టీ.. నీళ్లు... ఏవీ వృథాకావిక

ఉరుకుల పరుగుల జీవనశైలిలో... సులువుగా పనయ్యే చిట్కాలనే కాదు... స్మార్ట్‌ టూల్స్‌నీ వినియోగించినప్పుడే ఒత్తిడి దరిచేరదు. పనీ తేలికవుతుంది ఇందు కోసమే ఈ సూచనలు.

Published : 28 Feb 2024 01:27 IST

స్మార్ట్‌ కిచెన్‌

ఉరుకుల పరుగుల జీవనశైలిలో... సులువుగా పనయ్యే చిట్కాలనే కాదు... స్మార్ట్‌ టూల్స్‌నీ వినియోగించినప్పుడే ఒత్తిడి దరిచేరదు. పనీ తేలికవుతుంది ఇందు కోసమే ఈ సూచనలు.


పెంగ్విన్‌ అందించే చాయ్‌!

వేడివేడిగా పొగలు కక్కే టీ తాగుతూ ఆస్వాదించడం కొందరికి ఎంతో ఇష్టం. ఇంకొందరికి కాస్తైనా చాయ్‌ గొంతులో పడనిదే రోజు గడవదు. అయితే, ఒక్కోసారి పని ఒత్తిడితో దాన్ని కాచే సమయం ఉండకపోవచ్చు. ఇంకొన్నిసార్లు పొయ్యి మీద టీ పెట్టి... మాటల్లో పడి మర్చిపోవడమో, ఫోన్‌ కాల్‌ మాట్లాడుతూ ఉండిపోవడమో చేస్తుంటాం. దీంతో అది కాస్తా మరిగి పొంగిపోతుంది. ఈ ఇబ్బంది లేకుండా హాయిగా తేనీటిని రుచి చూడాలంటే పెంగ్విన్‌ ఆకృతిలో ఉండే ఈ ఆటోమేటిక్‌ టీ మేకర్‌ని తెచ్చుకోండి. ఈ మేకర్‌ దగ్గర వేణ్నీళ్లు పెట్టి... టైమ్‌ సెట్‌ చేసి ముక్కుకో టీ బ్యాగ్‌ తగిలిస్తే చాలు... అది నీళ్లల్లో పూర్తిగా కలిసే వరకూ ముంచి తీస్తుంది. సమయం పూర్తవ్వగానే చాయ్‌ని మీకందిస్తుంది.


నీళ్లు చెదిరిపోకుండా!

సింక్‌ దగ్గర గిన్నెలు కడిగేటప్పుడు ఒక్కోసారి నీళ్లు చిమ్ముతూ ఉంటాయి. దీంతో దుస్తులు తడిచిపోతుంటాయి. నేలపై పడి ఫ్లోర్‌ అంతా తడి అవుతుంది. దీంతో చేయాల్సిన పనికాస్తా రెట్టింపు అవుతుంది. ఇలాంటి పరిస్థితే మీకూ ఎదురవుతోందా? అయితే, వాటర్‌ స్ప్లాష్‌గార్డ్‌ని ఎంచుకుంటే సరి. ఇది మీ ఇబ్బందులన్నింటికీ చెక్‌ పెట్టేస్తుంది. సిలికాన్‌తో చేసిన దీన్ని ఎక్కడ సమస్య ఉందనిపిస్తోందో అక్కడ గోడకో, గట్టుకో అతికిస్తే చాలు... నీళ్లు చెదిరిపోవు. తరవాత దీన్ని శుభ్రపరుచుకోవడమూ సులువే. పైగా ఫోల్డబుల్‌ కావడంతో అవసరం లేనప్పుడు తీసి భద్రపరుచుకోవచ్చు కూడా!


రెండు వేళ్లతో...

సాధారణంగా ఇంట్లో కూరగాయలు, పండ్లతొక్కలు తీసేందుకు గ్రిప్‌ పీలర్‌ను వాడుతుంటాం. ఐదువేళ్లతో పీలర్‌ని పట్టుకుని తీయడం వల్ల చేతులు నొప్పిపుడుతూ గాయాలు కూడా అవుతుంటాయి. ఇక ఆ సమస్యను దూరం చేసేందుకు ఈ ‘డబుల్‌ ఫింగర్‌ సిలికాన్‌ గ్రిప్‌ పీలర్‌’ ను వాడేయండి. దీన్ని రెండువేళ్లతో పట్టుకుని సులువుగా, వేగంగా తొక్కలను తీసేయొచ్చు. వాడి చూడండి మీ పనెంత తేలికవుతుందో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్