‘రుతు’ రాగాలు..!

‘ఆడవాళ్ల ఆలోచనలను కనిపెట్టలేం’, ‘వాళ్ల మూడ్‌ ఎప్పుడెలా ఉంటుందో’...  ఇలా మనల్ని ఎన్నెన్నో మాటలు అంటుంటారు. వాళ్లే కాదు... అనుకోకుండా నీరసం ఆవరించినా, భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయినా ఒక్కోసారి ‘అరె... ఎందుకలా చేశా’ అన్న సందేహం మనకీ వస్తుంది.

Updated : 30 Mar 2024 13:38 IST

‘ఆడవాళ్ల ఆలోచనలను కనిపెట్టలేం’, ‘వాళ్ల మూడ్‌ ఎప్పుడెలా ఉంటుందో’...  ఇలా మనల్ని ఎన్నెన్నో మాటలు అంటుంటారు. వాళ్లే కాదు... అనుకోకుండా నీరసం ఆవరించినా, భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయినా ఒక్కోసారి ‘అరె... ఎందుకలా చేశా’ అన్న సందేహం మనకీ వస్తుంది. అందుకు కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?

బాగా ఎండగా ఉంది కదాని వడియాలు పెట్టడమో, దుప్పట్లన్నీ ఉతికి ఆరేయడమో చేస్తామా... టపాటపా చినుకులు పడి ఆశ్చర్యపరుస్తాయి. బాగా మబ్బులు పట్టి ఉన్నాయి, పెద్ద వర్షం ఖాయమనుకుంటే నిమిషాల్లో వీడిపోయి సూర్యకిరణాలు పలకరిస్తాయి... ఇలాంటి ఉదాహరణలు మనకెన్ని పరిచయమో కదా? ప్రకృతిలోని మాయే అది. మన శరీరమూ అందుకు భిన్నం కాదు. అంతెందుకు, ప్రకృతిలో వసంత, గ్రీష్మ, వర్ష, హేమంత రుతువులు ఉన్నట్లే మన జీవితంలోనూ ఇంకా చెప్పాలంటే నెలసరిలోనూ వాటి తాలూకు చిహ్నాలు కనిపిస్తాయి. ఒక్కో కాలం ఒక్కో అందాన్ని మోసుకొస్తుంది. అడపాదడపా వాటిల్లో వచ్చే మార్పులు కాస్త ఇబ్బంది పెడతాయి. మనమూ అంతే! అందుకే అందానికి మారుపేరే అయినా... మనలోని చిన్న చిన్న మార్పులు చూసేవారికీ, మనకీ కాస్త కష్టంగా తోస్తాయి. ఇంతకీ మనలోని ఆ రుతువులేంటో తెలుసా?

  •  బాల్యం...

ఎంత అందమైన కాలమో! అమాయకత్వంతో ఆనందంగా గడిపేస్తాం. మనుషుల్నీ, చుట్టూ వాతావరణాన్నీ గమనించుకుంటూ మనల్ని మనం నిర్మించుకుంటాం. శక్తిమంతమైన మహిళగా ఎదిగే క్రమంలో పునాది పడేదీ ఇక్కడే.

  • యుక్తవయసు...

హార్మోనుల్లో హెచ్చుతగ్గులు, శరీరంలో మార్పులు... ఒకపక్క ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మరోపక్క పెరిగే బరువు, మొటిమలు, కమ్ముకొచ్చే భావోద్వేగాలు ఇబ్బంది పెడుతుంటాయి. ‘నేనేంటి? నా స్థానమెక్కడ? నా ఉనికేంటి?’... ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముట్టేస్తుంటాయి. నిజానికి మన జీవితంలో అతి దీర్ఘమైన రుతువిదే!

  • ప్రీ మెనోపాజ్‌

ఈ క్షణం ఉన్నట్లు మరోక్షణం అనిపించదు. అంతలా శరీరంలో మార్పులొచ్చేస్తాయి. నిద్ర పట్టదు. ఒళ్లంతా వేడి ఆవిర్లు, నెలసరిలో ఇబ్బందులు, అదుపు చేయలేని భావోద్వేగాలు... లాంటివెన్నో సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ఒక పరిశోధన ప్రకారం ఈ వేడి ఆవిర్లు పదేళ్ల వరకూ ఉంటాయంటే ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతామో ఊహించొచ్చు. ఈ రుతువు మనకు గతాన్ని గుర్తుచేస్తుంది. అసలేం అవ్వాలనుకున్నాం... బాధ్యతల్లో పడి అవన్నీ ఎలా పక్కకు వెళ్లాయన్నవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయట.

  • మెనోపాజ్‌

నెలసరికి చోటుండదు. శారీరకంగా ఇబ్బందులు పెరుగుతాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? ఈ సమయంలో మనలో సృజనాత్మకత పెరుగుతుందట. లోలోపలి అనుమానాలు, తమను తాము నిందించుకోవడం వంటివన్నీ పక్కకు వెళ్లిపోతాయి. తెలియని మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. ఆశ్చర్యంగా లేదూ!


మరి నెలసరితో సంబంధమేంటి? అంటే...

సాధారణంగా ఒక మహిళ రుతుచక్రం 28-30 రోజులు అనుకుంటే....

  • మొదటివారంలో ఓవరీస్‌ నుంచి ఈస్ట్రోజన్‌ విడుదలవ్వడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆనందం, శక్తి స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అంతెందుకు ఏ పనైనా చిటికెలో చేయగలమన్న ఆత్మవిశ్వాసమూ కనిపిస్తుంది.
  • రెండోవారంలో ఈస్ట్రోజన్‌ స్థాయులు క్రమంగా తగ్గుతూ వస్తాయి. శక్తి ఉంటుంది, చకచకా పనులు చక్కబెట్టేస్తుంటాం కూడా! కాకపోతే ఉత్సాహమే తగ్గుతుంది. ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ విడుదల పెరుగుతుంది. అండం విడుదలై ఫలోపియన్‌ నాళాల్లోకి ప్రవేశిస్తుంది. అప్పటివరకూ మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాం. అయితే నెమ్మదిగా శక్తి తగ్గి, భావోద్వేగాల్లో పట్టు కోల్పోతూ ఉంటాం.
  • మూడోవారంలో అండం ఫలదీకరణం చెందకపోతే... ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోనుల విడుదల ఆపమని మెదడు సంకేతాలిస్తుంది. చిన్న విషయానికీ భావోద్వేగాలు ప్రభావం చూపడం మొదలుపెడతాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. లోలోపల ఖాళీ భావన. ఏకాకిగా మిగిలామని అనిపిస్తుంది. ఎవరితోనూ కలవాలని అనిపించదు, ఏ పనిపైనా ఆసక్తి కలగదు.
  • నాలుగోవారంలో హార్మోనులతోపాటు అండం ఆరోగ్యంగా పెరగడానికి ఏర్పడిన ఎండోమెట్రియల్‌ పొర కూడా శరీరాన్ని వీడటానికి సిద్ధమవుతుంది. సింపుల్‌గా పీరియడ్‌ ప్రారంభమవుతుంది. శారీరకంగానే కాదు, మానసికంగానూ అసౌకర్యం. అందుకే ఆ సమయంలో ఒత్తిడి, ఆందోళన పక్కన పడేసి శరీరానికి విశ్రాంతినివ్వాలి. నచ్చిన సినిమా, కావాల్సినంత నిద్ర, వేడినీటి స్నానం అంటూ సేదతీరాలి.

చూశారా... మన శరీరం లోలోపల ఎంత కష్టపడుతోందో? కాబట్టి ఆ క్షణం కోపంతో అరిచినా, మరుక్షణం బాధ కమ్మేసినా, వెంటనే పెదాలపై చిరునవ్వు విరిసినా... ఏదో అవుతోందన్న కంగారొద్దు. మీ శరీరాన్నీ, దానిలోని రుతువుల మార్పులనూ అర్థం చేసుకోండి. లోపల ఏమవుతోందో అర్థం చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఏం చేయాలన్నదీ తెలుస్తుంది. అప్పుడు సంఘర్షణలకు తావుండదు కదా! ఏమంటారు?


తొలి మహిళ

సరళ తుక్రల్‌... భారత తొలి మహిళా పైలట్‌. దిల్లీలో జన్మించిన ఈమె 21వ ఏట ఫ్లయింగ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి... చీర కట్టుతో దాదాపు 1000 గంటలు విమానం నడిపారు. ఏ గ్రేడ్‌ లైసెన్స్‌ పొందిన మొదటి భారతీయ మహిళ. తరవాత పెయింటింగ్‌ కోర్సులు చేసి, ఆంత్రప్రెన్యూర్‌గానూ మారారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్