బొమ్మలతో రీసైకిల్‌ ..!

ఏడాదిలోపు సుతిమెత్తని బొమ్మల్నీ, అపై రకరకాల ఆట వస్తువుల్నీ బుజ్జాయిలు... వయసుకు తగ్గట్లు ఎంచుకుంటారు. తీరా వాటి సరదా తీరగానే పక్కన పెట్టేస్తారు. ఇలా  పదేళ్లొచ్చేసరికి చూస్తే... ఇంటినిండా బొమ్మలే. వీటిల్లో కొన్ని రూపురేఖల్ని కోల్పోతే, మరికొన్ని ఏ మాత్రం కొత్తదనాన్నీ కోల్పోవు. ఇలా ఎన్నాళ్లని దాచగలం.

Published : 07 Apr 2024 01:45 IST

ఏడాదిలోపు సుతిమెత్తని బొమ్మల్నీ, అపై రకరకాల ఆట వస్తువుల్నీ బుజ్జాయిలు... వయసుకు తగ్గట్లు ఎంచుకుంటారు. తీరా వాటి సరదా తీరగానే పక్కన పెట్టేస్తారు. ఇలా  పదేళ్లొచ్చేసరికి చూస్తే... ఇంటినిండా బొమ్మలే. వీటిల్లో కొన్ని రూపురేఖల్ని కోల్పోతే, మరికొన్ని ఏ మాత్రం కొత్తదనాన్నీ కోల్పోవు. ఇలా ఎన్నాళ్లని దాచగలం. అలాగని పిల్లల జ్ఞాపకాలను బయట పడేయలేం. ఈ సమస్యకు పరిష్కారమే ఈ రీసైకిల్‌.


పాత సీసాలతో...

రకరకాల జంతువుల బొమ్మలను తీసుకుని వాటికి ఆకర్షణీయమైన రంగులేయాలి. సమాన పరిమాణంలో నాలుగైదు గాజు సీసాలు తీసుకుని వీటి మూతలపై ఒక్కో జంతువు బొమ్మను అంటించి ఆరనిస్తే చాలు. వీటిల్లో పిల్లల పెన్సిళ్లు, పెన్నులు, చాక్లెట్లూ, మిఠాయిలు నింపితే సరి. చిన్నారుల మనసుదోచిన వన్యప్రాణుల బొమ్మలు వారెదుటే ఉంటాయి. పెద్ద సీసాలుంటే గనుక వాటిలో ఒకవంతు ఇసుక నింపి అందులో రెండుమూడు ప్లాస్టిక్‌ మొక్కలను ఉంచి మధ్యలో రంగురాళ్లు, గులకరాళ్లు, వాటిలో డైనోసార్‌, ఖడ్గమృగం వంటి బొమ్మలను సర్దితే చాలు. వాటిని వారి గదిలోని అలమరలో లేదా బల్లపై ఉంచితే ఎంతో అందంగానూ కనిపిస్తాయి.


వెలుగుల్లో ...

పాత జీపు, ట్రక్‌ వంటి బొమ్మలకు బల్బులు అమర్చి ప్లగ్‌ బోర్డు పక్కగా టేబుల్‌పై ఉంచాలి. రాత్రి గదంతా వెలుతురుతో నింపుతూ చిన్నప్పటి ఆ బొమ్మలు పిల్లల కళ్లలో వెలుగులను పూయిస్తాయి. అలాగే నైట్ల్యాంపు స్టాండుకు చుట్టూ కింద నుంచి పైవరకు చిన్నచిన్న బొమ్మలను అతికిస్తే చాలు. చూడచక్కని అలంకరణగా ఆ దీపం మారుతుంది.


గోడపై...

రకరకాల బోర్డుగేమ్స్‌ వృథాగా ఉంటాయి. వాటిని ఫ్రేంలో సెట్‌చేసి గోడకు తగిలించొచ్చు. అలాగే ఒక పల్చని చెక్క మధ్యలో గడియారం ముల్లులా నల్లని ప్లాస్టిక్‌ ముక్కలను అతికించాలి. అంకెలుండాల్సిన చోటల్లా ఒకే పరిమాణంలో ఉండే రంగురంగుల బొమ్మలను అంటించి గోడకు తగిలించాలి. అలాగే పిల్లల ఫొటో ఫ్రేమ్‌కు నాలుగువైపులా ఒకేరకమైన బొమ్మకార్లను అంటించి ఆరనివ్వాలి. ఆ తర్వాత పిల్లల గదిలో దాన్ని తగిలిస్తే చాలు. వారి ఆనందానికి అంతుండదు. వాడిన పెన్సిళ్లన్నీ ఒక ఫొటో ఫ్రేమ్‌ చుట్టూ అంటించి మధ్యలో దేన్నైనా అలంకరణగా తీర్చిదిద్దొచ్చు. రంగురంగుల కార్లన్నింటినీ సేకరించి ఒకే ఫ్రేమ్‌లో ఒకదానిపక్క మరొకటి ఉండేలా గమ్‌తో అంటించాలి. దానికి ఓ మూల పిల్లల చిన్నప్పటి ఫొటో పెట్టి చూడండి. వారెదిగిన తర్వాత కూడా ఆ ఫ్రేమ్‌ వారికి అపురూపమైన కానుకవుతుంది. అలాగే అయిదారు చిన్నచిన్న ఖాళీ ఫొటోఫ్రేమ్‌లను తీసుకొని వాటి మధ్యలో సగం వెనుకభాగాన్ని కట్‌ చేసిన వన్యప్రాణుల బొమ్మలను 3డీ ఎఫెక్ట్‌లో అంటించి గోడకు అలంకరించొచ్చు. ఇంకా పిల్లల పాత, విరిగిన టెన్నిస్‌బ్యాట్స్‌నూ అలంకరణ వస్తువుగా మార్చొచ్చు. డైనోసార్‌ వంటి బొమ్మ మధ్యలో రంధ్రం చేసి పిల్లల టూత్‌బ్రష్‌ స్టాండుగా చేయొచ్చు. ఇవన్నీ పిల్లలతోనే చేయిస్తే వారిలోని సృజనాత్మకత బయటకొస్తుంది. వృథాను రీసైకిల్‌ చేయడం కూడా నేర్చుకుంటారు. ఆలోచన బాగుంది కదూ. మరి మీ పిల్లలనూ ప్రోత్సహించండి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్