అందాల దేవగన్నేరు పెంచేద్దామా

చక్కటి సువాసన, చూపరులను కట్టిపడేసే అందం దేవగన్నేరు పూల సొంతం. అందుకే ఇంట్లో కనీసం ఓ మొక్కనైనా పెంచుకోవాలని అనుకుంటుంటారు ఉద్యాన ప్రియులు.

Published : 29 Feb 2024 01:49 IST

చక్కటి సువాసన, చూపరులను కట్టిపడేసే అందం దేవగన్నేరు పూల సొంతం. అందుకే ఇంట్లో కనీసం ఓ మొక్కనైనా పెంచుకోవాలని అనుకుంటుంటారు ఉద్యాన ప్రియులు. అలాంటి ఆలోచనలో మీరూ ఉన్నారా? అయితే, మీకోసమే ఈ సూచనలు.

దేవగన్నేరు పూలను ఎక్కువగా మనదేశంలో దేవతార్చనకు ఉపయోగిస్తారు. బహుశా ఈ పేరూ అందుకే వచ్చిందేమో!  అపోసైనేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క చాలా దేశాల్లో పెరుగుతుంది. ఈ మధ్య సోషల్‌మీడియాలోనూ ఈ పూలు మంచి పాపులారిటీనీ సంపాదించుకున్నాయి.

తెలుపు, పసుపు, ఎరుపూ-గులాబీ కలగలిసినట్లుంటే క్రిమ్సన్‌ వంటి ఎన్నో వర్ణాల్లో ఈ పూలు విరబూస్తాయి. వీటిల్లో ఏక రంగు రకమే కాదు... రెండు మూడు ఛాయల్లోనూ కనువిందు చేసేవీ ఉన్నాయి. ఇలా వీటిల్లో కనీసం 300 రకాలకు పైగానే ఉన్నాయట. దేవగన్నేరు మొక్క శాస్త్రీయ నామం ఫ్లూమీరియా రుబ్రా. దీన్నే ఫ్రాంగిపాని అని కూడా పిలుస్తారు.

ప్రాంతాన్ని బట్టి మరెన్నో రకాలుగానూ ఇది వాడుకలో ఉంది. ఈ మొక్కకు పుష్పగుచ్ఛాలు వేర్వేరుగా పూస్తాయి. అంతేకాదు, ఇవి ఎంత అందం, సువాసనా ఉన్నా వీటిల్లో తేనెలేని కారణంగా తేనెటీగలు మాత్రం దరిచేరవట. అయితే, ఈ పూల నుంచి తీసిన నూనెల్ని చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

కుండీల్లోనూ పెంచుకోవచ్చు...

దేవగన్నేరు మొక్కను నేలలోనే కాదు... కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అయితే, ఇందుకోసం గుబురుగా, పెద్ద ఎత్తు ఎదగని డ్వార్ఫ్‌ వెరైటీలను నాటుకుంటే చూడముచ్చగా ఉంటాయి. ఫ్లూమీరియాను మంచి నీటి పారుదల  ఉన్న ఇసుకనేలల్లో పెంచుకోవచ్చు. ఒకవేళ కుండీల్లో పెంచుకోవాలనుకుంటే... ఆమ్లతత్త్వం కూడా ఉన్న మట్టిని వినియోగించండి. అయితే, ఇందుకు తొట్టెను కాస్త పెద్ద పరిమాణంలో తీసుకుంటే మేలు. ఆపై నీరు నిలవని, పోషకాలు ఎక్కువగా ఉన్న పొడిమట్టిని నింపుకోవాలి. ఇందులో విత్తనాలు, గ్రాఫ్టింగ్‌ పద్ధతుల్లో అంటుకట్టిన మొక్కల్ని నాటుకోవచ్చు. అది మొదలు తగిన సంరక్షణ అందిస్తే మూడేళ్లకు పుష్పించడం ప్రారంభిస్తుంది. అయితే,  ఏడాదికోసారి వేర్లు దెబ్బతినకుండా రీపాటింగ్‌ చేసుకోవాలి.

వేసవి ప్రారంభంలో ఈ పని చేస్తే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. భాస్వరం మోతాదు ఎక్కువగా ఉండే ఎన్‌పీకే సమగ్ర ఎరువుని ప్రతి పదిహేను రోజులకోసారి ఇస్తే పూలు విరబూస్తాయి. ఈ మొక్క గుబురుగా పెరగాలన్నా, తరచూ ప్రూనింగ్‌ చేయాలి. తెల్లదోమ, ఈగలు వంటివి ఈ మొక్కపై దాడి చేస్తాయి. ఇలాంటప్పుడు సర్ఫ్‌, వెనిగర్‌ కలిపిన మిశ్రమాన్ని ఆకులపై చల్లొచ్చు. లేదంటే లీటరు నీటిలో చెంచా వేపనూనె కలిపి అందించొచ్చు. ఇవన్నీ చేసినప్పుడే మీరు కోరుకున్నట్లు మొక్క నిండుగా విరబూస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్