అబ్బబ్బా.. ఏమిటీ పురుగులు?

ఉదయాన్నే గిన్నెలు కడుగుతుంటామా... కళ్లకు అడ్డుతగులుతూ వచ్చేస్తాయండీ చిన్న దోమలు. సింకు కింద పురుగులు, పండ్ల చుట్టూ తిరిగే నుసుములు... సైజులోనే చిన్న. ఇవి మనల్ని పెట్టే ఇబ్బంది మామూలుగా ఉండదు కదూ! తెచ్చే అనారోగ్యాలూ ఎక్కువే. వీటి బెడద పోగొట్టుకోండిలా!

Published : 17 Feb 2024 02:12 IST

ఉదయాన్నే గిన్నెలు కడుగుతుంటామా... కళ్లకు అడ్డుతగులుతూ వచ్చేస్తాయండీ చిన్న దోమలు. సింకు కింద పురుగులు, పండ్ల చుట్టూ తిరిగే నుసుములు... సైజులోనే చిన్న. ఇవి మనల్ని పెట్టే ఇబ్బంది మామూలుగా ఉండదు కదూ! తెచ్చే అనారోగ్యాలూ ఎక్కువే. వీటి బెడద పోగొట్టుకోండిలా!

  • పాత్రల తర్వాత సింకునీ శుభ్రం చేస్తుంటాం. క్రిమికీటకాలు చేరకూడదన్న ఉద్దేశమే అయినా నుసుములు మాత్రం ముసురుతూనే ఉంటాయి. సింకునైతే కడుగుతున్నాం కానీ, దాని పైపులో ఆహార పదార్థాలు, నూనె తాలూకూ జిడ్డు పేరుకొని ఉంటాయి. అవి వీటికి ఆవాసంగా మారతాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు సింకును ఖాళీ చేయడం, శుభ్రం చేయడమే కాదు, పైపునీ పట్టించుకోవాలి. సన్నని, పొడవైన బ్రష్‌తో దాన్నీ అడపాదడపా రుద్ది కడగాలి. అప్పుడే సమస్య తగ్గుతుంది.
  • ఏదైనా స్ప్రే కొట్టగానే పురుగులన్నీ మాయం అవుతాయి. రెండు మూడు రోజులకే మళ్లీ వస్తుంటాయి. పురుగులు చనిపోయినా, వాటి తాలూకూ గుడ్లు ఉంటాయిగా. తేమ ఉండే ప్రదేశాలే వీటికి ఆవాసం. కాబట్టి, ఒక మోస్తరు గిన్నెలో నీటిని మరిగించి, రాత్రి పూట సింకు, నీరుపోయే ప్రదేశాల్లో పోస్తూ ఉండండి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తుంటే ఈ పురుగుల బెడద తప్పుతుంది.
  • కప్పు వైట్‌ వెనిగర్‌లో అరకప్పు చొప్పున బేకింగ్‌ సోడా, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని సింకులో పోసి, రాత్రంతా వదిలేయాలి. మరుసటి ఉదయం మరిగే నీటిని పోసి, ఆపై వాడుకున్నా మంచిదే. దుర్వాసనతోపాటు ఈ కీటకాల సమస్యా దూరమవుతుంది.
  • మూత ఉన్న చెత్తబుట్టలకే ప్రాధాన్యం ఇవ్వండి. ఇక పండ్ల విషయానికొస్తే... వాటిపైనా జాలీ తరహా మూతలు వాడితే సరి. లేదంటే... ఒక చిన్న వెడల్పాటి పాత్రలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకొని, దానిలో కొంచెం లిక్విడ్‌ డిష్‌ వాష్‌ కలపాలి. పాత్ర చుట్టూ ఒక ప్లాస్టిక్‌ కవర్‌ని చుట్టి, అక్కడక్కడా టూత్‌పిక్‌తో రంధ్రాలు పెడితే సరి. ఆ వాసనకు ఈ నుసుములు దానిలోకి చేరతాయి. బయటికి రాలేక ద్రావణంలో పడి చనిపోతాయి. సమస్య తీవ్రతను బట్టి వారానికోసారి దీన్ని ప్రయత్నించినా మేలే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్