ఆ పేర్లెలా వచ్చాయి?

ఉగాది... చంద్రమానాన్ని అనుసరించి ఈ పండగను జరుపుకొంటాం. ప్రతి తెలుగు సంవత్సరాదికి పేరు ఉంటుందని తెలుసుగా? వీటి సంఖ్య 60. ప్రభవతో ప్రారంభమై అక్షయతో ముగుస్తాయి.

Published : 09 Apr 2024 01:28 IST

ఉగాది... చంద్రమానాన్ని అనుసరించి ఈ పండగను జరుపుకొంటాం. ప్రతి తెలుగు సంవత్సరాదికి పేరు ఉంటుందని తెలుసుగా? వీటి సంఖ్య 60. ప్రభవతో ప్రారంభమై అక్షయతో ముగుస్తాయి. అంటే ప్రతి అరవై సంవత్సరాలకు తిరిగి ‘ప్రభవ’తో ఆవృతం మొదలవుతుంది. ఇవి అరవయ్యే ఉండటానికి కారణాలేంటన్న దానికీ భిన్న వాదనలున్నాయి. శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారి ఒకరు. ఆమెకు అరవై మంది సంతానం. వాళ్ల పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని పురాణాల్లో చెబుతారు.

మరో కథా ప్రాచుర్యంలో ఉంది. నారదుడు నిత్య బ్రహ్మచారి. గొప్ప సన్యాసిననీ, తానంత భక్తుడు మరొకరు లేరనీ గర్వించడం మొదలుపెట్టాడట. అది గమనించిన శ్రీమహావిష్ణువు జ్ఞానబోధ చేయాలనుకున్నాడు. అందుకని నారదుడిని ఓ సరస్సులో స్నానం చేయమంటాడు. చేశాక ఆయన గతాన్ని మర్చిపోవడమే కాదు, రూపమూ స్త్రీగా మారిపోతుంది. ఓ రాజును పెళ్లాడి 60 మంది పిల్లలకు జన్మనిస్తుందామె. కానీ వాళ్లు యుద్ధంలో ఒకరి తరవాత ఒకరు మరణిస్తారు. అది చూసి దుఃఖంలో మునిగిపోతుంది. అప్పుడు శ్రీహరి ఆమెను తిరిగి నారదుడిగా మార్చి, సంసార బంధనాలు లేవు గనకనే భక్తుడిగా చలామణి అవుతున్నావంటూ హితబోధ చేస్తాడు. అంతేకాదు, ఆ పిల్లలే అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరిగేలా వరమిస్తాడు.

దక్షుడు, అసిక్నీ దంపతులకు అయిదు వేలమంది కొడుకులు. వాళ్లు నారదుడి సలహాతో ప్రాపంచిక వ్యవహారాలపై దృష్టిపెట్టి, ఎక్కడికో వెళ్లిపోతారు. తిరిగి రారు. తరవాత పుట్టిన వెయ్యి మంది సంతానానిదీ అదే పరిస్థితి. బిడ్డలంతా ఇలా దూరమవుతోంటే దక్షుడు దుఃఖంలో మునిగిపోతాడు. ఈసారి 60 మంది అమ్మాయిలు పుడతారు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలకు పెట్టారన్నది మరో కథ. ఏదేమైనా మానవ జీవితంలో 60 ఏళ్లు పూర్తవడాన్ని ఓ వలయంగా చెబుతారు. అది పూర్తవడం దగ్గర్నుంచి శరీరంలో మార్పులు మొదలవుతాయి. తిరిగి బాల్యం మొదలవుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, చిన్నవాటికే సంబరపడిపోవడం... వంటివన్న మాట. అప్పట్నుంచీ వారిని పిల్లల్లా సాకాల్సిన బాధ్యత వారి కడుపున పుట్టినవారిదే. అది సక్రమంగా సాగాలంటే... మనమూ అంతే నిబద్ధతతో బాధ్యతలను నిర్వర్తించాలనీ, పిల్లలకు ఆదర్శంగా నిలవాలనీ నిగూఢంగా చెప్పడమూ ఇందులో కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్