గులాబీ గుత్తులుగా విరబూసేలా...

వర్షాలు పడుతున్నాయి. మొక్కలన్నీ పూలతో కళకళలాడితే తోటంతా కొత్త అందాన్ని సంతరించుకొని చూడముచ్చటగా ఉంటుంది.

Published : 06 Jul 2023 00:27 IST

వర్షాలు పడుతున్నాయి. మొక్కలన్నీ పూలతో కళకళలాడితే తోటంతా కొత్త అందాన్ని సంతరించుకొని చూడముచ్చటగా ఉంటుంది. పూలన్నింటిలో రాణిగా మెరిసే గులాబీ విరబూస్తే మనసులో ఒత్తిడీ మటుమాయమవుతుంది. ఇందుకోసమే నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

గులాబీకి సీజన్‌ అంటూ ఉండదు. కానీ, వర్షాలు పడినప్పుడు అవి మరింత చిగురించి ఎక్కువ పూస్తాయి. కొమ్మకొమ్మకీ మొగ్గలు తొడగాలంటే ముందు మొక్క ఆరోగ్యంగా ఉందో లేదో చూడాలి. ఇందుకోసం ముందుగా ఆ కుండీలో కలుపు లేకుండా తీసేయాలి.  కూరగాయల వ్యర్థాలు నానబెట్టిన నీటిని మొక్కలకు ఎరువుగా పోస్తుంటాం. వాటిల్లోని పచ్చిమిర్చి, టొమాటో వంటి విత్తనాలు చిన్నచిన్న మొక్కలుగా వచ్చేస్తుంటాయి. వీటిని మరో కుండీలోకి మార్చేయండి.
ప్రూనింగ్‌ అవసరం... గులాబీ మొక్క కొత్తగా చిగురించాలంటే...దాన్ని ఎప్పటికప్పుడు ప్రూనింగ్‌ చేయాలి. ముఖ్యంగా ఎండిన కొమ్మలు, ఆకులు, వడలిన పూలు వంటి వాటిని ఎప్పటికప్పుడు తీసేయాలి. అలాగని చేతితో విరిచేయకూడదు. కత్తెరతో వారానికోసారి కత్తిరించాలి. ఇయర్‌బడ్‌ చివర్లను పసుపులో ముంచి దాన్ని, గులాబీ మొక్కను కత్తిరించిన చోటల్లా అద్దాలి. దీంతో ఆ కొమ్మ వడలిపోదు. చిగురించడం మొదలవుతుంది.  

తేమ అందించండి... ముదిరిన కొమ్మకు చుట్టుపక్కల చిగుర్లులా వచ్చేవాటిని, పెరిగిన చిన్నచిన్న కొమ్మలను కత్తిరించడం మంచిది. అప్పుడే ప్రధాన కొమ్మకు పోషకాలు అంది మొగ్గలెక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రోజూ నీటిని అందించాలి. అలాగని తొట్టెలో మట్టి నానిపోయేలా కాకుండా స్ప్రే చేయాలి.
క్రమ పద్ధతిలో ఎరువు... ముందుగా మట్టిని వదులు చేయాలి. అలాగే మొక్క మొదళ్లలో కాకుండా కాస్తంత దూరంగా తొట్టె అంచుల్లో సీవీడ్‌ ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్‌ను వేయాలి. చిన్న గింజల్లా ఉండే ఎరువుని నెలకొకసారి 10 నుంచి 15 గింజలు చల్లితే సరిపోతుంది. ఎన్‌పీకే 20:20:20 నిష్పత్తిలో ద్రవరూప ఎరువునీ వాడుకోవచ్చు. అలానే వాడేసిన టీ పొడిని కడిగి ఆరబెట్టి ఎరువుగా ఉపయోగించుకుంటే ఎక్కువ మొగ్గలు వస్తాయి. అది మంచి ఎరువు అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్