కరివేపాకునీ పెంచేద్దాం కుండీలో!

ఎంత గొప్ప కూర వండినా... అందులో కాస్తయినా కరివేపాకు పడనిదే... దానికి రుచీ, ఘుమఘుమల గుభాళింపూ రాదు. అయితే, అంతకు మించి అందులో పోషకాల మోతాదూ, ఔషధ గుణాలు కూడా ఎక్కువే.

Published : 15 Feb 2024 01:26 IST

ఎంత గొప్ప కూర వండినా... అందులో కాస్తయినా కరివేపాకు పడనిదే... దానికి రుచీ, ఘుమఘుమల గుభాళింపూ రాదు. అయితే, అంతకు మించి అందులో పోషకాల మోతాదూ, ఔషధ గుణాలు కూడా ఎక్కువే. అందుకే, ప్రతి ఇంటా ఓ చిన్న కరివేపాకు మొక్కనైనా పెంచుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ, సంరక్షణ తెలియక సతమతమవుతుంటారు.

రివేపాకు రూటేసీ కుటుంబానికి చెందినది. బెర్గెరా కొయినెగి, మురాయా కొయినెగి అనేవి దీనికి శాస్త్రీయ నామాలు. దీని స్వస్థలం మనదేశమే. ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో తప్ప దేశంలోని అన్ని చోట్లా విరివిగా పెరుగుతుంది. ఈ మొక్కను నీరు నిలవని తేలికపాటి మట్టిలో నాటుకోవాలి. కుండీల్లోనూ, నేలలోనూ కూడా చక్కగా ఎదుగుతుంది. దీన్ని మూడు నాలుగు అడుగుల ఎత్తులోనే కాదు...పెద్ద చెట్టుగానూ పెంచుకోవచ్చు. ఆసియా దేశాల్లో దీన్ని వంటకాల అరోమాను పెంచేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇండియా, శ్రీలంక వంటి దేశాల్లో దీని వాడకం, పెంపకం కాస్త ఎక్కువే. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగానూ ఈ ఆకులకు ఆదరణ పెరిగింది. ఇవి వేప ఆకుల్ని పోలి ఉండటంతో నల్ల(కరి)వేప అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. వీటిల్లో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌, సి, ఎలతో పాటు మరెన్నో విటమిన్లూ, ఖనిజాలూ ఉన్నాయి. ఇవి పోషకాల లోపాన్ని నివారిస్తాయి.

ఎక్కువ నీరు పోస్తే...

కరివేపాకు మొక్కను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సారవంతమైన, నీరు నిలవని మట్టిలో కరివేపాకు మొక్కల్ని నాటుకోవాలి. ఒకవేళ నీరు ఎక్కువైతే బయటకు పోయేందుకు తగిన మురుగు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. రోజూ కనీసం ఏడుగంటలపాటైనా ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇవి 16-37 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అంతకు మించినప్పుడు గ్రీన్‌షేడ్‌ నెట్‌ వేసుకోవాలి. రోజూ నీటిని అందించడం తప్పనిసరి. నీళ్లు ఎక్కువైతే కుళ్లిపోయే ప్రమాదం ఉంది.

కత్తిరించేయండి...

సాధారణంగా ఆకులపై నల్లని మచ్చలు ఏర్పతాయి. వీటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం వల్ల కొత్త చిగురు వస్తుంది. గొంగళి పరుగులు కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. ముడత పురుగు, బూడిద తెగులు...వంటి చీడపీడల సమస్య ఎక్కువ. పురుగు పట్టిన కొమ్మను కత్తిరించి దూరంగా వేయడం వల్ల సమస్య దూరమవడంతో పాటు కొత్త చిగుళ్లు వస్తాయి. లీటరు నీటిలో చెంచా వేప నూనె వేసి మొక్కపై చల్లితే వీటి సమస్య దూరమవుతుంది. లేదంటే షాంపూని నీళ్లల్లో కలిపి స్ప్రే చేసినా మేలే.

ఆవు పేడ చాలు...

ఈ మొక్కలకు రసాయన ఎరువుల్ని వాడరు. మట్టిలో సారం తగ్గిందనిపిస్తే ఎప్సమ్‌ సాల్ట్‌ ద్రావణాన్ని వేళ్లకు అందించండి. లేదంటే ఆవుపేడ, కుళ్లిన ఆకుల ఎరువు, కంపోస్ట్‌ వంటి బలాన్ని అందించి ఆకుల్ని పచ్చగా మారుస్తాయి. వీటికి తెల్లటి పూలు, ఎర్రటి కాయలూ వస్తాయి. వీటిల్లోని విత్తనాలతో కొత్త మొక్కల్ని మొలకెత్తించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్