విరిసినదీ వసంతమాసం..!

లేత మామిడిచిగుళ్లూ... వాటిని తిని ఆలపించే గండుకోయిల సరాగాలూ... మరుమల్లెల సుగంధాలూ... వేపపూల సౌరభాలూ... ఇలా ఆమని పచ్చగా పల్లవిస్తూ పరిమళాలతో పరవశిస్తూ మధుమాసంలో నవ వధువులా నడిచివచ్చే ఉగాది లక్ష్మికి ఆహ్వానం పలుకుతోంది.

Published : 09 Apr 2024 01:45 IST

లేత మామిడిచిగుళ్లూ... వాటిని తిని ఆలపించే గండుకోయిల సరాగాలూ... మరుమల్లెల సుగంధాలూ... వేపపూల సౌరభాలూ... ఇలా ఆమని పచ్చగా పల్లవిస్తూ పరిమళాలతో పరవశిస్తూ మధుమాసంలో నవ వధువులా నడిచివచ్చే ఉగాది లక్ష్మికి ఆహ్వానం పలుకుతోంది. కాలచక్రంలోని ఆ రుతువులకీ సృష్టిలోని ఈ మగువలకీ ఎంతో సారూప్యం ఉందంటూ... ఎన్నో జీవితసత్యాలను ప్రబోధిస్తోంది ఆ సుందర ప్రకృతికాంత.

గువ ప్రకృతికి ప్రతిరూపం. మోడువారిన శిశిరాన్నైనా చిగురించిన వసంతాన్నైనా... ప్రకృతి నిశ్శబ్దంగా స్వాగతించినట్లే... స్త్రీ కూడా అనుకూల, ప్రతికూల పరిస్థితులను సమానంగా స్వీకరిస్తుంది. మగవాళ్లు చలించినట్లుగా ఎంతటి విపత్కర పరిస్థితికైనా మహిళలు విచలితులు కారు. ప్రకృతి వారికి ప్రసాదించిన వరమిది. అందుకే ఆ రుతువులన్నీ ప్రాకృతికంగానే కాదు, సామాజికంగా, ఆధ్యాత్మికంగానూ స్త్రీ జీవితానికి అద్దం పడుతుంటాయి.

ఆమని రాకతో...

నూతనత్వం లేని జీవితం రుతువులు లేని జగతి లాంటిది. కాలాలు మారినప్పుడే పుడమి పులకరిస్తుంది, కొత్తందాలతో పరవశిస్తుంది. మగువల మనసూ అంతే! నిత్యం సృజనాత్మకత కోసం పరితపిస్తుంది. రుతువుల రాణి అయిన వసంతం (ఆమని)లోనే ప్రకృతి కొత్త చిగుళ్లతో అలరిస్తుంది. అలాగే స్త్రీ సైతం తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ నవచైతన్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తుంది. చల్లని గాలులతో దిక్కులు ప్రసన్నంగా మారినట్లే చెదరని చిరునవ్వుతో ఇంటా బయటా అందరి మనసుల్నీ గెలుచుకుంటుంది. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి పులకించినట్లే తన ప్రియ వచనాలతో సహచరుల మనసులకి సాంత్వన కలిగిస్తుంటుంది. వసంతరుతువు పుష్పమాసమైన మధుమాసాన్ని వెంట తెచ్చి పుడమిని పరవశింపజేసినట్లే మహిళ సైతం వసంత నవరాత్రుల్ని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మికత సౌరభాలు వెదజల్లుతుంది.

గ్రీష్మరుతువు: ప్రకృతిలోని చైతన్యానికి ప్రతీక. ఈ కాలంలో భానుడి కిరణాలు భూమిని ఉత్తేజపరిచినట్లు, స్త్రీ తన ఉనికితో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నిత్య చైతన్యంతో ఉండేలా చేస్తుంది.

వర్షరుతువు:. దీన్ని హరిత రుతువు అనీ అంటారు. వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించేది పుడమిని వర్షం సస్యశ్యామలం చేసినట్లే... తనదైన శ్రమైక సౌందర్యంతో ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది వనిత.

శరదృతువు: వెన్నెల ప్రకాశవంతంగా ఉంటుంది. స్త్రీని మాతృభావనతో ఆరాధించే రుతువు ఇది. అందుకే ఈ కాలంలో మహిళలు దేవీ నవరాత్రులు చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఆ పూజాఫలంతో కుటుంబంలో వెలుగులు పూయిస్తారు.

హేమంత రుతువు: ప్రకృతికి బంగారు కాంతిని అద్దుతుంది. పాడిపంటలు ఇంటికి వచ్చే ఈ రుతువు దానధర్మాలకు పెట్టింది పేరు. అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తూ పంచడంలోని ఆనందానికి ప్రతీకగా నిలుస్తారు మహిళలు.

శిశిరరుతువు: చెట్లన్నీ ఆకులు రాల్చి, వసంతం కోసం వేయికళ్లతో వేచి చూస్తుంటాయి. ఈ రుతువు నుంచే మహిళ ఆశావహ దృక్పథాన్ని పుణికి పుచ్చుకుందేమో అనిపిస్తుంది. కటిక చీకటిలోనూ వెలుగుకోసం నిరీక్షిస్తూ...ప్రకృతికి నిలువెత్తు అద్దంగా నిలుస్తోంది.


ఇది... ‘క్రోధి’ నామ సంవత్సరం..!

క్రోధానికి కొత్త అర్థం....క్రోధినామ సంవత్సరం.. ఈ పేరు వినగానే గుండెలో గుబులు, మనసులో భయం. కానీ కోపానికి కొత్త అర్థాన్ని చెప్పాల్సిన సంవత్సరమిది. కాలానికి వచ్చే క్రోధం లోక సంక్షేమానికే. అలాగే ఇళ్లలో, పనిచోట్లలో మహిళలకు వచ్చే కోపానికీ అర్థం, పరమార్థం ఉంటాయనీ, అది ఆయా పరిస్థితులను చక్కదిద్దేందుకేననీ నిరూపించుకోగలగాలి. పురాణాల్లో అమ్మవారు క్రోధాన్ని బూనిన ప్రతిసారీ, లోకంలో ఓ రాక్షసుడి పీడ విరగడైంది. అలాగే మామూలుగా కోమలంగా శాంతంగా కనిపించే అమ్మాయిలు కూడా ఆపద ముంచుకొచ్చినప్పుడు... అపర కాళిలా విరుచుకుపడాలి. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదాదేవి సుమనస్విని, మృదుభాషిణి. నిరంతరం ఆధ్యాత్మిక సాధనల్లో నిమగ్నమై ఉండేవారు. వాళ్ల ఇంటిపక్కన ఉండే ఓ యువకుడు తాగివచ్చి రోజూ భార్యను కొట్టేవాడు. ఒకరోజు ఆ మైకంలో భార్యను బాగా కొట్టడంతో- ఆ యువతి బాధ భరించలేక గట్టిగా ఏడవసాగింది. ఆ సమయంలో శారదాదేవి ధ్యానంలో ఉన్నారు. ఆమె రోదన విన్నాక ప్రశాంతంగా ఉండలేక వేగంగా మేడపైకి వెళ్లారు. అక్కడ నిలబడి కిటికీలోంచి తీవ్ర స్వరంతో ‘ఓ మూర్ఖుడా! ఆ అమ్మాయిని కొట్టి చంపేస్తావా?’ అని బిగ్గరగా అరిచారు. సాధారణంగా శారదాదేవి అంత గట్టిగా మాట్లాడరు. ఆమె అలా గద్దించటం చుట్టుపక్కల వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ గంభీర కంఠధ్వని తాగుబోతుపై మంత్రంలా పనిచేసింది. భార్యను కొట్టటం ఆపేశాడు. మత్తు దిగాక క్షమాపణ చెప్పాడు. ఆపై ఎప్పుడూ చేయి చేసుకోలేదు. ‘కోపమే గల బతుకొక నరకమవును, కోపమే లేని బతుకొక శాపమగును’ అంటుంటారు. కాట్టి ఈ ‘క్రోధి’ నామ సంవత్సరంలో మనం సైతం అవసరమైనప్పుడు క్రోధాన్ని ప్రదర్శిద్దాం..!

బి.సైదులు, రామకృష్ణ మఠం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్