దొంగతనంగా ఉప్పు తింటుంది..!

మా పాపకి పది సంవత్సరాలు. చిన్నప్పటి నుంచీ ఉప్పు తినే అలవాటు ఉంది. పెరిగేకొద్దీ అది ఎక్కువైంది. ఎంత కంట్రోల్‌ చేసినా దొంగతనంగా ఉప్పు తినేస్తుంది. బరువు కూడా పెరుగుతోంది.

Updated : 15 Feb 2024 15:16 IST

మా పాపకి పది సంవత్సరాలు. చిన్నప్పటి నుంచీ ఉప్పు తినే అలవాటు ఉంది. పెరిగేకొద్దీ అది ఎక్కువైంది. ఎంత కంట్రోల్‌ చేసినా దొంగతనంగా ఉప్పు తినేస్తుంది. బరువు కూడా పెరుగుతోంది. దీనికి కారణం ఉప్పు తినడమేనా..?

ఓ సోదరి

చిన్నప్పటి నుంచి ఉప్పు తింటోంది అంటున్నారు. కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, లేదో మీరు చెప్పలేదు. ఇంకో విషయం ఏమిటంటే ఉప్పు తినడం వల్లే బరువు పెరుగుతుంది అనుకోవడం  అపోహే. ఎందుకంటే కిడ్నీల పనితీరు బాగా ఉన్నంతవరకూ ఉప్పు ఎక్కువ తిన్నా శరీరం కావల్సిన పరిమాణాన్ని మాత్రమే తీసుకుని మిగిలిన దాన్ని బయటకి పంపిస్తుంది. అలా అని మోతాదుకి మించి తీసుకోకూడదు. ప్రతి వ్యక్తి రోజుకి సగటున 5గ్రా. అంటే చెంచా ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ మన ఆహారంలోకి కొత్త కొత్త రుచులు చేరడం వల్ల రోజుకి సుమారు 12 నుంచి 17గ్రా. పైనే తింటున్నాం. దాని పరిణామమే చిన్న వయసులో కిడ్నీ సమస్యలు, రక్తపోటు, ఎముకల సాంద్రత తగ్గడం, రక్తహీనత వంటి సమస్యలు. ఇక పాప విషయంలో జరుగుతున్నది అలవాటు మాత్రమే. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడైనా తనకు పెట్టే ఆహారంలో తన ఎదురుగా ఉప్పు వేయడం చూసి ఉండొచ్చు. ఒక్కోసారి ఇది పెద్దల నుంచీ అలవాటు చేసుకోవచ్చు. అది మొదలు ఉప్పు వేస్తేనే రుచిగా ఉంటుందని భావించి ఎక్కువగా తింటుండవచ్చు. కానీ ఇప్పుడు చెబితే అర్థం చేసుకునే వయసుకి వచ్చేసింది. కాబట్టి భవిష్యత్తులో దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలను వివరించండి అర్థం చేసుకుంటుంది. ఇక, బరువు పెరగడానికి అనేక కారణాలు... అంటే-మోతాదుకి మించి ఆహారం తీసుకుంటుందేమో గమనించండి. అలాగే ఉప్పు ఎక్కువ ఉండే ఆహారపదార్ధాలు అప్పడాలు, పచ్చళ్లు, పొడులు, చిప్స్‌, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచాలి. తను తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలు వంటివి తప్పక ఉండేలా చూసుకోవాలి. రోజూ గ్లాసు పాలు తాగించాలి. ఈ వయసులోనే వారిలో ఎముకలూ, కండరాల్లో పెరుగుదల ఉంటుంది. ఆటలు ఆడించాలి. అప్పటికీ బరువు తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్