బుజ్జాయిలకు బుల్లి గ్రంథాలయం...

నిద్రపోవడానికి ముందు చిన్నారులకు అమ్మ ప్రేమగా కథ చెబుతుంది. అలాగే వారికి కథను చదివి వినిపిస్తే.. ఆ పాత్రలలో తమను ఊహించుకుంటారు పిల్లలు. ఆ కథలు వాళ్లలో స్ఫూర్తినీ నింపుతాయి.

Updated : 25 Feb 2024 05:13 IST

నిద్రపోవడానికి ముందు చిన్నారులకు అమ్మ ప్రేమగా కథ చెబుతుంది. అలాగే వారికి కథను చదివి వినిపిస్తే.. ఆ పాత్రలలో తమను ఊహించుకుంటారు పిల్లలు. ఆ కథలు వాళ్లలో స్ఫూర్తినీ నింపుతాయి. అయితే వాళ్లు కాస్త పెద్దయ్యాక కథ వినే అలవాటు నుంచి పుస్తకపఠనం వైపూ మరలించాలి. ఆ అభిరుచిని పెంపొందించడానికి ఇంట్లోనే బుల్లి లైబ్రరీని ఎలా ఏర్పాటు చేయొచ్చో చూద్దాం.  


కుటీరంలా..

తమకంటూ ఓ చోటును ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే చిన్నారులకు పుస్తకాలు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. దీన్ని అందంగా డిజైన్‌ చేసివ్వొచ్చు. గది మూల లేదా కిటికీ వెలుతురు పడేచోట పుస్తకాల స్టాండు, పక్కగా రంగురంగుల వస్త్రాలతో చిన్న కుటీరంలా ఏర్పాటు చేయాలి. సుతిమెత్తని సిట్టింగ్‌తోపాటు చిన్నారుల మనసుకు నచ్చిన పుస్తకాలను అందుబాటులో ఉంచితే చాలు. రీడింగ్‌ ప్లేస్‌ లేదా లైబ్రరీ అని పేరు కూడా పెట్టేయండి. సమయం ఉన్నప్పుడు, బోర్‌ కొట్టినప్పుడు పిల్లలు ఆ చోటునే ఎంచుకొంటారు.  


షెల్ఫ్‌లా..

స్డడీరూంలా కాకుండా విడిగా అలమరలున్న చిన్న షెల్ఫ్‌ ఏర్పాటు కూడా పిల్లలకు నచ్చుతుంది. ఇందులో వారు కూర్చోవడానికి కొంత చోటును కూడా ఉంచాలి. మెత్తని కుషనూ, దిండ్లూ.. ఏర్పాటుతో దాన్ని తమకంటూ ప్రత్యేకమైన చోటుగా భావిస్తారు. అలమరలలో సబ్జెక్టు పుస్తకాలతోపాటు కథల పుస్తకాలనూ విడిగా సర్దితే చాలు. ఆసక్తి కలిగినప్పుడల్లా చదవడం మొదలుపెడతారు.


విడిగా..

చిన్న గది లేదా వారి గదికి పక్కగా ఉండే స్థలాన్ని పిల్లల లైబ్రరీగా మార్చొచ్చు. గోడకు అమర్చిన స్టాండులో వరసగా కథలు, అంతరిక్షం, సైన్స్‌ అంటూ..వారికిష్టమైన సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు సర్దాలి. కింద చిన్న కార్పెట్‌, దిండ్లు లేదా పిల్లల కోసం వస్తున్న సోఫాలాంటిది ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అది వారి మనసుకు నచ్చిన చోటుగా మారిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్