ఈ వయసులో ఏం తినిపించాలి?

మా బాబు వయసు 11 సంవత్సరాలు. స్కూల్‌కి వెళ్లేముందు అల్పాహారం మానేస్తున్నాడు. బరువు పెరగడం లేదు.

Published : 21 Mar 2024 16:28 IST

మా బాబు వయసు 11 సంవత్సరాలు. స్కూల్‌కి వెళ్లేముందు అల్పాహారం మానేస్తున్నాడు. బరువు పెరగడం లేదు. దీనికి కారణం టిఫిన్‌ మానేయడమేనా... ఈ వయసులో తనకు ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి.

ఓ సోదరి, విజయవాడ.

మీ బాబు బరువు ఎంతో చెప్పలేదు. 10 నుంచి 12 ఏళ్ల వయసు అంటే పిల్లలు శారీరకంగానూ, మానసికంగానూ ఎదిగే సమయమిది. మీ బాబు బరువు పెరగడం లేదంటున్నారు. కాబట్టి ప్రస్తుతం తన బరువుని బట్టి ఆహారాన్ని పెట్టాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లే హడావుడిలో టిఫిన్‌ తినడం మానేస్తారు. కానీ ఈ వయసులో అల్పాహారం చాలా ముఖ్యం. ఇది రోజు మొత్తానికి కావాల్సిన పోషకాలనీ, శక్తినీ అందిస్తుంది. అయితే అల్పాహారంలో కూడా పోషకాలన్నీ ఉండేలా చూసుకోవాలి. క్యారెట్‌ తురుము, బఠాణీలనీ ఇడ్లీపిండిలో కలిపి ఉడికిస్తే మేలు. అలాగే దోసె పిండిలో కాయగూరలు, ఆకుకూరలు కలిపి వేయాలి. వీటితోపాటు గుడ్డు, పాలు కూడా ఇవ్వాలి. రోజూ సీజనల్‌ పండ్లను ఒక కప్పు ఇవ్వాలి. చిరుతిండిగా నట్స్‌ పెట్టాలి. వీలైనంత వరకు మోతాదుకి మించకుండా మూడుపూటలా ఆహారం, రెండుసార్లు స్నాక్స్‌ అందేలా చూసుకోవాలి. కాబట్టి మధ్యాహ్న భోజనంలో చపాతీ లేదా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌రైస్‌, కిచిడీ పెడితే మంచిది. సాయంత్రం ఫ్రూట్‌మిల్క్‌షేక్‌ను ఇవ్వొచ్చు. వీటికి బదులుగా ఉడికించిన శనగలు, బొబ్బర్లు, పెసర్లను సలాడ్‌ రూపంలో పెట్టొచ్చు. వీటితోపాటు మరమరాలూ, అటుకులనూ చిరుతిండిగా ఇవ్వొచ్చు. రాత్రి భోజనంలో కాయగూరలతో పాటు పప్పు తప్పనిసరిగా పెట్టాలి. మాంసాహారులైతే చేప, గుడ్డు, చికెన్‌, మటన్‌లను ఆహారంలో చేర్చాలి. వీటినుంచి బాబుకి కావల్సిన ప్రొటీన్‌ లభిస్తుంది. 10 నుంచి 12 సంవత్సరాలుండే పిల్లలు సుమారుగా 25కిలోల బరువుంటే రోజుకి 1300గ్రాముల కెలోరీలు, 32 నుంచి 35 గ్రాముల ప్రొటీన్‌ అవసరం అవుతుంది. కాబట్టి ఎంత మోతాదులో ఆహారాన్ని అందించాలి అనేది వారి బరువు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పోషకాహార నిపుణులను సంప్రదించి ఆహార నియమాలను పాటిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్