారించవచ్చు. ఇతరత్రా ఏవీ అందుబాటులో లేకుంటే సబ్బు నీళ్లను జల్లినా ప్రయోజనం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్