పాతవి వృథా కాకుండా..

పండగలు, శుభకార్యాలంటూ ప్రత్యేక సందర్భాలన్నింటికీ చీరలు కొంటాం. అందరిలో తళుకులీనాలనుకుంటాం. అయితే ఈ చీరల్లో కొన్ని ఒక్క సారి మాత్రమే ధరించి ఉంటాం.

Published : 12 Jan 2023 00:48 IST

పండగలు, శుభకార్యాలంటూ ప్రత్యేక సందర్భాలన్నింటికీ చీరలు కొంటాం. అందరిలో తళుకులీనాలనుకుంటాం. అయితే ఈ చీరల్లో కొన్ని ఒక్క సారి మాత్రమే ధరించి ఉంటాం. వాటిపై గతంలో కుట్టించిన మ్యాచింగ్‌ బ్లవుజులు ప్రస్తుతానికి పాత ఫ్యాషన్‌ కావడం లేదా కొలతలు మారడంతో మొత్తానికి ఆ చీరలు వార్డ్‌రోబ్‌లో అడుగున చేరతాయి. నేటి ఫ్యాషన్‌కు తగినట్లుగా బ్లవుజు సిద్ధంచేసి, మూలపడిన చీరలకు కొత్త లుక్‌ తేవడమెలాగో నిపుణులు సూచిస్తున్నారు.

డై చేసి.. ఎంతో ఖరీదుతో కొన్నది లేదా అమ్మ ప్రేమగా ఇచ్చిన చీరలను చూసినప్పుడల్లా మనసుకు కష్టమనిపిస్తుంది. అయితే జోడీగా సరైన బ్లవుజు లేకపోవడంతో ధరించడానికి మనసు రాదు. ఇటువంటప్పుడు ఆ చీరలకు ట్రెండీగా బ్లవుజు తీసుకుంటే, చీరకూ కొత్తదనం వచ్చినట్లు ఉంటుంది. నేటి ఫ్యాషన్‌కు తగ్గట్లుగానూ మారుతుంది. దాంతో పాత చీరలనూ కొత్తగా కట్టేయొచ్చు. పాత పట్టుచీరకు మ్యాచింగ్‌గా అదే తరహాలో బ్లవుజుకు వస్త్రం లభ్యం కావడంలేదంటూ ఆ చీరను మూల ఉంచనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాచింగ్‌, షేడ్స్‌ చెబితే వస్త్ర దుకాణాల్లో నచ్చిన ఫ్యాబ్రిక్‌లో డై చేసి మరీ అందిస్తున్నారు. పట్టు మాత్రమే కాకుండా కాటన్‌, హ్యాండ్‌లూమ్‌ తరహా వస్త్రాలకు కూడా అవసరమైన షేడ్స్‌ డై చేసి ఇస్తున్నారు. దీంతో తగిన బ్లవుజును కోరిన మోడల్‌లో కుట్టించి నచ్చిన చీరను కట్టి మురిసిపోవచ్చు.

ఒకేసారి.. ఎప్పుడో కొన్న చీరకు ఎక్కువ ఖరీదుపెట్టి ఇప్పుడు తిరిగి బ్లవుజు కుట్టించడం అవసరమా అనుకోకూడదు. ఒకసారికి కొత్త చీర కొనుక్కోకుండా.. మూల ఉన్న నాలుగైదు చీరలను ఎంపిక చేసుకొని అన్నింటిపై మ్యాచ్‌ అయ్యేలా షేడ్స్‌ లేదా వర్క్‌ చేయించుకునేలా రెండు.. మూడు బ్లవుజులను తీసుకోవడం మంచిది. ఇలా కొత్తచీరకు ఖర్చు పెట్టే నగదును.. ఒకేసారి బ్లవుజులకు ఉపయోగిస్తే.. పాత చీరలకూ కొత్త కళ తెచ్చినట్లు అవుతుంది. అందరిలో ఆకర్షణగానూ నిలవొచ్చు. అలాగే ఒక చీరకు రెండు బ్లవుజులు మ్యాచ్‌ అయ్యేట్లు ఉంటే సందర్భాన్ని బట్టి ధరించి మరీ.. మెరిసిపోవచ్చు.

కొంగొత్తగా.. లేతవర్ణం చీరకు కాంట్రాస్ట్‌గా ముదురువర్ణంలో ఎంచుకొనే బ్లవుజుపై ఆ చీరంతా పరుచుకున్న బుటా డిజైన్‌ ఉండేలా వెతకాలి. ఆ బ్లవుజును అదే వర్ణంలో ఉండే మరో చీరపైనా ధరించొచ్చు. అలాగే రెండు పట్టు చీరలను తీసుకొని ఒకదాని బోర్డరుకు, రెండో దానిపై ఉండే డిజైన్‌కు మ్యాచింగ్‌ వర్ణంలో పట్టులో బ్లవుజు ఎంపిక రెండింటికీ ఉపయోగ పడుతుంది. ఇలా ఒకేసారి తీసుకొనే బ్లవుజులన్నీ ఒకే మోడల్‌లో కాకుండా రకరకాలుగా ఎంచుకుంటే మరింత కొత్తగా కనిపించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్