పాలవెల్లి.. ప్రత్యేకంగా..

వినాయక చతుర్థినాడు ఆ గౌరీ పుత్రుడికి ఇష్టమైన పాలవెల్లిని ఇంట్లోనే తయారుచేసి పూలు, పండ్లతో ఎలా అలంకరించొచ్చు అనేది చూద్దాం. వెదురుతో.. సన్నగా ఒకే పొడవున్న ఎనిమిది వెదురు ముక్కలను తీసుకోవాలి.

Published : 18 Sep 2023 02:07 IST

వినాయక చతుర్థినాడు ఆ గౌరీ పుత్రుడికి ఇష్టమైన పాలవెల్లిని ఇంట్లోనే తయారుచేసి పూలు, పండ్లతో ఎలా అలంకరించొచ్చు అనేది చూద్దాం.

వెదురుతో.. సన్నగా ఒకే పొడవున్న ఎనిమిది వెదురు ముక్కలను తీసుకోవాలి. ముందుగా నాలుగింటిని కలిపి చతురస్రాకారం వచ్చేలా వాటి చివరల్లో చిన్నచిన్న మేకులు కొట్టాలి. మధ్యలో రెండు అడ్డుగా, మరో రెండు నిలువుగా సర్ది మేకులు కొడితే చాలు. పాలవెల్లి సిద్ధమవుతుంది.

కాగితంతో.. ఒకే పరిమాణం ఉన్న కాగితాన్ని తీసుకొని పొడవుగా గొట్టం ఆకారం వచ్చేలా చుడుతూ.. చివర్లో జిగురు అంటిస్తే గొట్టం ఆకారం కదలకుండా ఉంటుంది. ఇలా ఎనిమిదింటిని కాగితంతో గొట్టాల ఆకారంలో తయారుచేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత వీటికి పసుపు పెయింట్‌ వేసి ఆరనిచ్చి, అక్కడక్కడా ఎరుపు రంగు పెయింట్‌తో బొట్లుగా తీర్చిదిద్దాలి. ఈ పెయింట్‌ ఆరిన తర్వాత నాలుగింటిని చతురస్రాకారంలో చట్రంలా ఉంచి సన్నని తాడుతో ముడి వేయాలి. దీని మధ్యలో నిలువుగా, అడ్డంగా మిగిలిన గొట్టాలను ఉంచి తాళ్లతో ముడివేస్తే చాలు. కాగితపు పాలవెల్లి సిద్ధమైనట్లే. దీనికి నాలుగు వైపులా వైరును కట్టి నాలుగు కొసలు ఒకేచోటికి వచ్చేలా కలిపి వేలాడదీస్తే అలంకరణకు సిద్ధమైనట్లే.

మండపం.. ఇంట్లో ఉండే వస్తువులతోనే మండపం చేయొచ్చు. సన్నని ఎలక్ట్రికల్‌ పైపులను నాలుగింటిని తీసుకోవాలి. క్యాండిల్‌తో సన్నని ఇనుప ఊసను వేడిచేసి పైపులకు ఒకవైపున రెండు చొప్పున రంధ్రాలు చేయాలి. పైపులన్నింటికీ లేసు చుడితే అందంగా ఉంటాయి. నాలుగు పొడవైన ప్లాస్టిక్‌ డబ్బాలను తీసుకొని తడిపిన మట్టితో నింపాలి. ఒక్కో దాంట్లో ఒక్కో పైపును రంధ్రాలు పైకి వచ్చేలా సర్దాలి. నాలుగు పైపులను పాలవెల్లి వెడల్పుకు సరిపోయేటంత దగ్గరగా అమర్చి, రంధ్రాల ఆధారంగా సన్నని వైరుతో పాలవెల్లిని కలిపి కడితే చాలు. ఇలా సిద్ధమైన మండపంలో రంగవల్లులు తీర్చిదిద్దిన పీట వేస్తే స్వామివారికి పూజావేదిక సిద్ధమవుతుంది.

పాలవెల్లి అలంకరణ..

నచ్చిన పూలను వరుసల్లో కట్టి వేలాడదీయొచ్చు. జామ, బత్తాయి, మొక్కజొన్న, యాపిల్‌.. ఒక్కోటి చొప్పున కట్టొచ్చు. మామిడి కొమ్మలను పాలవెల్లికి నాలుగువైపులా కట్టినా చూడముచ్చటగా ఉంటాయి. ఈ మండపంలో వినాయక విగ్రహాన్ని ఉంచి వ్రతాన్ని సంతోషంగా ప్రారంభించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్