హృదయం విచ్చుకుంటోంది!

పచ్చని ఆకుల్లో అక్కడక్కడా అందంగా వేలాడే హృదయాకారపు పూల మొక్కను ఇంటి ముంగిట పెంచుకుంటే ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో కదా! అలాంటి మొక్కే ఆసియా బ్లీడింగ్‌ హార్ట్‌.

Updated : 22 Feb 2024 05:02 IST

పచ్చని ఆకుల్లో అక్కడక్కడా అందంగా వేలాడే హృదయాకారపు పూల మొక్కను ఇంటి ముంగిట పెంచుకుంటే ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో కదా! అలాంటి మొక్కే ఆసియా బ్లీడింగ్‌ హార్ట్‌. మరి దీన్ని మన ఇంటి పెరట్లో ఎలా పెంచాలో చూద్దామా!

పాపవేరేసి కుటుంబానికి చెందిన ఈ ఆసియా బ్లీడింగ్‌ హార్ట్‌ శాస్త్రీయ నామం డిసెంత్రా స్పెక్టాబిలిస్‌ సైబీరియా, జపాన్‌, నార్త్‌చైనా, కొరియాల్లో సాధారణంగా కనిపించే మొక్క. ఇది తేమతో కూడిన గడ్డిభూములు, దట్టమైన చిట్టడవుల్లో సులువుగా పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని అలంకరణ మొక్కగా పెంచుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. లేతాకుపచ్చ రంగుల ఆకులతో గుబురుగా కనిపించే దీనికి.... హృదయం వర్షిస్తుందా అన్నట్లుగా విరిసే పూలు ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. వీటి ఆకృతిని బట్టే ఈ మొక్కకు బ్లీడింగ్‌ హార్ట్‌ అన్న పేరొచ్చింది. ‘లేడీ ఇన్‌ ఏ బాత్‌’ అనీ చాలా చోట్ల వ్యవహరిస్తారు. దీన్ని బాల్కనీలు, పోర్టికోల్లో సులువుగా పెంచుకోవచ్చు. అధిక వేడినీ తట్టుకోగలదు. నీడలోనూ చక్కగా ఎదుగుతుంది 

ఒంపులు తిరిగి...

కుండీల్లో ఈ మొక్కను పెంచుకోవాలనుకుంటే అందులో నింపే మట్టిలో వర్మీకంపోస్ట్‌, పశువుల పేడ కలిపి నింపుకోవాలి. ఇసుక నేలల్లో నాటినా తగిన పోషకాలు అందిస్తే చక్కగా కుదురుకుంటుంది. అయితే, వీటిని పెంచేందుకు నీరు నిలవని పొడి మట్టి మేలు. ఒంపులు తిరిగిన కొమ్మలకు ఈ పూలు పూస్తాయి. ఒక్కో కొమ్మకు డజనకుపైగా వస్తాయి. ఇవి ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు, వైన్‌ రెడ్‌, వైలెట్‌ కాంబినేషన్లలో ఎక్కువగా కనిపిస్తాయి.

కాల్షియం కావాలి...

ఈ మొక్కకు ప్రత్యేక పోషకాలనూ ప్రతి పదిహేను రోజులకోసారి క్రమం తప్పకుండా అందించాలి. సూక్ష్మపోషకాలు మెండుగా ఉండే ఎరువుల్ని ద్రవరూపంలో ఇస్తే పూలూ మరింత ఎక్కువగానూ పూస్తాయి. దీనికి కాల్షియం అవసరం ఎక్కువ. ఇందుకోసం కోడిగుడ్డు పెంకులూ, బోన్‌మీల్‌ని వేళ్లకు అందేలా చూడాలి. చీడపీడల బెడద తక్కువే అయినా... పిండి పురుగు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు లీటరు నీటిలో రెండు చెంచాల వేపకషాయాన్ని కలిపి చల్లండి. సమస్య దూరమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్