పరిమళించే పారిజాతం!

రెక్కలతో విచ్చుకున్న నక్షత్రాల్లా... ధవళవర్ణంలో మెరిసిపోతూ పరిమళాలను వెదజల్లే పారిజాత పూలను ఇష్టపడని వారుండరు. పగడాలను పోలిన కాడలతో... చెట్టంతా విరబూసి నింగిలోని తారకలే దిగి వచ్చాయా అనిపించే వీటి అందాన్ని చూసి మురిసిపోనివారూ కనిపించరు.

Published : 04 Apr 2024 01:38 IST

రెక్కలతో విచ్చుకున్న నక్షత్రాల్లా... ధవళవర్ణంలో మెరిసిపోతూ పరిమళాలను వెదజల్లే పారిజాత పూలను ఇష్టపడని వారుండరు. పగడాలను పోలిన కాడలతో... చెట్టంతా విరబూసి నింగిలోని తారకలే దిగి వచ్చాయా అనిపించే వీటి అందాన్ని చూసి మురిసిపోనివారూ కనిపించరు. మీరూ అంతేనా, మరి మీ ముంగిట్లో దీన్ని పెంచుకోవాలనుకుంటే ఇది చదివేయండి.

రిమళాలతో పరిసరాలను ఆహ్లాదపరిచే పారిజాత మొక్క ప్రాధాన్యం చెప్పే పౌరాణిక గాథలెన్నో! ఈ ఆకులు, కాయలూ, పూలూ... ఇలా అన్నింట్లోనూ ఔషధ గుణాలూ పుష్కలంగా ఉన్నాయంటోంది ఆయుర్వేదం. ఈ పూల ఆకృతి, రంగూ, వాసన ఆధారంగా... కోరల్‌ జాస్మిన్‌, నైట్‌ జాస్మిన్‌ వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఏడాదంతా పూస్తాయివి. నిక్టాంతస్‌ అర్బోర్‌ ట్రిస్టిస్‌ దీని శాస్త్రీయ నామం. అంటే... విచారకరమైన చెట్టు అని కూడా అర్థమట. రాత్రి పూట వికసించే పూలు... సూర్యుడి తొలికిరణాలు ప్రసరించే ముందే రాలిపోతాయి కాబట్టి దీనికా పేరు వచ్చిందని చెబుతారు. అందుకే ఉదయం పూట పూలన్నీ రాలి... నేలపై తెలుపూ, ఎరుపూ కలగలిపి అల్లిన తివాచీ పరిచినట్లుగానే కనిపిస్తుంది. సాధారణంగా మొక్క నుంచి తాజాగా కోసిన పూలను దేవుడికి సమర్పిస్తాం. కానీ, పారిజాతాలను కోయరు. నేలమీద రాలినవి సేకరించి మాత్రమే పూజకు వినియోగిస్తారు. ఈ మొక్క క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిందనీ, లక్ష్మీదేవికి ఇవంటే ఎంతో ప్రీతి అనీ చెబుతారు. అంతేకాదు, కృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుంచి దొంగిలించడానికి ప్రయత్నించి ఇక్కట్ల పాలయ్యాడనేది మరో కథనం.

కాయలకోసం పక్షులు

... సాధారణంగా ఈ మొక్క కాస్త ఎత్తుగా, గుబురుగా పెరుగుతుంది కాబట్టి నేలలో పెంచడమే అనుకూలం. కుండీల్లోనూ పెంచొచ్చు కానీ, కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని ఎంచుకోవాలి. మొక్కను ఎప్పటికప్పుడు ప్రూనింగ్‌ చేసుకోవాలి. విత్తనాలతో పాటు ఆరు అంగుళాల బలమైన కొమ్మను నాటడం ద్వారానూ కొత్త మొక్కలను ఉత్పత్తి చేయొచ్చు. ఈ పారిజాత మొక్క నేరుగా ఎండతగిలే చోటే కాదు... పాక్షికంగా నీడ ఉండే ప్రదేశాల్లోనూ పెరుగుతుంది. తేమ ఎక్కువగా ఉండే పొడి నేలల్లో ఇది బాగా ఎదుగుతుంది. వీటి కాయల్ని తినడానికి వచ్చే పక్షులతో ఇల్లంతా సందడి కూడా.

సంరక్షణ ఇలా... పారిజాతం మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి సారవంతమైన మట్టి కావాలి. నెలరోజలకోసారైనా మొక్క చుట్టూ ఉన్న మట్టిలో ఇసుక, ఆవుపేడ, కంపోస్ట్‌ వంటివి కలపాలి. చుట్టూ ఉన్న వేర్లు దెబ్బతినకుండా మల్చింగ్‌ చేసుకోవాలి. దీన్ని ఎక్కువగా వేధించే గొంగళి పురుగు సమస్యను నివారించడానికి వేపనూనె, యూకలిప్టస్‌ ఆయిల్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్