అమ్మ దిద్దిన... వినాయకుడు!

మనుషులంతా అమ్మ చేసిన బొమ్మలే! మనల్ని ప్రతి దశలోనూ తల్లే తీర్చిదిద్దుతుంది. ఆ క్రమంలో మనలోని అనేక లోపాలూ దూరమవుతాయి. దీనికి ఉదాహరణ వినాయక వృత్తాంతం. ఒక తల్లి తన బిడ్డను ఎంత శక్తిమంతంగా తీర్చిదిద్దగలదో చెప్పే కథ ఇది.

Updated : 18 Sep 2023 06:55 IST

నేడు వినాయక చవితి

మనుషులంతా అమ్మ చేసిన బొమ్మలే! మనల్ని ప్రతి దశలోనూ తల్లే తీర్చిదిద్దుతుంది. ఆ క్రమంలో మనలోని అనేక లోపాలూ దూరమవుతాయి. దీనికి ఉదాహరణ వినాయక వృత్తాంతం. ఒక తల్లి తన బిడ్డను ఎంత శక్తిమంతంగా తీర్చిదిద్దగలదో చెప్పే కథ ఇది..

వినాయకుడు బాల్యంలో.. తన మిత్రులతో ఆడుకుంటున్నాడు. వాళ్ల ఆటలకు అడ్డు తగిలిన పిల్లిని గణేశుడు చేత్తో దూరంగా నెట్టేశాడు. దాంతో దాని ముఖానికి చిన్న గాయమైంది. అది గమనించని బాల గణపయ్య ఆటల్లో మునిగిపోయి, సాయంత్రానికి కైలాసానికి వెళ్లాడు. ఆకలితో అమ్మ పార్వతీదేవి వద్దకు చేరుకునే సరికి ఆమె ముఖంపై ఎవరో గోళ్లతో రక్కినట్లు గీతలున్నాయి. బాధతో ‘అమ్మా! నీ ముఖంపై ఆ గాయాలేంటి?’ అని అమాయకంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ పరమేశ్వరి ‘నాయనా! ఉదయం నువ్వు పిల్లిని గాయపరిచావు కదా! ఆ చిహ్నాలే నా ముఖంపై పడ్డాయి. అన్ని జీవుల్లో ఉన్నది నేనే. ఎవరిని బాధించినా నన్ను బాధించినట్లే! ఎవరిని సంతోషపరిచినా నన్ను సంతోషపరిచట్లే’ అని చెప్పింది. తల్లి మాటలు గణాధిపుడి మనసులో ప్రగాఢంగా ముద్రపడిపోయాయి. అప్పటి నుంచి ఆ మూషికవాహనుడు అందరిలోనూ అమ్మనే దర్శించుకుంటూ, ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకపోయేవాడు. అలా పార్వతీదేవి కొడుకు రూపాన్నే కాదు, సుగుణాల్ని కూడా తీర్చిదిద్దింది. పిల్లల వ్యక్తిత్వంపై మాతృమూర్తి ప్రభావమే మహోన్నతమని ఆ మహేశ్వరి నిరూపించింది. ఈ కథను తమ శిష్యులకు వివరిస్తూ రామకృష్ణ పరమహంస పార్వతీదేవిని కొనియాడారు. పరమశివుని కన్నా పార్వతీమాత నుంచే ఎక్కువ సద్గుణాలను వినాయకుడు పుణికి పుచ్చుకున్నాడని వివరించారు.

రూపాన్ని వెక్కిరిస్తే..

లంబోదరుడి వింతరూపాన్ని చూసి చంద్రుడు వికటాట్టహాసం చేశాడు. ఇతరుల రూపాన్ని చూసి అవమానపరిచే వారు ఎంత కుసంస్కారులో లోకానికి తెలియ చెప్పాలనుకుంది దాక్షాయణి. అందుకే ‘నీ ముఖం చూసినవాళ్లు నీలాపనిందల పాలవుతారు’ అని శపించింది. ఆమె పెట్టిన ఆ శాపానికి ఆ కాంతిమంతుడు కళావిహీనుడైపోయాడు. ఈ సంఘటనతో గజాననుడు కూడా తల్లి నుంచి జీవనపాఠాన్ని నేర్చుకున్నాడు. బాహ్యరూపాన్ని చూసి అంచనా వేయకూడదని అర్థం చేసుకున్నాడు. ఆకారాల్ని, అందచందాల్ని కాదు గుణగణాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలుసుకున్నాడు. పక్కవారిని పరిహసిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చిన్న వయసులోనే తల్లి చంద్రుడికి పెట్టిన శాపంతో గుర్తించాడు. ఆ తరువాత చంద్రుడు ప్రాధేయపడగానే అమ్మవారు తన సహజమైన ప్రేమ స్వభావంతో కరిగిపోయింది. శాపాన్ని ఒక్కరోజుకే పరిమితం చేసింది. అప్పటి నుంచి ‘చవితి చంద్రుణ్ని’ చూడకూడదనే ఆంక్ష ఆరంభమైంది. నీలాపనిందలన్నీ ఒక్క రోజుకేనని తన శాపానికి విరుగుడును తనే నిర్ణయించింది. ఎంత కోపమైనా దీర్ఘకాలం కొనసాగించకూడదని, క్షణంలోనే మరచిపోవాలని, ఎంతటి శత్రువైనా శరణని ఆశ్రయిస్తే వారి తప్పుల్ని మనసులో పెట్టుకోకుండా మన్నించాలని ఆ లోకపావని ఆచరణలో చూపింది.

ఈ క్షమాగుణాన్ని కూడా వినాయకుడు తల్లి నుంచే అలవరచుకున్నాడు. అందుకే వినాయకుడు ప్రత్యర్థులైన రాక్షసులెవ్వరిపైనా దీర్ఘకాల వైరాన్ని కొనసాగించలేదు. అప్పటికి వారిని శిక్షించి ఆ తరువాత అన్నింటినీ మరచిపోయేవాడు. మృదుస్వభావుడై మసలుకునేవాడు. అందుకే దేవతలందరికీ ఆయన ప్రియతముడయ్యాడు.


ప్రసన్నతా పార్వతీదేవి నుంచే...

లోక సంక్షేమం కోసం కాలకూట విషాన్ని స్వీకరించేందుకు శంకరుడు అంగీకరించాడు. ఆ విషయం చెప్పగానే ఆ లోకపావని అడ్డుచెప్పకుండా, తన మాంగల్యాన్నే నమ్ముకొని ప్రసన్నంగా అంగీకరించింది. ఆ ప్రసన్నతే పార్వతీనందనుడికీ సంప్రాప్తించింది. ఎలాంటి ఉద్రిక్త, ఉద్విగ్న పరిస్థితుల్లోనైనా నిలకడగా ఉండటం విఘ్ననాయకుడి విశేష గుణం. అందుకే గణేశుడిని ‘ప్రసన్న వదనం ధ్యాయేత్‌’ అని పూజించటం ఆనవాయతీ. ఇలా అభయహస్తునిగా, వరదునిగా, సిద్ధిబుద్ధి ప్రదాతగా మలచటంలో ఆ తల్లిది విశేషమైన పాత్ర. అందుకే ఆయనను జానపదులు ‘అమ్మ చేతి పసుపుబొమ్మ, అందరికీ దైవమమ్మా’ అని పాడుకుంటూ పరవశిస్తారు. ఓ సంప్రదాయంలో వినాయకుడిని ‘ద్వైమాతరుడు’ అనీ స్తుతిస్తారు. పార్వతీదేవి, గంగామాతల సంరక్షణలో ఎదిగాడని ఆ పేరు.


- బి.సైదులు, రామకృష్ణ మఠం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్