గోవర్ధనాల గుబాళింపు!

గోధుమ రంగు కలగలిపిన తెలుపులో విరిసే పూలు, ముదురాకుపచ్చ రంగులో మెరిసే ఆకులు, హాయినిచ్చే పరిమళం గోవర్ధన పూల సొంతం. వేడి వాతావరణంలో చక్కగా ఎదగడం, పూలు పూయడం వీటి ప్రత్యేకత.

Published : 28 Mar 2024 01:56 IST

గోధుమ రంగు కలగలిపిన తెలుపులో విరిసే పూలు, ముదురాకుపచ్చ రంగులో మెరిసే ఆకులు, హాయినిచ్చే పరిమళం గోవర్ధన పూల సొంతం. వేడి వాతావరణంలో చక్కగా ఎదగడం, పూలు పూయడం వీటి ప్రత్యేకత. మరి ఇన్ని ప్రయోజనాలున్న వీటిని ఇంటి ముంగిట పెంచుకోవాలని ఎవరు అనుకోరు చెప్పండి? మీకోసమే ఈ సూచనలు...

రూబియేసి కుటుంబానికి చెందిన పూల మొక్క గార్డినియా. దీన్ని మనదేశంలో గోవర్ధన, గంధరాజ్‌...వంటి పేర్లతో పిలుస్తారు. ఐదు నుంచి పన్నెండు రేకలతో... తెలుపు, పాల మీగడ రంగులో ఈ పూలు వికసిస్తాయి. చిన్న చిన్న పక్షులు, తేనెటీగలూ, సీతాకోక చిలుకలు వంటివాటిని ఆకర్షిస్తూ పెంచుకున్న ప్రదేశానికి అదనపు అందాన్ని తెచ్చిపెడతాయి. అంతేనా, ఈ మొక్కకు గాల్లోని టాక్సిన్‌లను తొలగించి వాతావరణాన్నీ శుద్ధి చేయగల శక్తి ఉందట.

సంరక్షణ ఇలా...

దీన్ని నేలలోనే కాదు... కుండీల్లోనూ చక్కగా పెంచుకోవచ్చు. నేరుగా తగిలే సూర్యకాంతిలో ఆరోగ్యంగా ఎదుగుతుంది. అలానే, వెలుతురు ఎక్కువగా ఉండి పాక్షికంగా నీడ ఉన్న చోటా వీటిని పెంచుకోవచ్చు. అయితే, ఇందుకు తేమగా ఉండే సారవంతమైన మట్టిని ఎంచుకోవాలి. అలాగని నీరు నిలిచినా, పొడిబారినా మొగ్గలు సరిగా విచ్చుకోవు. మొక్క చుట్టూ ఉన్న మట్టిని కనీసం రెండు నుంచి నాలుగు ఇంచులు మల్చింగ్‌ చేయడం వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సమన్వయం అవడంతో పాటు తేమా కోల్పోదు. కనీసం నెలకోసారైనా ఎన్‌పీకే ఎరువునీ, కాఫీగింజలూ, వాడేసిన టీపొడి, రంపపు పొట్టు, ఎప్సమ్‌ సాల్ట్‌ వంటివి వేస్తే చాలు, మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. పూలూ నిండుగా పూస్తాయి. ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం వల్ల మొక్క ఎత్తుని నియంత్రించవచ్చు. సాధారణంగా దీనికి బూజు తెగులు, ఆకు మచ్చలు, తెల్లదోమ, మిల్లీబగ్స్‌ వంటి ఇబ్బందులు కనిపిస్తాయి. చీడ ఉన్న ఆకుల్ని కత్తిరించి దూరంగా పారేసి, వేపనూనె, వెల్లుల్లి కషాయాన్ని నీళ్లల్లో కలిపి మొక్కలకు స్ప్రే చేస్తే సమస్య దూరం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్