తోట పని తేలికచేస్తాయ్‌!

నర్సరీలో మొక్కల్ని చూస్తే చాలు... ఇంటికి తెచ్చి పెంచాలనిపిస్తుంది. తీరా వాటిని తొట్టెలో వేసిన వారం పది రోజులకే వాడిపోవడం మొదలవుతుంది. ఇలా కాకుండా ఉండాలనే మొక్కలు పెంచే వారి కోసం మార్కెట్‌లో రకరకాల పరికరాలు దొరుకుతున్నాయి.

Published : 02 Apr 2024 02:06 IST

నర్సరీలో మొక్కల్ని చూస్తే చాలు... ఇంటికి తెచ్చి పెంచాలనిపిస్తుంది. తీరా వాటిని తొట్టెలో వేసిన వారం పది రోజులకే వాడిపోవడం మొదలవుతుంది. ఇలా కాకుండా ఉండాలనే మొక్కలు పెంచే వారి కోసం మార్కెట్‌లో రకరకాల పరికరాలు దొరుకుతున్నాయి. ఇవి గార్డెనింగ్‌ను తేలిక చేస్తున్నాయి.


విత్తనానికి..

కొబ్బరిపీచు, ఎరువుల మిశ్రమంతో వచ్చే స్పాంజిలాంటి ఈ గుండ్రని పేట్లు విత్తనాలను త్వరగా మొలకెత్తేలా చేస్తాయి. పూలు, కూరగాయల విత్తనాలను వీటిలో తేలికగా మొలకెత్తించొచ్చు. ముందుగా ఈ కాయిర్స్‌ రెండుమూడింటిని కలిపి నూలు చుట్టి నీటితో తడపాలి. రాత్రంతా నాననిచ్చి, వీటిలో  విత్తనాలు వేయాలి. నీడ పట్టున ఉంచితే,  రెండువారాల్లోపు మొలకలొస్తాయి. ఆ తర్వాత అందులోనే వారం రోజులుంచి,  మొక్కతోసహా కాయిర్స్‌ను మట్టి నింపిన తొట్టెలో ఉంచితే సరిపోతుంది. మొక్క మొలకెత్తడానికే కాకుండా, ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఇది సాయపడుతుంది.


గ్రోయింగ్‌ బాక్స్‌..

విత్తనాలు వేటికవి విడివిడిగా మొలకెత్తించడానికి మూతతోపాటు పెద్ద బాక్సులా ఉంటుంది. ఇందులో ఆరు పొడవైన చిన్నచిన్న లోతైన డబ్బాల్లా ఉంటాయి. వీటిలో  ఎరువు కలిపిన మట్టి నింపి విత్తనాల్ని వేసి నీటిని చల్లాలి. మూత పెట్టి, ఎండ ఎక్కువగా పడని చోట ఉంచి నీళ్లను చిలకరిస్తుండాలి. వారం పది  రోజులకు వీటిలో మొలకలొస్తాయి. తర్వాత విడిగా తీసి తొట్టెల్లో నాటితే ఆరోగ్యంగా ఎదుగుతాయి. 


హైడ్రోఫోనిక్‌ సెట్‌...

గొట్టం ఆకారంలో పొడవుగా ఉండి, పైభాగంలో ఒక్కొక్కటి చొప్పున అయిదు రంధ్రాలున్న పరికరమిది. ప్రతి రంధ్రంలో మొక్కలు ఉంచడానికి వీలుగా చిన్న ప్లాస్టిక్‌ గ్లాసులాంటివి లోపల ఉంటాయి. ఎరువు కలిపిన మట్టితో వీటిని నింపి, గొట్టానికి ఉన్న రంధ్రాల్లో ఒక్కొక్కదాంట్లో ఒక్కొక్కటి ఫిక్స్‌ చేయాలి. ఒక్కో గ్లాస్‌లో కొత్తిమీర, తోటకూర వంటి అయిదు రకాల ఆకుకూరలను పెంచుకొనే సౌలభ్యం ఇందులో ఉంది. ఆయా విత్తనాలు విడివిడిగా చల్లి నీటిని అందిస్తే చాలు. వంటింటి కిటికీలోనూ ఆరోగ్యకరమైన సేంద్రియ ఆకుకూరలను పెంచుకోవచ్చు.


ట్రే...

ఇంట్లో ఈ ట్రే లాంటిది ఉంటే ఎప్పటికప్పుడు మైక్రో గ్రీన్స్‌ను తాజాగా పెంచి ఆహారంలో తీసుకోవచ్చు. ఇందులో రెండు రకాల ట్రేలు విడివిడిగా ఉంటాయి.  పై ట్రే... చిన్నచిన్న సూక్షరంధ్రాలుండే నెట్‌లా ఉంటుంది. మొదట కింద ట్రేను నీటితో నింపి, దీనిపై విత్తనాలు చల్లిన ట్రేను ఉంచాలి. రెండువారాల్లోపు పై ట్రేలో విత్తనాలు మొలకెత్తుతాయి.


మినీ గ్రీన్‌ హౌస్‌...

మొక్కలు మొలకెత్తుతున్నప్పుడు లేదా పూర్తిగా ఎదగనప్పుడు ఎండ వేడిని తట్టుకోలేవు. అటువంటప్పుడు ఈ మినీ గ్రీన్‌ హౌస్‌లో ఉంచితే సంరక్షణ అందుతుంది. పరిమాణంలో చిన్నగా ఉండటంతో దీన్ని బాల్కనీలోనూ ఉంచొచ్చు.  


రూటింగ్‌ బాక్స్‌..

గులాబీ, మందార, మామిడి, జామ వంటివాటిని అంటు కట్టించడానికి ఈ బాక్సులు సౌకర్యంగా ఉంటాయి. ఏ కొమ్మనైతే అంటుకట్టాలనుకుంటున్నామో అక్కడి కాండంపై ఆకుపచ్చని భాగాన్ని మాత్రం రెండుమూడు అంగుళాలమేర కత్తితో తొలగించాలి. రూటింగ్‌ బాక్సులో ఎరువు కలిపిన మట్టిని నింపి చెక్కి ఉంచిన చోట కొమ్మకు రెండువైపులా ఉంచి ఫిక్స్‌ చేస్తే చాలు. దీన్లోకి గాలి చొరబడదు. రెండు వారాలకు కొమ్మ నుంచి వేర్లు రావడం మొదలవుతుంది. బాక్సు తొలగించి, వేర్లు వచ్చిన చోట నుంచి కొమ్మను కత్తిరించి విడదీయాలి. దీన్ని వేరే తొట్టెలో నాటితే కొత్త మొక్కగా ఎదుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్