కీటకాలకు దూరంగా...

పెరట్లో ఎంతో ఆసక్తిగా పెంచుకొన్న . టొమాటో, వంకాయ మొక్కలకు పూత మొదలైతే చాలు. కాయలెప్పుడు కాస్తాయో అని ఆశగా ఎదురుచూస్తాం. అదే సమయానికి పురుగుపట్టిందంటే చాలు. మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. రసాయనాలతో కాకుండా, ఇంట్లోని సేంద్రియ పదార్థాలతోనే ఈ కీటకాలను పోగొట్టొచ్చు.

Published : 12 May 2023 00:33 IST

పెరట్లో ఎంతో ఆసక్తిగా పెంచుకొన్న . టొమాటో, వంకాయ మొక్కలకు పూత మొదలైతే చాలు. కాయలెప్పుడు కాస్తాయో అని ఆశగా ఎదురుచూస్తాం. అదే సమయానికి పురుగుపట్టిందంటే చాలు. మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. రసాయనాలతో కాకుండా, ఇంట్లోని సేంద్రియ పదార్థాలతోనే ఈ కీటకాలను పోగొట్టొచ్చు. సహజపద్ధతిలో పోషకాలను అందించి కాయలెక్కువగా కాసేలానూ చేయొచ్చు.

టొమాటో ఆకులకు కింది భాగాన ఎక్కువగా తామర పురుగు పడుతుంది. దీన్ని వెంటనే దూరం చేయకపోతే మొక్క మొత్తం చీడ పట్టినట్లు మారుతుంది. ముందుగా టొమాటో ఆకులను కొన్నింటిని తీసుకొని రెండు కప్పులొచ్చేలా చిన్నముక్కలుగా తరగాలి. వీటిని రెండు కప్పుల నీటిలో రాత్రంతా నానబెట్టి, వడకట్టి, కప్పు నీటిని కలిపి స్ప్రే సీసాలో నింపాలి. దీన్ని పురుగున్న చోటంతా స్ప్రే చేస్తే చాలు. టొమాటో ఆకుల్లో పుష్కలంగా ఉండే ఆల్కలాయిడ్స్‌ ఈ కీటకాన్ని నశింపజేస్తాయి. అలాగే నాలుగు వెల్లుల్లి రేకలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి గరుకుగా ఉండేలా చితక్కొట్టాలి. వీటికి ఒక టేబుల్‌స్పూన్‌ మినరల్‌ ఆయిల్‌ కలిపి రోజంతా నాననిచ్చి వడకట్టాలి. ఈ మిశ్రమానికి గ్లాసు నీరు, పావు చెంచా డిష్‌సోప్‌ లిక్విడ్‌ కలపాలి. దీన్ని స్ప్రేసీసాలో నింపి పురుగున్న చోట స్ప్రే చేయాలి. ఈ మిశ్రమంలోని సల్ఫర్‌ పురుగును దూరం చేస్తుంది.

పోషకాలను..

టొమాటో, వంకాయ మొక్క ఆకులు పసుపుగా కావడం లేదా వడలినట్లు చుట్టుకుపోవడం జరుగుతుంటుంది. పోషకాలు అందనప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. రెండు కప్పుల క్యారెట్‌ ముక్కలు లేదా అరటిపండు తొక్కలను లీటన్నర నీళ్లలో 24 గంటలు నాననిచ్చి వడకట్టాలి. ఇలా ఈ నీటిని రెండు వారాలకొకసారి మొక్కలకు అందించాలి. దీంతో ఐరన్‌, నైట్రోజన్‌, పొటాషియం సహా విటమిన్లు, ప్రొటీన్లు మొక్కలకు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి. వంటింటి వ్యర్థాలతో తయారైన సేంద్రియ ఎరువు కూడా  మంచి ఫలితాన్నిస్తుంది. అలాగే రెండు కప్పుల కాఫీ పొడిని కలిపిన నీటిని మొక్కలకు చెంచా చొప్పున పోయడం మంచిది. ఎరువులా పనిచేసి పిందెలు ఆరోగ్యంగా వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్